చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

by Disha edit |
చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?
X

చ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది.

జనసేనతో పాటు ఇప్పటికే షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్‌టీపీ, ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ చేరికతో బలోపేతమైన బీఎస్పీ, పంజాబ్ గెలుపుతో ఊపుమీదున్న ఆప్, కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వచ్చే ఎన్నికలలో బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉబలాటపడుతున్నాయి. ప్రజలలోకి చొచ్చుకువెళ్లే కార్యక్రమాలను చేపడుతున్నాయి. మరోవైపు, పాత కాపులు టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎం) ఉనికిని మనం తీసివేయలేం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ పార్టీలు ప్రస్తుతం పరిమిత స్థానాలలో అయినా గెలుపును ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నాయి.

గెలుపు గుర్రాల వేట

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయమున్నా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అప్పుడే ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాయి. ఓటర్లను ఆకర్షించే ఎజెండాలను, నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలను తయారు చేసుకునే పనిలో పడ్డాయి. జన సమీకరణ సభలను నిర్వహిస్తున్నాయి. పెద్దయెత్తున సర్వేలనూ చేపట్టాయి. ఏ నియోజకవర్గంలో ఎవరి ఓటు బ్యాంకు ఎంత? ఏ సామాజికవర్గాల ప్రాబల్యం ఎంతుంది? ఏ వర్గాల నుంచి తమకు మద్దతు లభిస్తుంది? ఏ వర్గాలు ప్రత్యర్థి శిబిరం వైపు ఉంటాయి? వగైరా విషయాలపై వివరాలు సేకరిస్తున్నాయి.

ఏ సెగ్మెంటులో ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటారు? మిగిలిన పార్టీలు ఎవరి ఓట్లను చీల్చుతాయి? అన్న విషయాలనూ బేరీజు వేసుకుంటున్నాయి. ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ త్రిముఖపోటీ జరగబోతోంది. మొత్తం 119 స్థానాలకు 110 స్థానాలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడు పార్టీల అభ్యర్థులే నేరుగా తలపడబోతున్నారు. మిగిలిన చిన్నపార్టీల అభ్యర్థుల పాత్ర కేవలం ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయడం మేరకే ఉండబోతోంది.

అభిమానుల ఓట్లు పడితే?

ఎనిమిది వరకు ఉన్న ఈ చిన్న పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీకి పడే ఓట్లను చీల్చబోతున్నాయనే పరిశీలన ఎవరికైనా ఆసక్తికరమే. మొదటగా జనసేననే తీసుకుందాం. ఈ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ యువతలో పెద్దయెత్తున అభిమానులున్నారు. పవన్ చెప్పింది విని వీరిలో ఎంతమంది జనసేనకు ఓటేస్తారన్నది ప్రశ్నార్థకమే అయినా, పడే ఓట్లు మాత్రం సాధారణంగా మూడు ప్రధాన పార్టీల ఓట్లనూ సమానంగా చీల్చవచ్చు. పట్టణప్రాంత యువత ప్రస్తుతం ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గుతున్నారు కనుక ఆ పార్టీకి జనసేన మూలంగా ఎక్కువ నష్టం జరగవచ్చు. పట్టణ ప్రాంత నియోజకవర్గాలలోనే పవన్ అభ్యర్థులను నిలిపిన పక్షంలో ఈ నష్టం మరింత ఎక్కువ ఉండవచ్చు కూడా.

ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు?

వైఎస్సార్‌టీపీని తీసుకుంటే, ఆ పార్టీకి దివంగత వైఎస్ అభిమానులే ప్రధాన ఓటుబ్యాంకుగా చెప్పవచ్చు. పార్టీ పెట్టినప్పటి నుంచీ అధినేత్రి షర్మిల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. పాదయాత్ర సైతం చేపట్టారు. ఆమె విమర్శల దాడి అంతా కేసీఆర్ కుటుంబం పైననే కేంద్రీకృతమై ఉంటోంది. వచ్చిన తెలంగాణను కేసీఆర్ స్వార్థానికి వాడుకుంటున్నారని, రాజన్న రాజ్యం వస్తే తప్ప ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం కావని ఆమె చెబుతున్నారు.

ఆ మాటలు ప్రజల మెదళ్లలోకి ఎంతవరకు ఎక్కుతున్నాయో లేదో తెలియదు కాని.. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో ఈ పార్టీ మిగతా పార్టీల విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే చీల్చవచ్చు. వైఎస్ అభిమానులు, రెడ్డి సామాజికవర్గం కోణంలో చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకును ప్రభావితం చేసే అవకాశముంది. టీఆర్ఎస్, బీజేపీలపై ఈ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండవచ్చు.

బీఎస్పీతో నష్టమెవరికో?

దళితవర్గాల ఓటు బ్యాంకును కలిగి ఉన్న బీఎస్పీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో చూపిన ప్రభావం చాలా తక్కువే. కన్షీరాం, మాయావతి జమానాలో 1990లలో ఈ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పలు స్థానాలలో పోటీచేసినా, ఇటీవలికాలంలో బాగా వెనుకబడిపోయింది. అయితే, సమర్థుడైన పోలీసు అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా పేరు తెచ్చుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన సర్వీసుకు రాజీనామా చేసి ఈ పార్టీలో చేరడం, సుదీర్ఘ పాదయాత్రను చేపట్టడం అనుకూల పరిణామంగా చెప్పవచ్చు.

