- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాకు బాధ్యుడు ఎవరు?
ఆధునిక యుగంలో సినిమా అత్యంత ప్రభావవంతమైన దృశ్య శ్రవణ మాధ్యమం. సినిమా అనేక కళల సమన్వయంతో రూపొందిన కళ

ఆధునిక యుగంలో సినిమా అత్యంత ప్రభావవంతమైన దృశ్య శ్రవణ మాధ్యమం. సినిమా అనేక కళల సమన్వయంతో రూపొందిన కళ. అనేక కళలు ఉండే సినిమాకు ఎవరు బాధ్యులు? అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అప్పుడు సినిమా సిద్దాంత రంగంలో ‘ఆటర్’ AUTEURSAUTEUR అన్న మాట వచ్చింది.సినిమా అనేది కేవలం వినోదమే కాదు, అది ఒక సామాజిక ప్రతిబింబం, వ్యక్తిత్వ అభివ్యక్తి, కళాత్మక ఆవిష్కరణ.
సినిమాల్లో దర్శకుని పాత్ర అనితరసాధ్యమైంది. దర్శకుడి దృష్టి, శైలి, భావ దృష్టి ఒక సినిమాకి మూలమవుతుంది. ఇలాంటి సందర్భంలో “ఆటర్” అనే పదం ప్రాధాన్యం సంతరించుకుంది. “ఆటర్” (Auteur) అనే పదం ఫ్రెంచ్ భాషలోంచి వచ్చింది. దీని అర్థం ‘రచయిత’ లేదా ‘సృష్టికర్త’. సినిమాలకు సంబంధించిన సిద్ధాంతంలో ఇది దర్శకుడిని సూచిస్తుంది, దర్శకుడు తన సినిమాల్లో ప్రధాన సృజనాత్మక శక్తిగా వ్యవహరిస్తాడు. అతడి సినిమాల్లో తన వ్యక్తిగత శైలి, ఇతివృత్తాలు, ఆలోచన విధానం స్పష్టంగా ప్రతిఫలి స్తాయి.
దర్శకుడే అసలు రచయిత
ఈ సిద్ధాంతం 1950లలో ఫ్రాన్స్‌లో వెలుగుచూసింది. ఆండ్రే బాజిన్, ఫ్రాంకోయిస్ ట్రుఫో వంటి ప్రముఖులు Cahiers due Cinema అనే సినిమా పత్రికలో దీన్ని ప్రతి పాదించారు. వారు సినిమా దర్శకుడిని కూడా నవలా రచయితగా, కళాకారుడిగా గుర్తించి, దర్శకుడే సినిమాకు అసలు రచయిత అని వాదించారు. తెలుగులో ఆ పదానికి ఖచ్చితమైన సమానార్థక పదం లేకపోయినా, దీన్ని "సృష్టికర్త దర్శకుడు" లేదా "దర్శక రచయిత"గా అభివర్ణించవచ్చు. అంటే, కేవలం కథను తెరపై చూపించేవాడిగా కాకుండా, కథకు ఒక రూపం ఇచ్చి దృశ్యంగా నిర్మించేవాడిగా, దానికి తనదైన సొంత దృక్పథం, శైలి కలిగినవాడిగా దర్శకుడు నిలబడతాడు. అలాంటి దర్శకుడి సినిమాలు ఒక ప్రత్యేక కళాత్మక ముద్రను కలిగి ఉంటాయి.
