- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కళాకారులకు భరోసా ఏది?
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పీఆర్సీ, సంక్షేమ సదుపాయాలు, పెన్షన్ వంటి డిమాండ్లతో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార అవసరంపై విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో ఉద్యమ కళాకారుల పాత్ర అత్యంత కీలకమైనది. పాటలు, జానపద కళారూపాలు, నాటికల ద్వారా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమానికి ఊపిరిపోసిన వారే ఈ కళాకారులు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజల్లో చైతన్యం నింపుతూ వారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
ఉద్యమంలో కీలక పాత్ర..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారి సేవలను గుర్తిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి (టి.ఎస్.ఎస్.) ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమైన నిర్ణయం. అయితే, ఉద్యోగం కల్పించడం మాత్రమే కాదు.. ఆ ఉద్యో గానికి తగిన గౌరవం, భద్రత, సంక్షేమం కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ అంశంపై నేడు సాంస్కృతిక సారథి కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలువురు ఉద్యమ కళాకారులు తమ సమస్యలను నాతో పంచుకున్నారు. వారి మాటల్లో వినిపించిన బాధ, కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం, ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి ఈ వ్యాసానికి ప్రేరణగా నిలిచాయి. ఇది ఒకరి సమస్య కాదు.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వందలాది కళాకారుల ఉమ్మడి వేదన.
పదేళ్లుగా సేవలు.. సదుపాయాలు నిల్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 583 మంది తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అయితే, పదేళ్లకు పైగా సేవలందిస్తున్నప్పటికీ వేతనాలు, సేవా నిబంధనలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సదుపాయాల విషయంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వారి ప్రధాన ఆవేదన ఉద్యోగాల క్రమబద్ధీకరణ, తగిన వేతన సవరణ, పీఆర్సీ, డీఏ అమలు, పెండింగ్ బకాయిల విడుదల, టీఏ–డీఏల చెల్లింపు, ప్రమాద ఆరోగ్య బీమా, స్పష్టమైన సేవా నియమావళి, పదవీ విరమణ చేసిన వారికి గౌరవప్రదమైన పెన్షన్ వంటి అంశాలపై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల ప్రయాణ ఖర్చులు, కుటుంబ నిర్వహణ, వైద్య అవసరాలు వారి మీద అదనపు భారంగా మారుతున్నాయి.
ఆశలు నింపిన గొంతులకు భద్రత లేదా?
ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని రాష్ట్రం ఎలా గౌరవిస్తుందన్న ప్రశ్న కూడా. ఉద్యమ సమయంలో ప్రజల్లో ఆశ నింపిన గొంతులు నేడు కనీస జీవన భద్రత కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం ఆలోచనీయమైన అంశం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అదే స్ఫూర్తితో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలపైనా ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి, సాధ్యమైన అంశాలపై దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటే అది ఉద్యమ స్ఫూర్తికి ఇచ్చే నిజమైన గౌరవంగా నిలుస్తుంది.
త్యాగాలకు గౌరవం ప్రశంసలు కాదు..
తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ విజయగాథ కాదు. అది వేలాది కళాకారుల త్యాగాలు, తపన, ప్రజా చైతన్యంతో నిర్మితమైన చరిత్ర. ఆ త్యాగాలకు నిజమైన గౌరవం వేదికలపై ప్రశంసలు కురిపించడం కాదు. వారి జీవితాలకు భద్రత, గౌరవప్రదమైన ఉద్యోగ జీవితం, ఆర్థిక భరోసా కల్పించడమే. ఉద్యమాన్ని గెలిపించిన ఆ కళాకారుల జీవితాలు కూడా గెలిచేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికీ, సమాజానికీ నైతిక బాధ్యత. వేదికలపై ఉద్యమ గీతాలు ఆలపించిన గొంతులు నేడు జీవన భరోసా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. తెలంగాణ సాధనకు తోడ్పడిన ప్రతి వర్గానికి న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిద్దాం. ఉద్యమ కళాకారుల సేవలకు తగిన గౌరవం వారి జీవితాల్లో ప్రతిబింబించినప్పుడే తెలంగాణ సాధన స్ఫూర్తి సంపూర్ణమవుతుంది.
-సయ్యద్ రఫీ
ఈసీ మెంబర్, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్






