దొంగలకు సద్ది కట్టకండి.. అవినీతి అభ్యర్థులకు ఓటేయకండి!

by Ravi |   (  Updated:2026-02-11 02:33:03  IST  )

నేడు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇది సాధారణ ఎన్నిక కాదు.. మీ ఇంటి ముందు నీళ్లు వస్తాయా? డ్రైనేజీ పొంగుతుందా? వీధి దీపాలు వెలుగుతా యా? రోడ్లు బాగుంటాయా? గౌరవంగా పని చేస్తారా? అని నిర్ణయించేది. ఈ రోజు మీ వేసే ఓటుతోనే.. మీ రోజు జీవితం మారుతుంది.

దొంగలకు సద్ది కట్టకండి.. అవినీతి అభ్యర్థులకు ఓటేయకండి!
X

నేడు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇది సాధారణ ఎన్నిక కాదు.. మీ ఇంటి ముందు నీళ్లు వస్తాయా? డ్రైనేజీ పొంగుతుందా? వీధి దీపాలు వెలుగుతా యా? రోడ్లు బాగుంటాయా? గౌరవంగా పని చేస్తారా? అని నిర్ణయించేది. ఈ రోజు మీ వేసే ఓటుతోనే.. మీ రోజు జీవితం మారుతుంది. ఈసారి ఓటు వేయడమంటే కేవలం గుర్తు నొక్కడం కాదు.. మీ పిల్లల భవిష్యత్తుపై సంతకం పెట్టడం.

ఇప్పుడు ఓటు అడుగుతూ చాలా మంది నాయకులు దండాలు పెడతారు, చేతులు జోడిస్తారు. ‘ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే పని అయిపోతుందని’ హమీలిస్తా రు.. కానీ ఓటర్లారా.. నిజంగా వాళ్లకు స్పందించే గుణం ఉందా? రౌడీజం చేస్తాడా? నేర ప్రవృత్తి ఉందా? అవినీతి కేసులు, దందాలు, అక్రమ సంపాదన ఆరోపణలు ఉన్నాయా? లేదా మీ వీధిలో సమస్య వస్తే వచ్చారా? లేదా ఎలక్షన్ టైమ్ లోనే మీ ఇంటి మెట్టు ఎక్కారా? అనేది ఆలోచించాలి.

ఇలాంటి వారికి ఓటేస్తే..

ఈ ఎన్నికల్లో అక్రమాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్లకు మళ్లీ ఓటు వేసి దండాలు పెట్టకండి. అవినీతిని వృత్తిగా మార్చుకున్న వాళ్లకు ఈసారి ఓటుతోనే బుద్ధి చెప్పాలి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఏమి జరిగిందో ప్రజలందరికీ తెలుసు.. ముఖ్యంగా పట్టణాల్లో కొత్త ఇల్లు కట్టుకుంటే.. ‘పర్మిషన్ కోసం డబ్బులు పెట్టాలి’ ఈ రేటు లక్ష.. రెండు లక్షలు.. మూడు లక్షల దాకా వెళుతుంది. డబ్బు ఇస్తేనే ఫైల్ కదులుతుంది. లేకపోతే నిబంధనల పేరుతో అడ్డంకులు, ఆక్రమణ నిర్మాణమని బెదిరింపులు.. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దుర్వినియోగమే. ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపిస్తే, వాళ్ల చేతుల్లో మళ్లీ మన జేబు పెట్టినట్టే.. రేపు మరింతగా దోచుకుంటారు. అప్పుడు ‘నాయకులు మారరు’ అని బాధపడినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు వాళ్లే మళ్లీ వస్తారు.. అభ్యర్థికి ఓటేసేముందు భూ కబ్జాదారా? ఆక్రమార్కుడా? కబ్జా చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అనేది చూసుకోవాలి. అలాంటి వాళ్లే కౌన్సిలర్, కార్పొరేటర్ అయితే.. రేపు మీ భూమి, మీ వీధి, మీ పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటది? అనేది చూసి ఓటేయాలి. లేకపోతే మళ్లీ మోసపోవడం ఖాయం. సూటిగా చెప్పాలి అంటే.. భూ కబ్జాదారులకు సద్ది కట్టకండి.

ఓటుతోనే బుద్ధి చెప్పాలి..

ఈ ఎన్నికల్లో వారు గెలవడం కోసం డబ్బు పంచుతారు, మద్యం ఇస్తారు, హామీలు గుప్పిస్తారు, ‘ఈసారి నిజంగా పని చేస్తా’ అంటారు. ఓటర్లారా.. ఒక్కసారి మీ మనసులో ప్రశ్న వేసుకోండి.. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నప్పుడు తాగునీటి సమస్య తీర్చారా? డ్రైనేజీ బాగు చేసారా? వీధి దీపాలు వెలిగించారా? రోడ్లు వేసారా? లేదా మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా?అనేది చూడండి. డబ్బు ఇచ్చి ఓటు కొనే వాడు, గెలిచాక వంద రెట్లు వసూలు చేస్తాడు. అందుకే పార్టీ చూసి కాదు.. మనిషిని చూసి ఓటేయండి. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకోండి. ఫోన్ చేస్తే స్పందిస్తాడా? అహంకారం లేకుండా మాట్లాడతాడా? అక్రమాలకు ఎదురెళ్లే ధైర్యం ఉందా? ప్రజలను కలుపుకునే తత్వం ఉందా? అనేది ఆలోచించండి. అవినీతిని వృత్తిగా మార్చుకున్న వాళ్లకు ఈసారి ఓటుతోనే బుద్ధి చెప్పాలి.

ప్రజాసేవకుడిని గెలిపించండి!

మంచి కౌన్సిలర్, మంచి కార్పొరేటర్ అంటే.. మీ ఇంటి ముందు కనిపించాలి, సమస్య వింటే తప్పించుకోకూడదు, పర్మిషన్ కోసం డబ్బులు అడగకూడదు, రౌడీజం కాకుండా సేవా భావం ఉండాలి. ఇది రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పే అవకాశం. మీ ఓటు అమ్మకండి. మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టకండి. ఈ సారి నిజమైన ప్రజాసేవకుడినే గెలిపించండి. అప్పుడే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజలవవుతాయి.. దోపిడీదారులవి కావు. అవినీతి పరులను మళ్లీ గెలిపిస్తే, రేపు మరింతగా దోచుకుంటారు. ఈసారి ఓటు వేయడమంటే కేవలం గుర్తు నొక్కడం కాదు.. భవిష్యత్తును నిర్ణయించడం.

- కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,

90101 28884

గల్లీ బాగుంటేనే.. ఢిల్లీ బాగుంటుంది! పురపాలక ఎన్నికలను నిర్లక్ష్యం చేయకండి

Next Story