- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల బలవన్మరణాలకు కారకులు ఎవరు?
రాష్ట్రంలో ఇటీవల జరిగిన, జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ప్రతి నిత్యం కార్పొరేట్ కళాశాలల

రాష్ట్రంలో ఇటీవల జరిగిన, జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ప్రతి నిత్యం కార్పొరేట్ కళాశాలల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. అడ్మిషన్లు ఇవ్వక ముందు కాళ్లా వేళ్లా పడ్డ తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అదే కళాశాలపై విరుచుకు పడుతున్న సంఘటనలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రతిరోజూ పత్రికల్లో ఈ విషాద కథలు పతాక స్థాయిలో చదువుతున్నాం.
ఇటీవల నారాయణ కళాశాల యాజమాన్యపు వేధింపులకు విద్యార్థి తనుష్ తనువు చాలిం చాడు, ఇంపల్స్ కాలేజి విద్యార్థి ప్రజ్ఞా రెడ్డి పల్స్ ఆగిపోయింది. ఒక కార్పొరేట్ కళాశాల గోడపై I WILL DIE TODAY (నేను ఈ రోజు చచ్చిపోతాను) అని రాసిన తీరు చూస్తుంటే విద్యార్థులు ఏ మేరకు ఒత్తిడి గురి ఆవుతున్నారో తెలుస్తుంది. ఇప్పటి వరకు కార్పొరేట్ కళాశాలలో చనిపోయిన విద్యా ర్థులు ఎందరో.. బయటి ప్రపంచానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టినవి ఎన్నో..? భారతదేశం బాల్యం తరగతి గదిలో బందీ అవుతుంది.
వారి ఇంటెలిజెన్స్ తెలుసుకోకుండా..
ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంలో అభిరుచి, నైపుణ్యం ఉంటుంది. అది గమనించకుండా తల్లిదండ్రులు తమలోని అభిరుచులు, ఆశలు, కోరికల ఆధారంగా బలవంతంగా తమ పిల్లలు డాక్టర్ కావాలి, ఐఐటీలో, ఎన్‌ఐటీలో సీటు తెచ్చుకోవాలని లక్ష్యాలు పెట్టి కార్పొరేట్ కాలేజీలు అనే జైళ్లలో వారి బాల్యాన్ని బందీ చేస్తూ.. పరోక్షంగా వారి మృతికి కారణం అవుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యను కొనే ప్రయత్నం చేస్తు న్నారు. కానీ విద్యను అభ్యసించే విద్యార్థుల అభిరుచులు గాని, వారి ఇంటెలిజెన్స్ తెలుసుకోవడం లేదు. వారి బలాబలాలను అంచనా వేయకుండా వారిపై మోయలేని భారాన్ని మోపుతున్నారు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు..
కార్పొరేట్ రాకతోనే పోటీ మొదలు..
తెలుగు రాష్ట్రాల్లో ఒక ముప్ఫై ఏండ్ల వెనక్కి వెళితే విద్యారంగంలో ఇంత పోటీ, ఒత్తిడి ఉండేది కాదు. ప్రభుత్వ కళాశాలలో ఆడుతూ పాడుకుంటూ విద్య అభ్యసించేవారు. క్రమంగా విద్య కార్పొరేట్ పరం అవడంతో పోటీ మొదలైంది. స్వత సిద్ధ మానసిక పరిపక్వత వికటించి కృత్రిమ మేధ పెరిగింది. ప్రశ్నకి జవాబు రాసే విధంగా విద్యార్థులు తయారు కాబడుతున్నారు.. కానీ ప్రశ్నను స్వయంగా ఎదుర్కొని పరిష్కరించే విచక్షణ విద్యార్థులు కోల్పోతున్నారు. ప్రశ్న-జవాబు తప్ప ఇతర విషయాల్లో విద్యార్థులు తర్ఫీదు కోల్పోతున్నారు. సమాజంతో సంబంధాన్ని కోల్పోతున్నారు. మానవ సంబంధ విలువలు మరచిపోతున్నారు. తద్వారా తమలోని ఆందోళనను, మంచి చెడులను పంచుకోవడానికి మంచి మిత్రులకూ దూరం అవుతున్నారు. కనీసం పండుగలకు, పబ్బాలకు, ఇంట్లో వేడుకలకు దూరం అవుతున్నారు.
పేరెంట్స్ కలలు.. పిల్లల పాలిట శాపాలు..
నిర్బంధ విద్య, ఉచిత విద్య కావాలనే మాట వెనకట ఎప్పుడో విన్నాం. కానీ నేడు కార్పొరేట్ ఖరీదైన విద్య దాన్ని నిజం చేస్తోంది. ఈ నిర్బంధ విద్య గొప్ప లక్ష్యాలను నిర్దేశిస్తుంది. తల్లితండ్రుల ఆశలను నిజం చేయడానికి కఠోర శిక్షణ లభిస్తుంది. ఆ కఠోర శిక్షణకు లక్షలు వసూలు చేస్తుంది. ప్రస్తుతం విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే వ్యవస్థే లేదు. వేలాది మందిని కిక్కిరిసిన గదుల్లో బందిస్తున్నారు. సరియైన వెంటిలేషన్ ఉండదు, ఏసీలు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు.. పిల్లల జీవితాలు ఏసీ గదుల్లో బందీ చేసి తల్లిదండ్రులు తమ కలలను నిజం చేసుకోవాలని అనుకోవడం కార్పొరేట్ కళాశాలకు వరం పిల్లల పాలిట శాపం అయ్యింది.
