టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలకు విలువ లేదా?

by Ravi |   (  Updated:2025-08-02 00:45:40  IST  )

ప్రభుత్వం అంటే కేవలం పరిపాలనా యంత్రాంగం కాదు. అది ప్రజల విశ్వాసంపై ఆధారపడిన సామూహిక బాధ్యత. ఈ విశ్వాసం

టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలకు విలువ లేదా?
X

ప్రభుత్వం అంటే కేవలం పరిపాలనా యంత్రాంగం కాదు. అది ప్రజల విశ్వాసంపై ఆధారపడిన సామూహిక బాధ్యత. ఈ విశ్వాసం మాటల ద్వారా బలపడుతుంది. మాట నిలబడకపోతే, పాలన పునాది నలుగుతుంది. తాజా సినీ పరిణామాలు ఈ విషయంలో ప్రభుత్వ వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. పెట్టుబడిదారుల స్క్రీన్‌ప్లేలో ప్రభుత్వ హామీ, కోర్టు తీర్పు క్యామియో పాత్రలుగా మారిపోయాయి.

ఇక ధరలు పెంచం అని చెప్పి..

“పుష్ప-2” బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందిన విషాదకర ఘటన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికపై స్వయంగా కీలక ప్రకటన చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కూడా ఇదే మాటను తిరిగి చెప్పారు. ప్రజలు దీనిని బాధ్యతాయుతమైన ప్రకటనగా స్వీకరించి, ప్రభుత్వంపై మరింత నమ్మకం ఉంచారు. కానీ ఈ హామీ ఇచ్చిన కొద్ది రోజులకే, ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం విడుదల చేసిన జీవోలో టికెట్ ధరలు పెంచడమే కాక, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇవ్వడం చూసినప్పుడు ఇచ్చిన మాట ఎంత తేలికగా విస్మరించబడుతోందో తెలుస్తోంది.

కోర్టు ఆదేశాలు పక్కనబెట్టి..

ఈ జీవోపై జర్నలిస్ట్ సతీష్ కమాల్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులతో జీవోను నిలిపివేసింది. అయినప్పటికీ, ఇదే తీరు ‘హరిహర వీరమల్లు’ సినిమాతో మళ్లీ పునరావృతం కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోర్టు ఆదేశాలు, అసెంబ్లీలో చేసిన హామీ, ప్రజల నమ్మకం అన్నీ పక్కన పెట్టి, మరోసారి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు అనుమతిస్తూ జీవో జారీ చేయడం అనేది సామాన్య ప్రజలకు ప్రభుత్వ నైతికతపై తలెత్తే అనుమానాలను బలపరుస్తోంది.

విషయం చిన్నదే కానీ..

ఇది చిన్న విషయం కాదని గుర్తించాలి. జీవో ఒక చిన్న పరిపాలనా ప్రక్రియ మాత్రమే కావచ్చు. కానీ దాని వెనక దాగి ఉన్న నమ్మకం చాలా పెద్దది. ఒక హామీని నిలబెట్టుకోలేని ప్రభుత్వం, ఇతర ముఖ్యమైన వ్యవహారాల్లోనూ వెనకడుగు వేయడాన్ని సమర్థించలేం. సినీ రంగానికి తలవంచిన పాలకులు, రేపు ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలోనూ, రైతుల సమస్యల విషయంలోనూ అదే వైఖరి తీసుకునే ప్రమాదం ఉందన్న అనుమానం సహజం.

చిన్న పరీక్ష కాదు.. మౌలిక పరీక్ష

ఈ పరిణామాలలో ఎవరు లాభపడుతున్నారు అనే ప్రశ్న తలెత్తక మానదు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల లాభపడేది కొద్ది మంది స్టార్ నిర్మాతలే. కానీ అసౌకర్యాన్ని అనుభవించేది సామాన్య ప్రేక్షకుడు. కొందరి లాభాల కోసం ప్రభుత్వ విధానాలే మారిపోతే, ప్రజల సంక్షేమమే ప్రధానంగా భావించాల్సిన ప్రభుత్వం తన ప్రాధాన్యతలను తప్పుదారి పట్టించిందని ఒప్పుకోక తప్పదు. ఇది ప్రభుత్వానికి ఒక చిన్న పరీక్ష కాదు. ఇది మౌలిక పరీక్ష. హామీ ఇవ్వడంలో నాయకత్వం లేదు. దాన్ని నిలబెట్టుకోవడంలోనే నిజమైన నాయకత్వం తళుకు పడుతుంది. ఇకముందైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం! ప్రజల హితం కంటే పెట్టుబడిదారుల లాభం ముఖ్యం అవ్వకూడదు.

- సయ్యద్ రఫీ

చిత్ర దర్శకుడు

[email protected]

Next Story