మన సినిమాల్లో ఆటర్‌లు
భారతీయ సినిమాల్లో ఆటర్‌లుగా సత్యజిత్ రే, మృణాల్ సేన్‌లను తీసుకుంటే సత్యజిత్ రే భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధ దర్శకులలో ఒకరు. రే ఒక ఆటర్‌గా తన ప్రత్యేక శైలి, మానవీయ దృష్టికోణంతో సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డారు. సత్యజిత్ రే సినిమాలు సరళమైన, వాస్తవిక కథన శైలిని కలిగి ఉంటాయి, ఆయన శైలి ప్రధానంగా ఇటాలియన్ నియో-రియలిజం నుండి ప్రేరణ పొందింది. సహజమైన సినిమాటోగ్రఫీ, స్థానిక నటులు, వాస్తవ జీవిత సన్నివేశాలు ఉపయోగించి హృద్య మైన సినిమాలను రూపొందించాడు. రే సినిమాల్లో సంగీత దృశ్యాల సమన్వయం కూర్పు సినిమాల కథనానికి భావోద్వేగ లోతును జోడించాయి. ముఖ్యంగా రే అపుత్రయం (పథేర్ పాంచాలి, అపరాజితో, అపుర్ సన్సార్) ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
సినిమా ఆద్యంతం ‘రే’ ముద్ర
నిజానికి అనేక సందర్భాల్లో రే తానే స్వరకర్తగా వ్యవహరించాడు. ఉదాహరణగా చెప్పుకుంటే పథేర్ పాంచాలిలో గ్రామీణ బెంగాల్ జీవన శైలిని చిత్రీకరించడంలో అతని అత్యంత సూక్ష్మమైన వివరాలు, సహజత్వం తన ప్రత్యేక శైలిని స్పష్టం చేశాయి. ఇక ఇతివృత్తాల విషయానికి వస్తే రే సినిమాలు మానవ సంబంధాలు, సామాజిక మార్పులు, ఆధునికత, సంప్రదాయం మధ్య సంఘర్షణలపై దృష్టి సారిస్తాయి. రే చిత్రాలు గ్రామీణ, పట్టణ జీవనంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను అన్వేషిస్తాయి. ప్రతి ద్వంద్వి, జనారణ్య వంటి సినిమాలు ఆధునిక భారతదేశంలో నిరుద్యోగం, నైతిక సంక్షోభాన్ని విశ్లేషిస్తాయి. ఇక సృజ నాత్మక నియంత్రణ విషయానికి వస్తే రే తన సినిమాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు, స్క్రిప్ట్ రచన, సంగీతం, ఎడిటింగ్, దృశ్య రూపకల్పనలో కూడా తను ప్రధాన భూమికను పోషించాడు. ఇది అతని వ్యక్తిగత దృష్టిని సినిమాలో స్పష్టంగా ప్రతిబింబించేలా చేసింది.
బెంగాలీ ఆటర్ సేన్
ఇక మృణాళ్ సేన్ భారతీయ సమాంతర సినిమా రంగంలో మరో గొప్ప దర్శకుడు, సేన్ తన ప్రయోగాత్మక శైలి సామాజిక-రాజకీయ విమర్శలతో సినిమాల్ని తీసి పేరు గడించాడు సేన్ సినిమాలు ప్రయోగాత్మకంగా, రాడికల్ గానూ వుంటాయి. సేన్ శైలి సినిమాలు ప్రయోగాత్మకమైనవే కాకుండా నాన్-లీనియర్ కథనాలు, బ్రెక్ట్ థియేటర్ టెక్నిక్‌లు, డాక్యుమెంటరీ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. సేన్ తరచూ సినిమా మాధ్యమాన్ని ఉపయోగించి సమాజంలోని అసమానతలను ప్రశ్నించాడు. ఆయన తీసిన బువన్ శోం భారతీయ సమాంతర సినిమా ఉద్యమానికి మార్గ దర్శకంగా నిలబడింది. ఇది సామాజిక విమర్శను హాస్యం, సరళతతో కలిపి రూపొందింది. ఆయన ఎక్ దిన్ ప్రతి దిన్ వంటి సినిమాలు సామాజిక నీతులు, లింగ అసమానతలపై సూక్ష్మమైన విశ్లేషణను అందిస్తాయి. సేన్ సినిమాలు సామాజిక-రాజకీయ సమస్యలపై దృష్టి సారిస్తాయి, ముఖ్యంగా వర్గ పోరాటం, శ్రామికుల హక్కులు, బూర్జువా సమాజంపై విమర్శ. అతని సినిమాలు తరచూ సమాజంలోని అణగారిన వర్గాల దృక్కోణాన్ని హైలైట్ చేస్తాయి, సత్యజిత్ రే, మృణాల్ సేన్ ఇద్దరూ ఆటర్‌లుగా తమ ప్రత్యేక శైలులు, ఇతివృత్తాల ద్వారా భారతీయ సినిమాకు అపారమైన సహకారం అందించారు.
తెలుగు ఆటర్‌లు ..
ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే అలనాటి బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి, బాపు, బి.ఎస్.నారాయణ, బి.నరసింగ రావు, అక్కినేని కుటుంబరావు, సి.ఉమామహేశ్వర్ రావు లాంటి అనేక మంది ఆటర్‌ల గురించి చెప్పుకోవచ్చు. అంటే మొత్తం మీద తెలుగులో కూడా ఆటర్ అనే దర్శకులూ మనకున్నారు, సినిమా భాషా సిద్ధాంతాల్లో ఆటర్ మొదటి మాట.
- వారాల ఆనంద్
94405 01281






