- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగని పరువు హత్యలు... ఏం సాధిస్తున్నట్టు?
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగు తున్నా.. ఇంకా మన దేశంలో పరువు హత్యలు ఆగడం లేదు. ఏదో ఒక రాష్ట్రంలో

రోజు రోజుకు టెక్నాలజీ పెరుగు తున్నా.. ఇంకా మన దేశంలో పరువు హత్యలు ఆగడం లేదు. ఏదో ఒక రాష్ట్రంలో తరచూ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తమ కూతుళ్లు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని తమ పరువు తీశారనే కోపంతో కొందరు తల్లిదండ్రులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు క్షేమం కోరుకోకుండా... పక్కా ప్లాన్ ప్రకారం ఏకంగా అల్లుళ్లను క్రూరంగా చంపేస్తున్నారు.
వాస్తవానికి పరువు హత్యలు మన దేశంలో కొత్తేమీ కాదు. ప్రతీ హత్యా ఓ సంచలనమే. పరువు, ప్రతిష్ట అనే మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఓ అమ్మాయిని కులాంతర వివా హం చేసుకున్నందుకు 2025 జనవరి 26న సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ (30) అనే యువకుడిని దారుణంగా చంపేశారు. కృష్ణ భార్య భార్గవి కుటుంబ సభ్యులు హత్య చేసి, కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ పరువు హత్యతో వారు ఏం సాధించినట్టు..? తరాలు మారుతు న్నా కులం, మతం పేరుతో జరుగుతున్న హ త్యలు ఇప్పటికీ ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే బొందవెడుతున్నా రు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కొంతమందిలో ఇసుమంతైనా మార్పు రావ డం లేదు. మనిషి ప్రాణం తీసేస్తే పరువు తిరిగొస్తుందా..? ఇప్పుడు తమ భర్తలను పొగొట్టుకున్న యువతుల పరిస్థితి ఏంటి..? ఎవరైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇక లేడన్న నిజాన్ని వాళ్లు ఎలా జీర్ణించుకోగలరు..?
జైలుకెళితే పరువు మిగులుతుందా?
భారతీయ సమాజంలో ఇప్పటికీ కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుండడం బాధాకరం. ఇప్పటికే మన దేశంలో వందల సంఖ్యలో పరువు హత్యలు జరిగాయి. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశంలో అక్షరాస్యత, విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. కానీ, కుల, మత దురాభిమానాలు తగ్గడం లేదు. పరువు హత్యలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయినా కొందరు తల్లిదండ్రులు, సోదరులు మారడం లేదు. క్షణికావేశంలో కొంతమంది తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు వారినే బలిపశువులను చేస్తున్నా యి. ఇతర కులం వారిని పెళ్లి చేసుకున్నారనో, తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారనో లేదా వారిని ప్రేమించారని తెలిసినా, వారిని వదలడం లేదు. కన్న కూతురు, కొడుకులను కూడా హతమారుస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. మరికొందరు కులం గురించి పట్టించుకోకున్నా ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక పరమైన తేడాలను గమనిస్తున్నారు. అంతేకాదు ప్రాంతీయ వివక్షలను కూడా చూడటం ఆందోళనకరం. కొందరు తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలకు పాల్పడి జైలు పాలవ్వడం ఒక ఎత్తు అయితే.. జైలుకు వెళ్లి వచ్చినా కూడా తమ తీరును మార్చుకోకపోవడం మరింత విచారకరం.
ద్వేషించడాన్నే ప్రేమిస్తున్న కులం
రెండు వేల సంవత్సరాలకు పైగా మన సమాజాన్ని అంధకారం, అజ్ఞానంలో ఉంచటంలో కుల వ్యవస్థ పాత్ర చాలా ఉంది. శ్రమ చేసే వారికి చదువు లేకుండా చేసింది కులమే. మనుషుల మధ్య ఐక్యత, సాన్నిహిత్యం లేకుండా చేస్తోంది కులమే. ప్రేమించడాన్ని సహించదు సరికదా ద్వేషించడాన్నే ప్రేమిస్తుంది. ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు తిరిగి మన దేశానికొచ్చి తన కులమెక్కడుందో వెతుక్కొని, సొంత కులంలోనే పెండ్లి చేసుకుంటున్నారంటే కులమెంతగా ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా వారిని ధర్మం తప్పినట్లు కుల సమాజం చూస్తోంది. హంతకులుగా మారుతున్న రక్త సంబంధికులు తాము చేసింది తప్పని అనుకోవడం లేదు. కుల ధర్మాన్ని కాపాడటానికే ఈ పని చేశామని గొప్పగా భావి స్తున్నారు కొందరు.
కులం కొందరికి వరం.. ఎందరికో శాపం
కులాల కుంపట్లు పోయే వరకూ ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే కులాంతర వివాహం చేసుకున్న వారికి కేంద్రం నగదు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. అయినా సమాజంలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన జబ్బు కుల వ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కుల వివక్షతో అణచివేయబడుతున్నారని గణాంకాలే చెబుతున్నాయి. మన దేశంలో కులం కొందరికి వరమైతే, ఎందరికో శాపంగా మారు తోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమాజానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. ఆ రోజు రావాలంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి. కుల రహిత సమాజం ఆవిర్భవించాలి.
- ఉపేందర్ పెండెం
91607 62682






