మాకు అన్న‌మొద్దు సారు..!

by Ravi |   (  Updated:2026-07-07 00:30:47  IST  )

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై పెరుగుతున్న బోధనేతర పనిభారం, మధ్యాహ్న భోజన నిర్వహణ, జీతాలు, డీఏ, పీఆర్సీ బకాయిలు, విద్యా నాణ్యతపై వాటి ప్రభావం గురించి ఒక ఉపాధ్యాయుడి ఆవేదనను ప్రతిబింబించే కథనం.

మాకు అన్న‌మొద్దు సారు..!
X

మాకెందుకు సార్ అన్నం.. రోజూ మేం తింటున్న అన్నమే ఒంట పట్టక చస్తున్నాం. ఇప్పుడు పిల్లలు తింటున్న అన్నం మమ్మల్ని తినమని ఊళ్ళోళ్ళతో తిట్లు తినిపించకండి.. మొన్నటికి మొన్న చదు వుల కమిషన్ జీతాలు ఎక్కువైనయన్నందుకే తలకాయలు లంచ్ బాక్స్‌లో పెట్టుకుని పోతున్నాం.. మళ్లీ ఇప్పుడు పోరల బువ్వ కూడా తింటున్నరని చెత్త కుండీలల్ల పిల్లలు తినలేక విసిరేసిన బువ్వలా మమ్మల్ని చీత్కరానికి గురి చేయకండి. మా బకాయిలు, డీఏలు, పీఆర్సిలు ఇస్తే.. మా బువ్వ ఏదో మేం తిని, మా చదువేదో మేము చెప్పుకుం టాం. ఇప్పటికే మీరిచ్చే ధరలకు మధ్యాహ్నం వంటోళ్లు వారానికి మూడు గుడ్లు ఎట్లా పెట్టేదని.. ఒక్కో రోజు ఎగ్గొట్టితే, మేమే తింటున్నామని బదనాం చేస్తున్నరు.. పిల్లలు మా ముందే అన్నం ప్లేట్లు పెట్టి, ఈ బువ్వ మీరైతే తింటారా? అని అడిగినప్పుడల్లా కడుపుల దేవినట్లయితుంది. ఇన్ని ప్రశ్నల మధ్య మేము తిన్న తిండి మాకు ఒంట పట్టక ముఖం చాటేసుకుంటున్నమ్.. ఎవరో ప్రవచన కారుడు అన్నట్టు పొద్దున వచ్చిన దగ్గరనించి.. టిఫిన్లు, ఫేషియల్ అటెండెన్స్‌లు, ఎఫ్‌ఆర్‌ ఎస్‌లు, బియ్యం లెక్కలు, అటెండెన్స్‌లు, పుస్తకా లు నోట్ బుక్కులు పంచుడు, ఆన్లైన్లోనే నింపుడు ఇదే మాకు నిత్యకృత్యమైంది. చదువు చెప్పుడు తక్కువ ఈ పనులు ఎక్కువ.. ఇంత జేస్తున్నా సర్కారు బడుల్లో చదివే రావట్లేదని, నివేదికలన్నీ మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు సర్ ప్లస్, వర్క్ అడ్జ స్ట్మెంట్‌ల పేర మా గుండెల్లో గునపాలు దించు తూనే ఉన్నారు.. వీలైతే మరో నాలుగు రూపాయ లు పెంచి, పిల్లలకు కడుపునిండా ఓ పూటైనా మంచి భోజనం పెట్టండి. వండి పెట్టేటోళ్ల ఆకలి తీర్చండి.. బంగారం తూచినట్టు.. బియ్యం, పప్పు కూరగాయలు, జోకకుండా పిల్లల కడుపు నిండా మంచి భోజనం పెట్టండి.. బడిలో భోజనం తినలేక ఇంటి నుండి డబ్బాలు తెచ్చుకునే పిల్లలు తినేలాగా మెనూ పెంచండి.. అంతేకానీ మాకెం దుకు సారు డైలీ అన్నం.. మాకు అన్నం పెట్టే బదులు బడికి ఇంత సున్నం వేయండి.. పిల్లలకు మంచి నీళ్లు పోయండి.. మమ్మల్ని టిఫిన్లు, బియ్యం, మధ్యాహ్న భోజన లెక్కల చిక్కుల నుండి విముక్తం చేయండి.. మాకు ఇచ్చే జీతానికి న్యాయం చేయనీయండి!

-సహచరి

94409 70454

Next Story