- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణంపై ప్రజలకు అప్పుడున్నా కమిట్‌మెంట్ ఇప్పుడేది?
అరిటాకులో అన్నం తిని ఎన్నాళ్లయింది. పాతిక ముప్పయ్యేళ్ల క్రితం వరకూ పండ గొచ్చినా పబ్బమొచ్చినా ఎలా తినేవాళ్లు .. ఓ లేత

అరిటాకులో అన్నం తిని ఎన్నాళ్లయింది. పాతిక ముప్పయ్యేళ్ల క్రితం వరకూ పండ గొచ్చినా పబ్బమొచ్చినా ఎలా తినేవాళ్లు .. ఓ లేత అరటి ఆకులో.. వేడివేడి అన్నం, వంటకాలు వడ్డించేవారు. కమ్మటి నెయ్యితో ఆ వంటకాల గుబాళింపు.. అన్నం ఆవిరితో కలిసి జిహ్వ లేచొచ్చేది. అరిటాకులోని ఔషధీయ గుణాలు కలగలిసి.. అన్నం అమృతంలా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది..
ఏ పెళ్లికి వెళ్లినా ప్లాస్టిక్ ప్లేట్లలోనే భోజనాలు! ఉల్లిపొర కాగితంలా ఉండే ప్లాస్టిక్ కప్పులోని గులాబ్ జామ్ పాకం తుస్సుమని మీద పడకుండా జాగ్రత్తగా తినాలి. ఎవరు తోసేస్తారో అన్న భయంతో ప్లాస్టిక్ గ్లాసులోని నీళ్లను గబా గబా తాగేయాలి. సాయంత్రానికి ఫంక్షన్ హాల్ నుంచి ట్రక్కు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్తుంటే నిట్టూర్చాలి. ఇలా ఇంతవరకూ ప్లాస్టిక్‌ను ప్రేమించింది చాలు, ప్లాస్టిక్కు ఇకనైనా బ్రేకప్ చెప్పండి..! పర్యావరణ వారోత్సవాల సందర్భంగా 'బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్' అని నినదించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కి నో చెప్పండి.
చేతి సంచులు వాడిన తరమెక్కడ?
ఇప్పుడంటే ప్లాస్టిక్ బ్యాగ్‌లు వచ్చాయి కానీ నాన్న తరం వరకూ చేతి సంచులు వాడలేదా? రోజూ గుడ్డ సంచిలో కూరలు తెచ్చుకోలేదా? కిరాణం నుంచి బియ్యం వరకూ గోనె సంచుల్లో మూటగట్టి ఇంటికి తేలేదా? అవన్నీ పాత కాలం అలవాట్లు కాదు! ప్రకృతి మీద ప్రేమ! పుట్టిన నేల పది కాలాలు పచ్చగా ఉండాలన్న తపన!! కానీ ఇప్పుడేం జరుగుతోంది డజను అరటిపళ్లు కొని కవర్ ఇవ్వకపోతే కస్సు మంటారు. షాపింగ్‌కి వెళ్లినప్పుడల్లా ఐదు రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కవర్లు కొంటారు.. ఇక ప్రయాణాల్లో, రెస్టారెంట్లలో కొనే డిస్పోజబుల్ వాటర్ బాటిళ్లకు లెక్కేలేదు. పాలు, నీళ్లు, కిరాణా, ఆహార పొట్టాలు, మందులు, చివరకు గుళ్లో ప్రసాదాలకు కూడా పాలిథిన్ క్యారీ బ్యాగులు ఉండాల్సిందే! రోజులో ఓ గంట కాలుష్యానికి దూరంగా ఉండండి అన్న సందేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భారత్ నిర్వహిస్తోంది.
ప్లాస్టిక్ నిషేధం అంత కష్టమా?
ఈ నేపథ్యంలో.. ఒకసారి వాడి పడేసే (డిస్పోజబుల్) ప్లాస్టిక్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లపై 2016 లోనే దేశమంతా నిషేధం విధించినప్పటికీ అమలు చేయడం లో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. తాజాగా జమ్మూ, కశ్మీ ర్, మహా రాష్ట్రాలతో సహా దేశంలో 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత పాలిథిన్ క్యారీ బ్యాగులను పూర్తిగానో పరోక్షంగానో నిషేధించాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూపించలేక పోవడంతో చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే సంకల్పం గట్టిదైతే ప్లాస్టిక్ నిషేధం అమలు కష్టం కాదని పర్యావరణ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
సుస్థిర ధరిత్రిని నిర్మిద్దాం
ప్రకృతి లేనిదే జీవకోటి మనుగడ లేదన్న వాస్తవాన్ని తెలుసుకోవడానికి దగ్గరై సంరక్షణ చర్యలు చేపట్టడం, ప్రకృతితో పూర్తిగా మమేకం కావడం. సుస్థిర విద్య అభ్యసన, చర్యలను నిజాయితీగా వ్యక్తిగత శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా మాత్రమే ఈ పర్యావరణ సమస్యలు పరిష్కరించుకొని, తద్వారా మనల్ని మనం, ధరిత్రిని కాపాడుకోగలం. పచ్చని చెట్లు, గలగల పారే సెలయేర్లు, పక్షుల కిలకిల రాగములు, స్వచ్ఛమైన గాలి, కాలనుగుణంగా వచ్చే వర్షాలు ఇవి ప్రకృతి మానవునికై ప్రసాదించిన వరాలు.. కానీ మానవులు ఈ అందమైన ప్రకృతిని తన స్వలాభం కోసం తాత్కాలిక ప్రయోజనాల కోసం విచక్షణారహితంగా ప్రకృతి వనరులను ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ సమస్య ఇలాగే కొనసాగితే మానవుని మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటికైనా మేల్కొని ప్లాస్టిక్ భూతం నుండి మన భూమిని కాపాడుకుందాం రండి! మనసారా చేయి చేయి కలపండి!! ప్రకృతిని సంరక్షించి, కాపాడి దానిలో సేదతీరుదాం. భూగోళాన్ని 'సుస్థిర ధరిత్రిని చేద్దాం. హాయిగా జీవిద్దాం. భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిద్దాం.
(పర్యావరణ మాసోత్సవాల సందర్భంగా)
జీడిమెట్ల రవీందర్,
IESF వ్యవస్థాపక అధ్యక్షులు,
99488 52909






