- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌరసత్వానికి ధృవీకరణ పత్రం ఏది?
పాస్‌పోర్టు, ఆధార్, ఓటర్ ఐడీ నిజంగా భారత పౌరసత్వానికి చట్టబద్ధమైన ఆధారాలేనా? పౌరసత్వ చట్టం–1955, రాజ్యాంగ నిబంధనలు, ఓటర్ల జాబితా (SIR) నేపథ్యంలో పౌరసత్వాన్ని నిరూపించే చట్టపరమైన అంశాలను తెలుసుకోండి.

పౌరసత్వం అనేది ఒక వ్యక్తికి లభించే అత్యంత కీలకమైన చట్టబద్ధ హోదా. అయితే ఇటీవల దేశంలో పౌరసత్వ నిర్ధారణ, ఓటర్ల జాబితా పరిశీలన (SIR) వంటి అంశాల నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నా యి. పాస్‌పోర్టు, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు వంటి పత్రాలు నిజంగా భారత పౌర సత్వానికి చట్టబద్ధమైన ఆధారాలేనా? అసలు పౌరసత్వాన్ని ఏ చట్టం నిర్ణయి స్తుంది? ఏ పత్రాలు గుర్తింపునిస్తాయి? ఈ ప్రశ్నలకు రాజ్యాంగం, పౌరసత్వ చట్టం, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి అవసరం.
ఒక వ్యక్తిని చట్టబద్ధంగా దేశ పౌరుడిగా గుర్తించడాన్ని పౌరసత్వం అంటారు. అమెరికాలో లాగా మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు.. దేశంలో ఉండే ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి భారతీయ పౌరులు, రెండు విదేశీయులు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు చాలా విదేశీయులకు వర్తించవు. ఉదాహరణకు ఎన్నికలలో పోటీచేసే హక్కు, ఎన్నికలలో ఓటు వేసే హక్కు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగే హక్కు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించే హక్కు భారత దేశ పౌరులకు మాత్రమే ఉంటుంది.
పాస్‌పోర్ట్.. పౌరసత్వానికి గుర్తింపు పత్రం కాదు!
విదేశాలలో భారతీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు భారత పాస్‌పోర్టును భారతీయులు పౌరసత్వానికి ప్రమాణపత్రంగా గుర్తిస్తున్నారు. అయితే చట్టం దృష్టిలో భారతీయ పాస్‌పోర్టు అనేది భారతీయ పౌరసత్వానికి ఋజువు పత్రం కాదంటుంది మన విదేశాంగ మంత్రత్వ శాఖ. పాస్‌పోర్టు యాక్ట్ 1967లోని 62 “ఎ” ప్రకారం భారతీయులు కాని వారికి ప్రభుత్వం పాస్‌పోర్టు జారీని నిరాకరించవచ్చు. అయితే ఇదే యాక్ట్ చట్టంలోని 20వ సెక్షన్ 6ను అనుసరించి భారతీయులు కాని వారికి కూడా కేంద్రప్రభుత్వం పాస్‌పోర్టు లేదా ప్రయాణ ధృవపత్రం అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జారీ చేయవచ్చు.. ఈ కారణంగానే విదేశీయాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టు భారత పౌర సత్వానికి ఋజువు కాదన్నట్లు భావించాల్సి వస్తుంది. గమనార్హమైన అంశం ఏమిటంటే పౌరసత్వం నిర్ణయం అనేది పౌరసత్వ చట్టం 1955 ఆధారంగా నిర్ణయిస్తారు. పాస్‌పోర్టు అనేది 1969 పాస్‌పోర్టు చట్టం ఆధారంగా జారీ చేస్తారు.
ఆధార్.. పౌరసత్వ గుర్తింపు పత్రమా?
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. ఈ సంస్థకు ఆధార్ కార్డును జారీ చేసే అధికారం కలిగి ఉంది. ఆధార్ కార్డును అనేక సందర్భాల్లో ఋజువు పత్రంగా ఆమోదిస్తున్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌ను పౌరసత్వ ఋజువు పత్రంగా గుర్తించవచ్చా? అన్న అంశంపై వివరణ ఇస్తూ.. ఆధార్ అనేది వ్యక్తుల గుర్తింపు పత్రమని, ఆ వ్యక్తి చిరునామాకు ఆధారమని, అంతే కానీ అది పౌరసత్వ గుర్తింపు పత్రం కాదని స్పష్టంగా వివరణ ఇచ్చింది. నిజానికి భారతదేశ పౌరులు కాని వ్యక్తులై ఉండి చట్టబద్ధంగా భారత దేశంలో నివసిస్తున్న వారికి కూడా ఆధార్‌ను జారీ చేస్తారు. అనేక ప్రభుత్వ సేవలకు ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం. 2026 మే 27న SIR విచారణ సందర్భంగా ఆధార్ ప్రస్థావన వచ్చినప్పుడు, ఆధార్‌ను పౌరసత్వానికి గుర్తింపు పత్రంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఓటర్ కార్డు.. పౌరసత్వ గుర్తింపు పత్రమా?
ఇక ఓటర్ గుర్తింపు పత్రాన్ని పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావించవచ్చా? అంటే ప్రస్థుతం మన దేశంలోని 16 రాష్ట్రాలలోనిర్వహిస్తున్న SIR సందర్భంగా పాస్‌పోర్టును భారత పౌరసత్వ గుర్తింపు కార్డుగా పరిగణించవచ్చా? అన్న సందర్భంలో దేశీయంగా మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణ ఇది. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి 329 ప్రకారం 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం భారతీయ పౌరులు మాత్రమే మన దేశంలో ఎన్నికల్లో ఓటు చేయడానికి అర్హులు. ఎన్నికల జాబితాలోని ఓటర్ లిస్టులో పేరు ఉన్నా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫోటోతో కూడిన ఎన్నికల గుర్తింపు కార్డు ఉన్నా అవి భారత పౌరసత్వ నిరూపణకు ధృవీకరణ పత్రాలుగా ఉపయోగపడవు. 2026వ సంవత్సరం SIR పై జరిగిన విచారణ సందర్బంగా భారత్‌లో ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉండవచ్చు అన్న అంశంపై నిర్ణయాధికారం కలిగి ఉందని, కానీ పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్‌కి అధికారం లేదని విశదీకరించింది.
చట్టబద్ధమైన అధికారిక పత్రం అవసరం!
అనేక మంది భారతీయుల దగ్గర వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏ రకమైన చట్టపరమైన ఋజువులు ప్రస్తుతానికి లేవు. ఇది దేశ ప్రజల్లో అలజడిని, ఆందోళనలను సృష్టిస్తోంది. దేశపౌరులుగా తామూ నిరూపించుకోవాలంటే ఏ పత్రాలు ప్రామాణికమని భారత పౌరులు అడుగుతున్నారు. సందర్భోచితంగా భారతీయులు జనన ధృవీకరణ పత్రం ద్వారా పుట్టిన ప్రదేశం ద్వారా తల్లిదండ్రుల నివాసం ఆధా రంగా వారి భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ కారణంగా భారతీయులందరికీ వారు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక చట్టబద్ధమైన అధికారిక పత్రం రూపొందించాలని అభిలషిస్తున్నారు.
-డా. పి. మోహన్‌రావు,
మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
99495 95509






