గల్లీ బాగుంటేనే.. ఢిల్లీ బాగుంటుంది! పురపాలక ఎన్నికలను నిర్లక్ష్యం చేయకండి

by Ravi |   (  Updated:2026-02-11 02:31:21  IST  )

మైకులు మూగబోయాయి. వీధివీధినా హోరెత్తించిన ప్రచార ఆర్భాటాలు, డప్పుల మోతలు, కార్యకర్తల కోలాహలం సద్దుమణిగింది. ఇప్పుడు మిగిలింది నిశ్శబ్దం. కానీ, ఇది మామూలు నిశ్శబ్దం కాదు, ఒక పౌరుడిగా మనం ఆలోచించాల్సిన సమయం. నేడు జరగబోయే పురపాలక సంఘాల ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల బలపరీక్ష కాదు, అది మన ఇంటి ముందున్న రోడ్డు భవిష్యత్తును, మన పిల్లలు తాగే నీటి నాణ్యతను, మన కాలనీ ఆరోగ్య స్థితిగతులను నిర్ణయించే ఒక ప్రజాస్వామ్య యజ్ఞం.

గల్లీ బాగుంటేనే.. ఢిల్లీ బాగుంటుంది! పురపాలక ఎన్నికలను నిర్లక్ష్యం చేయకండి
X

మైకులు మూగబోయాయి. వీధివీధినా హోరెత్తించిన ప్రచార ఆర్భాటాలు, డప్పుల మోతలు, కార్యకర్తల కోలాహలం సద్దుమణిగింది. ఇప్పుడు మిగిలింది నిశ్శబ్దం. కానీ, ఇది మామూలు నిశ్శబ్దం కాదు, ఒక పౌరుడిగా మనం ఆలోచించాల్సిన సమయం. నేడు జరగబోయే పురపాలక సంఘాల ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల బలపరీక్ష కాదు, అది మన ఇంటి ముందున్న రోడ్డు భవిష్యత్తును, మన పిల్లలు తాగే నీటి నాణ్యతను, మన కాలనీ ఆరోగ్య స్థితిగతులను నిర్ణయించే ఒక ప్రజాస్వామ్య యజ్ఞం.

సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చినంత ప్రాధాన్యత, స్థానిక సంస్థల ఎన్నికలకు విద్యావంతులు, పట్టణ ప్రజలు ఇవ్వరనేది ఒక చేదు నిజం. ‘ఎవరు గెలిచినా మనకేంటి?’ అనే నిర్లిప్తత మన పట్టణాల ప్రగతికి ప్రధాన అవరోధంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎల్లుండి మనం వేయబోయే ఓటు విలువను, బరువును మరోసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మున్సిపల్ కార్యాలయమే మన జీవిక..

నిజానికి ఒక సామాన్యుడి దైనందిన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసేది ఢిల్లీలోని పార్లమెంటు కాదు, హైదరాబాద్ లోని అసెంబ్లీ అంతకన్నా కాదు. మన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసేది మన ఇంటికి కూతవేటు దూరంలో ఉండే మున్సిపల్ కార్యాలయమే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనకు అవసరమైన మంచినీళ్లు, నడిచే రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, దోమల నివారణ, ధృవీకరణ పత్రాలు ఇవన్నీ పురపాలక సంఘం పరిధిలోనివే.. మన ఇంటి ముందు మురుగు కాల్వ పొంగితే మనం ప్రధానికో, ముఖ్యమంత్రికో ఫోన్ చేయలేం, స్థానిక కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ మాత్రమే మనకు దిక్కు. ఎమ్మెల్యేలు, ఎంపీలు విధాన నిర్ణయాలు చేస్తే, కార్పొరేటర్లు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తారు..

విమర్శిస్తారు.. ఓటెయ్యరు..‌!

అందుకే, ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికలే మన జీవన ప్రమాణాలకు అత్యంత కీలకమైనవి. దురదృష్టవశాత్తు, పట్టణాల్లో ఉండే విద్యావంతులు, ఉద్యోగులు, యువత.. సోషల్ మీడియాలో ప్రభుత్వాలను విమర్శించడానికి చూపించే ఆసక్తిలో సగం కూడా ఓటు వేయడానికి చూపించడం లేదు. ట్విట్టర్‌లో గుంతల రోడ్ల ఫోటోలు పెట్టి ప్రభుత్వాన్ని తిడితే సరిపోదు, ఆ రోడ్లు వేయించే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత కూడా మనదే.

ఎన్నికల రోజు హాలిడేనా?

