ఆడపిల్లల భద్రతకు భరోసా ఎప్పుడు.. ఇంకెంతమంది బలికావాలి?

by Ravi |   (  Updated:2026-07-10 00:30:25  IST  )

ఆడపిల్లలపై జరుగుతున్న ఘోర నేరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. బాలికల భద్రత, కఠిన చట్టాల అమలు, న్యాయ వ్యవస్థ బాధ్యతపై విశ్లేషణ..

ఆడపిల్లల భద్రతకు భరోసా ఎప్పుడు.. ఇంకెంతమంది బలికావాలి?
X

కామాంధుల తాపానికి అమాయకపు ఆడపిల్లలు ముక్కు పచ్చలారని జీవితాలు పదమూడేళ్లకే ఊరకుక్కల చేతిలో బలవుతున్నాయి. ఎన్ని కలలు కన్నదో ఆ తల్లి.. కొంగు చాటున దాచి వెన్నెల వెలుగులో పెంచిందేమో? తండ్రి భుజాలపై పాదముద్రలు ఇంకా చెరిగి ఉండవేమో.. వారి గుండెలు పగిలిపోయుంటాయ్..! వీధి కుక్కలు ఎక్కువగా తిరిగితేనే ఊరుకోరే.. మరెలా వీరిని వదిలేస్తున్నారు? నడిరోడ్లపై ఇలాంటి మధం పట్టిన తిరుగుబోతుల్ని ఇంకెన్నాళ్లు చూడాలి? ఈ దారుణాల్ని, ఇంకెంతమంది ఆడపిల్లల్ని బలితీసుకుంటారు? ఇలా చూస్తూ కుమిలి పోవడమేనా? మార్చలేరా చట్టాల్ని? నెలసరి వస్తేనే మూడు రోజులు ఆ నరకం భరించలేక, విలవిలలాడిపోతూ అమ్మకి వందసార్లు ఆ నొప్పిని గుర్తుచేస్తారు ఆడపిల్లలు.. అలాంటిది ఐదు రోజులు ఆ చిన్ని తల్లి ఎలా భరించిందో ముప్పది రెండు మందిని.. తలచుకుంటే కంట నీరు ఆగడం లేదు. గుండె సంద్రమైపోతుంది. ఎంత వెక్కి ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు.. వాళ్లకు ఎలాంటి శిక్ష వేసినా ఆమె జీవం పోసుకొని భువిపై నడువ లేదు. ఆ నీచుల ధైర్యం ఏంటి? ఏం చేసినా శిక్ష ఉండదనే అభిప్రాయమా? లేదా మగాళ్లమనే బలుపా? మగవారిలో చాలా ఉన్నతమైన ధోరణి కలిగిన వాళ్లు వున్నారు. కానీ ఇలాంటి వికృత చేష్టలు చేసే నీచులు ఉండడం వల్ల మంచివాళ్లపై వున్న అభిప్రాయం మాసి పోతుంది. మగాళ్లు అంటేనే భయం పేరుకుపోతుంది. నేటి ఆడపిల్లలు భవిష్యత్‌లో సుదూర ప్రాంతాలలో తమ జీవితాన్ని ఊహించుకోవడం ఊహాగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఇంత చేసిన వారిని వెంటనే చంపి పారేయకుండా ఇంటరాగేషన్ అంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చంపడం సరైంది కాదా? మరి చంపబడడం మాత్రం సరైందా? ఇలానే చూస్తూ పోతే మన దేశంలో భవిష్యత్ లో మగపిల్లలకు సరిపడా ఆడపిల్లల శాతం ఉండదు. ఆడపిల్లలు కావాలంటే కొట్టుకు చావాలి. ఒక్కసారి ఆలోచించండి. నీచపు ఆలోచనలు కలిగిన చోట ఎంత మంచితనం వెతికినా దొరకదు. పైగా ఆ జంతువు ఒక్కరిని బలి తీసుకొని ఊరుకోదు. అవకాశం ఇస్తే మరొకళ్లను వేటాడి తినేందుకు చూస్తుంది. ఇప్పటికైనా ఆలోచించి శిక్షలు అమలు చేయండి.

-వాసి జ్యోత్స్న

9866843005

Next Story