ఇండిగో... ఎవరి చేతగానితనమీ పతనం

by Bhoopathi Nagaiah |

ఇండిగో తన సామ్రాజ్యాన్ని ఆర్భాటాల మీద గానీ, ఆకర్షణీయమైన గిమ్మిక్స్ మీద గానీ నిర్మించలేదు.

ఇండిగో... ఎవరి చేతగానితనమీ పతనం
X

భారతీయ విమాన ప్రయాణికులలో చాలామందికి ఒక విషయం మీద ఏకాభిప్రాయం ఉంది. ఇండిగో తన సామ్రాజ్యాన్ని ఆర్భాటాల మీద గానీ, ఆకర్షణీయమైన గిమ్మిక్స్ మీద గానీ నిర్మించలేదు. అది అత్యంత సులభమైన ఒకే ఒక్క పనిని అసాధారణ సమర్థతతో చేసింది. సమయానికి టేక్ ఆఫ్ కావడం, సమయానికి ల్యాండ్ కావడం. అదే భారతీయుల విశ్వాసాన్ని సంపాదించింది. రోజుకు సుమారు 2,300 విమానాలు, గడియారంలా నడిచే విధానం, దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45 గమ్యస్థానాలకు రోజుకు సగం మిలియన్ ప్రయాణికులను ఎలాంటి హడావుడి లేకుండా, సమంజసమైన చార్జీలతో తరలించడం. ఇదే ఇండిగో బలం.

భారత ఆకాశంలో ఇండిగో దాదాపు ఏకాధిపత్య స్థాయికి చేరింది. మార్కెట్ వాటా 60 శాతం కంటే ఎక్కువ. కానీ ఈ వారపు మీడియా కవర్ స్టోరీస్ మొత్తం ఇండిగో సంస్థపై నడిచింది. కేంద్ర ప్రభుత్వం తన విరోధ భావాన్ని ఈ ఇండిగో సంస్థ పై రుద్దింది. ఇండిగొ సంస్థ ఓ పదునైన అంచుపై విన్యాసం చేసి, తానే దానికి బలైంది.

5 వేల విమానాల రద్దు

డిసెంబరు మొదట్లో ఒక్కసారిగా ఇండిగో వల్ల చెలరేగిన గందరగోళం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొన్ని రోజుల్లోనే లక్షకు పైగా కాదు, దాదాపు పదిలక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 5,000కి పైగా విమానాలు రద్దయ్యాయి లేదా తీవ్ర ఆలస్యం అయ్యాయి. డిసెంబరు 4 నుంచి 6 మధ్య 2,948 దేశీయ విమానాలు ఆకాశం నుంచి మాయమయ్యాయి. డిసెంబరు 5 ఒక్కరోజే 1,588 రద్దయ్యాయి. ఇది ఇండిగో విమానాల్లో 78 శాతం . విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా మారాయి. లగేజ్ ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయింది.

ఇంత ఘోరంగా ఇండిగో నియంత్రణ కోల్పోవడానికి కారణం ఏమిటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జనవరి 2024లో సవరించిన కొత్త నిబంధనల ప్రభావానికి అత్యధికంగా గురైన సంస్థ ఇండిగోనే. ఇంత పూర్తిగా ‘లీన్ ఎఫిషియెన్సీ’ మీద ఆధారపడి నిర్మితమైన మరో విమాన సంస్థ లేదు. అలసట నిబంధనలు పైలట్ల లభ్యతను కత్తిరించాయి. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పైలట్ల నియామకంలో అది నెమ్మదించింది. పైలట్ల సంఖ్యను పెంచటానికి బదులు, మార్చిలో ఉన్న 5,463 నుంచి డిసెంబరు నాటికి 5,085కి తగ్గించింది. చట్టబద్ధంగా విశ్రాంతి తీసుకున్న పైలట్లు తక్కువగా ఉండగా, విమానాలు ఎక్కువగా ఉండే అసాధ్య సమస్యను అది పరిష్కరించడానికి ప్రయత్నించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం గణిత సమస్య కాదు. తన నిర్మాణ పరిమితులను మించి విస్తరించిన వ్యాపార నమూనా తుదకు తనకు తానే కూలిపోయిన పరిణామం.

ఇండిగో బలిపశువైందా?

భారత్‌కు తన ఏకైక అద్భుతమైన విమానయాన విజయకథ కూలిపోవడం భరించలేని విషయం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ స్థానంలో మరో పోటి విమానయాన రంగాన్ని అదానీ సంస్థను తీసుకుని రావటానికే ఇండిగోను బలిపశువును చేశారా! అదానీ కోసం ఎంతకైనా తెగించే మోదీ ఇండిగో పతనం వెనుక ఉన్నారు అనే అభిప్రాయంతో సోషల్ మీడియాలో మరింత అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ఈ మబ్బులు ఎక్కువ కాలం అసలు నిజాలు ఏమిటో దాచలేవు.

- డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story