- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు రాజయ్యేదెన్నడు..?
రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాతలే దేశానికి వెన్నెముక. జై కిసాన్ అంటూ జేజేలు పలుకుతూ పల్లకి మోతలే మోస్తూ "మాటలు కోటలు దాటుతున్నాయి

రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాతలే దేశానికి వెన్నెముక. జై కిసాన్ అంటూ జేజేలు పలుకుతూ పల్లకి మోతలే మోస్తూ "మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు తంగేళ్లు దాటడం లేదు" అన్నట్లుగా ఉంది. నిజానికి రైతు శ్రమకు తగ్గ గుర్తింపు, గౌరవం ఇస్తున్నామా? అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. కానీ పారిశ్రామిక, సాంకేతిక, సేవారంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జాతీయ స్థూల విలువ జోడింపు (జీఏవి)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తగ్గుతోంది.
కృత్రిమ మేధ (ఏఐ) అన్ని రంగాల్లోనూ ప్రవేశించి ప్రగతి పరుగులు పెట్టిస్తుంటే!. వ్యవసాయ రంగం "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్న చందంగా కునారిల్లుతుంది. రైతు ఆత్మహత్యలను ఆపలేకపోవడం పాలకుల లోపమా? రైతుల శాపమా? ఏది ఏమైనా బలిపీఠంపై ఉన్న సాగును బాగుపడేలా చేస్తూ, రైతును రాజును చేసే సంగతేమో కాని కనీసం ఆత్మహత్యలను నివారించాల్సి ఉందనేది కాదనలేని నిజం. అప్పుడే నేటితరం యువత ఆ రంగంలోకి రాగలరు.. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కల్పించడం అభినందనీయమే..
రైతు కాడి వదిలేస్తే..
ఈ సంవత్సరం వర్షాలు జోరుగా కురుస్తాయని, రుతు పవనాలు ముందే వస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చెప్పినట్లుగానే జూన్ మొదట్లో రుతుపవనాలు వచ్చి తొలకరి కురిసి మురిపించింది. ఆ తర్వాత జూన్ నెల చివరకు వస్తున్నా ఆకాశం మేఘావృతమై ఉంటుందే.. కానీ వర్షాలు పడడం లేదు. తొలకరి వానలకు నాటిన పత్తి తదితర పంటల కోసం రైతులు నొసటిన చేయి పెట్టి ఆకాశం వైపు ఎదురుచూస్తున్న పరిస్థితులు ఇన్నేళ్లైనా మారనే లేదు.. వ్యవసాయం అంటే పండినా.. పండక పోయినా రైతు నిరాశ చెందకుండా ముందుకే సాగుతాడు.. ఈ పరిస్థితి ఈనాటిది కాదు.. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి చూస్తున్నాం. మన దేశంలో సాగు రంగంలో దండుగ! పండుగ రెండూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఒక ఏడు పండితే.. మరో ఏడు పండదు! అయినా పండలేదని రైతు కాడి-మేడి వదిలేస్తే.. అందరికీ ఆహారం ఎలా? ప్రకృతి విపత్తులకు తోడు పాలకుల ఉదాసీనత, వ్యాపా(దళా)రుల దోపిడీ, నాసిరకం విత్తనాలు, నకిలీ పురుగుమందులు, నాణ్యత లేని ఎరువులు.. ఇలా అనేక విధాలుగా అష్టకష్టాలైనా అను భవిస్తూ, అధిగమిస్తూ పంట పండిస్తాడు. చివరకు పండిన పంట అమ్ముకునే నాటికి గిట్టుబాటు (మద్దతు) ధర ఉండదు. అలా అని రైతు నిరాశకు, నిస్పృహకు లోనైతే మనం బతికేదెలా? అని రైతులు సాగు చేస్తూ వారు బతుకుతున్నారు. మనల్ని బతికిస్తున్నారు.
దోపిడి నుండి విముక్తి కలిగించరా?
రైతు మొక్క మొలకెత్తింది మొదలు దానిని పసిబిడ్డను చూసినట్లు అపురూపంగా చూసుకుంటాడు. కలుపు తీస్తాడు, మందులు వేస్తాడు పంట చేతికందే సరికి అనావృష్టో లేదా అతివృష్టి వలనో ఆ పైరు ఎండిపోవడమో, కొట్టుకపోవడమో జరుగుతుంది. దీంతో విత్తనాల ఖర్చులు కూడా తిరిగి రాని దయనీయ స్థితి. వారిని ప్రకృతి, పాలకులు, వ్యాపారులు దగా చేస్తున్నా వ్యవసాయాన్ని వదులుకోడు.. కాడి దించే ప్రసక్తే లేదు.. రేయింబవళ్లు ఎండా వానా ఏదైనా సరే నిత్యం పుడమి తల్లిని, వ్యవ సాయాన్ని నమ్ముకొని అదే పని చేస్తుంటాడు. వారి శ్రమ వెలకట్టలేనిది."సూర్యుడైనా మబ్బుల చాటుకెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటాడేమో..!" కానీ రైతు మాత్రం అవిశ్రాంతంగా దేశానికి పట్టెడు అన్నం పెట్టడం కోసం ఫలితం మీద ధ్యాస లేకుండా పోరాడుతూనే ఉంటాడు.. సాయం కోసం వ్యవసాయాన్ని వదులుకోలేని త్యాగమూర్తి అన్నదాత. మరి పాలకులు ఏం చేస్తున్నారు! ఏంచేయాలి..? రైతులను దళా(వ్యాపా)రుల దోపిడీ నుంచి విముక్తి కలిగించరా? పంటకు గిట్టుబాటు(మద్దతు)ధర కల్పించరా? అవి వారికి కల్పించినప్పుడే ఈ తరం యువత వ్యవసాయం వైపు మళ్లుతారు.. పట్టణాలకు వలస నివారించబడుతుంది.
నిజమైన పండుగ అప్పుడే...
సాగునే నమ్ముకున్న అన్నదాతల ఆత్మహత్యలు నివారించబడి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన రోజే నిజమైన పండుగ.. దేశ సౌభాగ్యానికి పునాది రాళ్లయిన అన్న దాతలు చల్లగా ఉంటేనే మన కడుపు చల్లగా ఉంటుంది. ఈ దేశంలో సాగు రంగాన్ని తరతరాలుగా పట్టి పీడిస్తున్న ఆత్మహత్యల సామాజిక రుగ్మతను తరిమి వేయాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాలదే.. ఇదంతా పాలకులు రైతుకు చేయాల్సిన కనీస బాధ్యత.
మేకిరి దామోదర్,
95736 66650