33 జిల్లాలలో విస్తరించి ఉన్న 40 లక్షలకు పైగా స్వేరోలు, మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఈ పార్టీకి ప్రధాన బలంగా ఉన్నారు. ఇప్పటిదాకా ఈ వర్గాలు అయితే అధికార టీఆర్ఎస్‌కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఓటు వేస్తూ వస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే, వచ్చే ఎన్నికలలో బీఎస్పీ పోటీ చేసే సెగ్మెంట్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశముంది. కమలనాథులపై ప్రభావం దాదాపు ఉండకపోవచ్చు.

సాంప్రదాయ ఓట్లు ఉన్నా

ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రమంగా క్షీణిస్తూవస్తోంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలందరూ ఇతర పార్టీలలో చేరిపోయారు. పిడికెడు మంది మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే, నేతలు లేకపోయినా ఈ పార్టీకి రాష్ట్రంలోని చాలా చోట్ల సాంప్రదాయిక ఓటు బ్యాంకు ఉంది. పోటీ చేసే స్థానాలను బట్టి ఈ పార్టీ ప్రభావం ఏ పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తుందనే విషయం ఆధారపడి ఉంటుంది. కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో ఈ పార్టీ పోటీ చేస్తే ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ కోణంలో చూస్తే, అధికార టీఆర్ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశముంది.

ఎరుపు మెరుపు తగ్గినా

ఇక, సీపీఐ, సీపీఐ(ఎం) రెండూ ఇటీవలికాలంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలలోని నాలుగైదు నియోజకవర్గాలలో మాత్రమే ఈ పార్టీలు ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయి. అయితే, రాష్ట్రమంతటా ప్రతి పల్లె, పట్టణంలో వీటికి అనేక మంది మద్దతుదారులు, అభిమానులు ఉంటారు. ఈ వర్గాలు ఏ పార్టీకి ఓటేస్తాయన్నది చాలా కీలకం. సిద్ధాంతరీత్యా కాషాయ పార్టీకి ఓటు వేయరు. ప్రభుత్వ వ్యతిరేకతను కలిగివుంటారు కనుక ఈ ఓట్లు చివరకు కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. సుమారు పాతికేళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై చెరగని ముద్ర వేసిన నక్సలైట్ల ప్రభావం కూడా తెలంగాణలో అధికంగా ఉంటుంది. ఈ వర్గాల ఓట్లు కూడా చివరకు కాంగ్రెస్‌కే పడడం ఖాయమని చెప్పవచ్చు.

ఆ పార్టీలకు వీరు చేసే నష్టమెంత?

ఇక ఆప్, ప్రజాశాంతి పార్టీలు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాయా? లేదా? అనే విషయంలో ఇప్పటికి పూర్తి క్లారిటీ రాలేదు. ఇందిరా శోభన్ సారథ్యంలో ఆప్ ప్రజలలోకి చొచ్చుకెళ్లడానికి కృషి చేస్తోంది. ఢిల్లీలో ఇటీవల కేజ్రీవాల్-కేసీఆర్‌ భేటీ నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేదన్న వార్తలు వచ్చినా, స్థానిక నాయకత్వం వాటిని ఖండించింది. తమకు బలమున్న చోట కచ్చితంగా పోటీ చేస్తామని, పోటీ చేయనిచోట కూడా అధికార పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఇందిర చెబుతున్నారు.పోటీ చేసిన చోట ఆప్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశమే ఎక్కువుంది. అంటే కాంగ్రెస్, బీజేపీకే నష్టం జరగనుంది. ప్రజాశాంతి పార్టీ పోటీ చేసిన పక్షంలో క్రిస్టియన్ల ఓట్లను ఆ పార్టీ అభ్యర్థులు చీల్చుతారు. ఈ మేరకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. కోదండరాం టీజేఎస్, చెరుకు సుధాకర్ ఇంటిపార్టీ ఉన్నా అవి ఉద్యమాలు చేయడానికి తప్ప ఎన్నికల రాజకీయాలకు సరిపడవని తేలిపోయింది.

కొసమెరుపు

మొత్తంగా చూస్తే, ఈ చిన్నపార్టీలు ఎన్ని స్థానాల్లో, ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాయన్నది కీలకమవుతుంది. ఒంటరిగా పోటీ చేస్తాయా? లేక ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తుకు వెళతాయా? అన్నది కూడా ముఖ్యమే. ఇప్పటికైతే ఏ పార్టీతో పొత్తు ఉండబోదని కాంగ్రెస్, బీజేపీలు రెండూ స్పష్టంగా ప్రకటించాయి. ఎంఐఎంతో తప్ప మరే పార్టీతో టీఆర్ఎస్ కూడా కలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందో నిర్ణయించే అంశాల్లో చిన్న పార్టీల ప్రభావం కూడా కీలకం కానుంది. ఇంకా ఏడాదిన్నర సమయముంది కనుక ఈలోగా ఎప్పుడు ఏ పరిణామం జరగనుందో ఆసక్తిగా గమనించాల్సిందే.

-డి మార్కండేయ

[email protected]


Next Story

Most Viewed