విద్యాలయాలుగా అపార్ట్మెంట్లు..!
ప్రస్తుతం దేశంలో ఏ విధమైన ఆటలు గాని ఆటస్థలం గాని లేని అపార్ట్మెంట్లు విద్యాలయాలుగా విలసిల్లుతున్నాయి. హాస్టల్ భవనాల్లో సామూహిక మరుగు దొడ్లు, అక్కడ క్యూలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక ఎక్కువ నీరు తాగితే తరగతి గది నుండి మూత్రశాలకు వెళ్లాల్సి వస్తుందని అసలు నీరుతాగడం మానే శారు. ఇది వారికి ఎన్నో మూత్ర సమస్యలను తెస్తుంది. అలాగే టీనేజ్ అమ్మాయిలకు వారి అమ్మ తోడు ఉండాల్సిన సమయంలో లేరు. హాస్టళ్లలోని అమ్మాయిలు ఉన్నా వారి బాధను పంచుకునే వారు ఉండరు. ఒక పక్క చదువు, ఒత్తిడి మరోపక్క ఆరోగ్య సమస్యలు, నిద్ర లేమి ఇవన్నీ ముక్కు పచ్చలారని బాల్యాన్ని చిదిమేస్తున్నాయి..
ఎగిరే రెక్కలకు బిగిస్తున్న ఉచ్చులు..
హైస్కూల్ విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఇంటర్మీడియట్ అని ఎందుకు పేర్కొన్నారో గాని ఈ దశ చాలా కీలకమైనది. ఈ వయసు చాలా క్లిష్టమైనది. తనకు తాను మంచిగా లేదా చెడుగా మారే వయసు ఇదే! అలాగే బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకొనే వయసు. కానీ ఆ వయసులో వారు బందీ అవుతున్నారు. వారి రెక్కలకు బరువులు వేలాడ దీస్తు న్నారు. స్వేచ్ఛగా ఎగిరే రెక్కలకు ఉచ్చులు బిగిస్తున్నారు. ఉద్రేకానికి లోనైన విద్యార్థులు బలవంతపు మరణానికి లోను అవుతున్నారు.
ఈ మరణాలు ఆపలేమా?
అందుకే ప్రభుత్వం విద్యను పటిష్టం చేయాలి. కేజీ నుండి పీజీ దాకా ఉచిత నాణ్యమైన విద్యను కుల, మతాలకు అతీతంగా అమలు చేయాలి. ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలి. ప్రతి మండలంలో జూనియర్, డిగ్రీ కళాశాల అన్ని వసతులతో ఏర్పాటు చేయాలి. కులాల వారిగా హాస్టల్స్‌ను ఏర్పాటు చేయ కుండా అందరూ ఒక్కటే అన్న భావన వచ్చె ట్టుగా అందరికోసం హాస్టల్స్ ఏర్పాటు చేయా లి. కార్పొరేట్ విద్యను రద్దు చేయాలి. మంత్రి కొడుకు అయినా రోజువారీ కూలి పిల్లలు అయినా వారికి దగ్గర్లోని పాఠశాలలోనే చదివించాలి. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కాకుండా అభిరుచి మేరకు ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలి. ప్రతి కళాశాలలో అందరికీ అందుబాటులో ఉండే ఒక డాక్టర్‌ని అలాగే ఒక మానసిక వైద్యుడిని అందుబాటులో ఉంచాలి. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు విధిగా ప్రవేశపెట్టాలి. 24 గంటలు చదువు-చదువు అనే సూత్రం నుండి ఆడుతూ పాడుతూ చదువు అన్న నినాదం రావాలి. విద్యార్థికి తను ఏమి చదవాలో స్వేచ్ఛ ఉండాలి. తల్లిదండ్రులు వారి లక్ష్యాలను, కోరికలను పిల్లలపై రుద్దరాదు. వారి కలలు పిల్లలపై బలవంతంగా రుద్దరాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వారిని ప్రోత్సహించాలి.
ఇష్టం లేని పని చేయించవద్దు!
పిల్లలు ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తారు అన్న విషయాన్ని గమనించాలి. ఇష్టం లేని పని చేయించడం అంటే వారి ఆశయాలను మనం తొక్కిపెట్టి వారికి సమాధి కట్టడమే. కేవలం ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ మాత్రమే ఈ సమా జంలో గొప్ప వారు కాదు. ప్రతి పనీ, ప్రతి వృత్తీ గౌరవించదగినదిగా భావించాలి. ప్రతి వృత్తి ఈ సమాజానికి అవశ్యం అని గమనించాలి. ప్రతి విద్యార్థి గర్వంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి. ప్రతి విద్యార్థి స్వయం ప్రకాశమై వెలగాలి.
శిరందాస్ శ్రీనివాస్
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాద్.
94416 73339






