- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలను మోసం చేస్తున్నది ఎవరు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం, బీసీల ఆశలు విరివిగా పెరిగాయి. కొత్త రాష్ట్రంలో తాము న్యాయమైన ప్రాతినిధ్యం పొందుతామనే నమ్మకంతో

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం, బీసీల ఆశలు విరివిగా పెరిగాయి. కొత్త రాష్ట్రంలో తాము న్యాయమైన ప్రాతినిధ్యం పొందుతామనే నమ్మకంతో, తెలంగాణ ఉద్యమంలో బీసీలు ముందుండి పోరాటం చేశారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత కూడా బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో గణనీయ మైన ప్రగతి కనిపించడం లేదు. దీనితో, ఒక ప్రాథమిక ప్రశ్న వెలువడుతోంది. ‘తెలంగాణ లో బీసీలను మోసం చేస్తున్నది ఎవరు’?
తెలంగాణలో బీసీ జనాభా సుమారు 56%కు పైగా ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. కానీ, అసెంబ్లీలో బీసీలకు ప్రాతి నిధ్యం 20% కన్నా తక్కువ, మంత్రివర్గంలో బీసీల స్థానం 10% లోపే. నామినేటెడ్ పదవులు అంతంతమాత్రమే. ఇక బీసీ సంక్షేమ కోసం నిధుల కేటాయింపు 2024 బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు. ఇందులో కూడా 60% విడుదల కాకుండా మిగిలి పోవడం గమనార్హం.
బీఆర్ఎస్.. మాటలతో మాయ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చాలా సార్లు బీసీలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని ప్రకటించారు.. కానీ దానికి చట్టబద్ధ హోదా లేదు. బీసీ కులగణన వేశామని చెప్పారు. కానీ అదీ ప్రజలకు వెల్లడించలేదు. బీసీలకు రాజకీయంలో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కానీ చేయలేదు. 2014, 2018లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ మంత్రివర్గంలో కేవలం ఒకరిని మాత్రమే చేర్చారు. బీసీలకు ఇచ్చిన టికెట్లు సైతం 15-18% లోపే ఉన్నాయి. బీసీ బందు, బీసీ గీతా కార్మికులకు ఉచిత యంత్రాలు వంటి మాటలు ఇచ్చారు. కానీ అది మైనార్టీ లబ్దిదారులకు మాత్రమే వర్తించింది. ఇలా బీసీలకు ఒక్క హామీ నెరవేర్చకుండా బీఆర్ఎస్ వారిని వాడుకుంది. బీసీ నేతలను నామినేటెడ్ పదవుల్లో పెట్టకుండా, కాలానుగుణంగా భేదాలు చూపించారు. బీసీలకు టికెట్లు ఇవ్వ కుండా, వారి సామర్థ్యాన్ని అణిచేశారు. బీఆర్ఎస్ నాయ కత్వం మాటలు గొప్పగా చెప్పినా, కార్యాచరణ శూన్యం.
కాంగ్రెస్ పార్టీ.. హామీల అమలు ఏది?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రత్యేకంగా హామీలు ఇచ్చినప్పటికీ చేతలలో మానేయడం విషాదకరం. గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లు చాలా తక్కువ. 2023లో 119 సీట్లలో కేవలం 18 బీసీ అభ్యర్థులను నిలబెట్టారు. పార్టీ అత్యున్నత పదవులు, ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో బీసీలు చాలా తక్కువ. అసెంబ్లీ సగటున 20% కన్నా తక్కువ, మంత్రివర్గంలో ఇద్దరికీ మించి లేదు. ప్రభుత్వ సంస్థల చైర్మన్ పదవులు 10% కన్నా తక్కువ, కార్పొరేషన్ నామినేషన్లు 15% లోపు మాత్రమే, అంటే, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తోందనే చెప్పాలి.
బీజేపీ..చట్టాల రూపకల్పనకూ దూరం
బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా, బీసీలను ఆకర్షించేందుకు, బీసీ మోర్చా పేరుతో కార్యక్రమాలు చేస్తోంది, కొందరి బీసీ నాయకులను ప్రొజెక్ట్ చేస్తోంది. కానీ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత కలిగే చట్టాలు చేయలేదు. తెలంగాణ బీజేపీలో బీసీకి ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు. బీజేపీ ఊహాజనిత వాగ్దానాలు, కార్యరూపం లేని కార్య క్రమాలు, కుల ప్రాతినిధ్యం గల బీసీ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమూహ ప్రయోజనాలను త్యాగం చేయడం, అసలు తెలంగాణ బీజేపీలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. బీజేపీ కూడా బీసీలను వినియోగించుకునే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ రకంగా మూడు పార్టీలూ బీసీలను ఓటింగ్ యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయి.
బీసీ సంఘాలు.. అనైక్యతా కేంద్రాలు
ఈ మధ్య కాలంలో ఏర్పడిన ఇండియా బ్లాక్, బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సమితులు వంటి సంస్థలు, బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాయని చెబుతున్నా.. అవి స్పష్టమైన కార్యాచరణ లేకుండా తిరుగుతున్నాయి. బీసీ ఉద్యమాల పేరుతో పేరుకు నాయకత్వం, కార్యానికి ముఖాముఖీ నడక మాత్రమే ఉంది. బీసీల క్షేత్ర స్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం కంటే, ఓట్ల రాజకీయమే దృష్టిగా ఉంది. బీసీ అనే వర్గం అనేక కులాలను కలిగి ఉంటుంది. ఉన్నత బీసీలు, మధ్యస్త బీసీలు, ఎంబీసీలుగా చలామణి అవుతున్నారు. ఈ విభజనలను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. బీసీలను ఏకం చేసే నేతలు లేకపోవడం, ఒకే సంఘటిత శక్తిగా ఎదగలేక పోవడం వల్ల వారు మోసపోతున్నారు.. బీసీల కుల నాయకులు సంఘటితంగా లేకపోవడం బీసీల బలహీనతకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
బీసీ నాయకులు ఇలా చేయకపోతే..
అందుకే అన్ని బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకు రావడం అత్యవసరం. ప్రాంత, కుల, పార్టీ ఆధారాలు లేకుండా వారి హక్కుల కోసం పోరాడే నేత ఉండాలి. రాజకీయ పార్టీలు బీసీలకు ఇచ్చే టికెట్లను గమనించాలి. తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్నది అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, బీసీలను ముక్కలుగా విడగొట్టి వాడుకునే రాజకీయ వ్యవస్థ, ఒక్క బీసీ నాయకుడికి పదవి రావడం కంటే, లక్షల మంది బీసీలకు న్యాయం జరిగే విధంగా నడపగల సామూహిక శక్తి అవసరం. లేదంటే, ‘బీసీలను మోసం చేస్తున్నది ఎవరు?’ అనే ప్రశ్నకు "మేమే!" అనే సమాధానం రేపు మన బీసీ సమాజం నుండి రావాల్సి వస్తుంది.
-డా. కేశవులు బి. ఎండి
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659






