- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్‌లో బీసీలకు న్యాయం ఎక్కడ?
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి కీలక సంస్కరణల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక న్యాయం వంటి అంశాలు ఎలా ప్రభావితమవుతున్నాయో విశ్లేషించే వ్యాసం.

ప్రజాస్వామ్యంలో ఏ సంస్కరణ అయినా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందినప్పుడే సాధ్యమవుతుంది. లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా బిల్లులపై విస్తృత స్థాయి మద్దతు రాకపోవడానికి ఉన్న కారణాలు స్పష్టమే.. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యత, వర్గాల మధ్య సమాన అవకాశాలు వంటి అంశాలను సమన్వయం చేయకుండా తీసుకునే నిర్ణయాలు సహజంగానే విభేదాలకు దారి తీస్తాయి.
భారతదేశం ఒకే సంస్కృతి, ఒకే వర్గం ఆధారంగా నిర్మితమైన దేశం కాదు. ఇది అనేక జాతులు, ఉపజాతులు, భాషలు, సంప్రదాయాల సమాహారంగా ఏర్పడిన విశాల సామాజిక నిర్మాణం. ఈ విభిన్నతలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నవారు బీసీ వర్గాలే.. దేశ జనాభాలో గణనీయమైన శాతం బీసీలదే కావడం మాత్రమే కాదు, వ్యవసాయం నుండి వృత్తులు, చిన్నతరహా వ్యాపారాల నుండి సేవా రంగాల వరకు భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే వెన్నెముక కూడా వీరే. అయినప్పటికీ, ఈ విస్తృతమైన సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యంలో పూర్తిగా ప్రతిబింబించకపోవడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధం.
ప్రాంతీయ సమతుల్యతను విస్మరిస్తే..
డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ వంటి కీలక రాజ్యాంగ సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత సమానత్వ దిశగా నడిపించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ సంస్కరణల అమలు విధానంలో ఉన్న లోపాలు ముఖ్యంగా బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై పడే ప్రభావం లోతైన చర్చకు దారి తీస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ సూత్రంగా జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇది భారతదేశం వంటి విభిన్నతల దేశంలో ఒకే ప్రమాణంతో అమలు చేయదగినది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
అభివృద్దిపై శీతకన్ను వేస్తారా?
దక్షిణ భారత రాష్ట్రాలు గత కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం, విద్య రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించి జనాభా పెరుగుదలను నియంత్రించగలిగాయి. అయితే అదే విజయాన్ని ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితిగా మారుస్తుందనే భయం వ్యక్తమవుతోంది. జనాభా పెరుగుదల అధికంగా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశం ఉండటంతో, దక్షిణ రాష్ట్రాల పాత్ర కేంద్ర రాజకీయాల్లో తగ్గిపోవచ్చనే ఆందోళన మాత్రమే కాకుండా మొత్తం భారతదేశంలో బలంగా ఉన్న బీసీ వర్గాల రాజకీయ స్థితిగతులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో బీసీల ఓటు శక్తి విచ్ఛిన్నం కావడం లేదా వారి ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల, వారు సాధించిన రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది కేంద్ర విధానాల రూపకల్పనలో వారి స్వరాన్ని బలహీనపరచే దిశగా నడిపించవచ్చు.
బీసీ మహిళలకు ప్రత్యేక ఉప-కోటా ఏది?
ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు విషయానికి వస్తే, ఇది మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక అడుగుగా స్వాగతించదగినదే. అయితే ఇందులో బీసీ మహిళలకు ప్రత్యేక ఉప-కోటా లేకపోవడం ఒక ముఖ్యమైన లోపంగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్పష్టమైన రిజర్వేషన్ ఉన్నప్పటికీ, బీసీ మహిళలు సాధారణ కోటాలోనే పోటీ చేయాల్సి రావడం వల్ల వారికి సమాన అవకాశాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రభావవంతమైన వర్గాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అవకాశాలను వినియోగించుకునే పరిస్థితి ఉన్నందున, మహిళా రిజర్వేషన్ సాధారణ కోటా ప్రధానంగా అగ్రవర్గాల మహిళలకు మాత్రమే ఉపయోగపడే ప్రమాదం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ మహిళలు రాజకీయంగా మరింత వెనుకబడే అవకాశాన్ని విస్మరించలేం.
పాలకులు సమగ్ర దృష్టితో ఆలోచించకపోతే?
ఎన్నో ఏండ్ల దేశ నిర్మాణ ప్రతి దశలో కీలకమైన బీసీ వర్గాల స్థానం, వారి హక్కులు, వారి ప్రాతినిధ్యం వంటి అంశాలను ఏ విధాన నిర్ణయం లోనైనా కేంద్రీకృతంగా పరిగణించాలి. బీసీ వాదం ఇంత బలంగా వ్యక్తమవుతున్న సందర్భంలో, రేపటి భారతదేశ భవిష్యత్తు కూడా ఈ వర్గాల భాగస్వామ్యంపై ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని విస్మరించలేం. సమాజంలో అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగిన వర్గాన్ని పక్కన పెట్టి తీసుకునే నిర్ణయాలు సహజంగానే ప్రతిఘటనను ఎదుర్కొంటాయి. ఇప్పటికైనా పాలకులు సమగ్ర దృష్టితో ఆలోచించి, బీసీలకు న్యాయం జరిగే విధంగా విధానాలను సవరించాలి. లేదంటే, సమానత్వం పేరిట అసమానతలను పెంచిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోవాల్సిన పరిస్థితి తప్పదు..
-అక్షర కుమార స్వామి
96767 26726