ఎన్నికల రోజును చాలామంది ‘హాలిడే’గా భావిస్తారు. ఆరోజు సినిమాకో, షికారుకో వెళ్లడానికో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికో కేటాయిస్తారు. 50 శాతం పోలింగ్ కూడా దాటని డివిజన్లు ఉన్నాయంటే, అది మన పౌర సమాజపు బాధ్యారాహిత్యానికి నిదర్శనం కాదా? మనం ఓటు వేయకపోతే, చైతన్యం లేనివారో, లేదా కేవలం డబ్బుకు ఆశపడేవారో వెళ్లి ఓటు వేస్తారు. ఫలితంగా సమర్థత లేని వ్యక్తులు, రౌడీయిజం చేసే వ్యక్తులు, భూకబ్జాదారులు మన పాలకులుగా ఎన్నికవుతారు. ఆ తర్వాత ఐదేళ్లు వ్యవస్థను తిట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం. ‘నోటా’ మీట నొక్కడానికైనా పోలింగ్ బూతుకు వెళ్లాలి తప్ప, ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్య ద్రోహం. ఇక నేటి ఎన్నికలు ధన ప్రవాహానికి చిరునామాగా మారుతున్నాయి..

నోటు తీసుకుని ఓటు వేస్తే...

‘ఓటుకు నోటు’ అనే సంస్కృతి గల్లీ స్థాయికి పాకింది. సాయంత్రం ఇచ్చే మందు సీసాకో, బిర్యానీ ప్యాకెట్‌కో, లేదా వెయ్యి, రెండు వేల రూపాయల నోటుకో ఓటును తాకట్టు పెడితే.. మనం కోల్పోయేది కేవలం ఒక హక్కును మాత్రమే కాదు, మన ఆత్మగౌరవాన్ని కూడా.. ఒక్కసారి ఆలోచించండి.. ఒక అభ్యర్థి ఓటుకు రూ. 2000 ఇచ్చాడను కుందాం. ఐదేళ్లలో మనం అతనికి అమ్ముకున్న విలువ రోజుకు ఒక్క రూపాయి మాత్రమే! మన ఆత్మగౌరవం విలువ రోజుకు ఒక్క రూపాయి నాణేమా? డబ్బులు ఇచ్చి గెలిచిన నాయకుడు, రేపు పదవిలోకి వచ్చాక తను పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టుకోవడానికి చూస్తాడే తప్ప, మన కాలనీ రోడ్లు బాగుచేయడానికి చూడడు.. రేపు మన వార్డులో సమస్య వచ్చినప్పుడు ఆ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కును మనం కోల్పోతాం. అమ్ముడుపోయే ఓటరు ఉన్నంత కాలం, కొనుగోలు చేసే నాయకుడు పుట్టుకొస్తూనే ఉంటాడు.

గల్లీ బాగుంటేనే.. ఢిల్లీ బాగుంటుంది!

కాబట్టి, పార్టీ జెండాలను, కులాలను, మతాలను పక్కన పెట్టి.. అభ్యర్థి వ్యక్తిత్వం ఆధారంగా ఓటు వేయాలి. ఆ అభ్యర్థి స్థానికుడేనా? మనకు కష్టం వస్తే ఫోన్ ఎత్తుతాడా? మన వార్డు సమస్యలపై అతనికి అవగాహన ఉందా? అన్నది ఆలోచించాలి. రౌడీ షీటర్లు, భూకబ్జా ఆరోపణలు ఉన్నవారిని ఎన్నుకుంటే, రేపు మన ఇంటి స్థలానికే ఎసరు పెడతారు. ప్రశాంతంగా ఉన్న కాలనీల్లో గొడవలు సృష్టిస్తారు. అదే చదువుకున్న వారు, సామాజిక స్పృహ ఉన్నవారు కౌన్సిల్‌లో ఉంటే.. పట్టణ ప్రణాళిక, నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుంది. ఈ క్రమంలో యువత, మహిళల పాత్ర కీలకం. ఇంటిని చక్కదిద్దే మహిళలకు, వీధిలో వచ్చే కుళాయి నీళ్ల కష్టం, చెత్త సమస్య బాగా తెలుసు. అందుకే, మహిళలు తమ ఓటును స్వతంత్రంగా వినియోగించుకోవాలి. ‘గల్లీ బాగుంటేనే... ఢిల్లీ బాగుంటుంది’ అన్నది నానుడి. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.. పోలింగ్ బూతుకు వెళ్లడం ఒక ప్రయాస కాదు, అది మన భవిష్యత్తుకు వేసే పునాది. గుర్తుంచుకోండి.. మీ వేలికి పడే సిరా చుక్క, కేవలం ఒక మార్కు కాదు.. అది మీ పట్టణ తలరాతను మార్చే వజ్రాయుధం.

- పురుషోత్తం నారగౌని

88973 88393

దొంగలకు సద్ది కట్టకండి.. అవినీతి అభ్యర్థులకు ఓటేయకండి!

Next Story