విశ్వకర్మల ఐక్యతే అభివృద్ధికి పునాది!

by Ravi |   (  Updated:2026-06-09 01:00:47  IST  )

విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సమాజం భారతీయ శిల్ప, నిర్మాణ, నైపుణ్య సంపదకు ప్రతీక. సంప్రదాయ వృత్తుల పరిరక్షణ, కులగణనలో ఒకే సామాజిక వర్గంగా గుర్తింపు, విశ్వకర్మ కార్పొరేషన్ బలోపేతం, జనాభా ప్రాతిపదికన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

విశ్వకర్మల ఐక్యతే అభివృద్ధికి పునాది!
X

నేడు ఇంజనీర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్టులు, శిల్పులు, టెక్నీషియన్లు వేర్వేరు రంగాలుగా కనిపిస్తున్నా, శతాబ్దాల క్రితమే ఈ నైపుణ్యాలన్నింటినీ ఆచరణలో చూపించింది విశ్వకర్మ సమాజం. కొలతలు, నిర్మాణం, లోహ శాస్త్రం, చెక్క పనితనం, శిల్పకళ, ఆభరణాల తయారీ వంటి రంగాల్లో అపూర్వ ప్రతిభ కనబరిచిన వారే విశ్వకర్మలు. అందుకే వారిని ‘నాటి ఇంజనీర్లు’, ‘సమాజ సృష్టికర్తలు’ అని గౌరవంగా పేర్కొంటారు.

విశ్వకర్మలు కేవలం వృత్తిదారులు కాదు. వారు శ్రమకు ప్రతీకలు. సృష్టికి ప్రతిరూపాలు. నైపుణ్యానికి చిరునామాలు. సమాజ నిర్మాణానికి పునాదులు. వారి చేతులు పనిచేయకపోతే వ్యవసాయం ముందుకు సాగదు. వారి కళ లేకపోతే శిల్ప సంపద నిలవదు. వారి నైపుణ్యం లేకపోతే అనేక సంప్రదా‌యాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి.

ఇవి వృత్తులు మాత్రమే కాదు..

కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారుడు ఇవి కేవలం వృత్తుల పేర్లు మాత్రమే కాదు. భారతీయ నాగరికతకు, శిల్ప సంపదకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. శతాబ్దాలు గా తమ చేతి నైపుణ్యంతో సమాజాన్ని ముందుకు నడిపించిన వారసత్వ వృత్తులు. అయితే కాలగమనంలో పరిస్థితులు మారాయి. యాంత్రీకరణ పెరిగింది. భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. రెడీమేడ్ ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించాయి. ఒకప్పుడు చేతి వృత్తులపై ఆధారపడిన సమాజం క్రమంగా యంత్రాలపై ఆధారపడే స్థితికి చేరింది. ఫలితంగా సంప్రదాయ విశ్వకర్మ వృత్తులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తరతరాలుగా కొనసాగిన వృత్తులకు గిరాకీ తగ్గింది. సంప్రదాయ కళలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యువతలో వృత్తుల పట్ల ఆసక్తి తగ్గుతోంది. ఇది కేవలం ఒక వర్గం సమస్య కాదు‌, దే శీయ సంప్రదాయ నైపుణ్య సంపదకు ఎదురవుతున్న ముప్పు.

ఒకే సామాజిక వర్గంగా గుర్తించకపోతే..

ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణన నేపథ్యంలో విశ్వకర్మ సమాజానికి సంబంధించిన మరో కీలక అంశం చర్చనీయాంశమైంది. విశ్వబ్రాహ్మణ–విశ్వకర్మ సమాజాన్ని ఒకే సామాజిక వర్గంగా గుర్తించకుండా కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారులుగా విడివిడిగా నమోదు చేయడం వల్ల అసలు జనాభా గణాంకాలు స్పష్టంగా బయటపడలేదని విశ్వకర్మ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వృత్తులు వేరైనా మూలాలు ఒక్కటే. సంప్రదాయం ఒక్కటే. సామాజిక అస్తిత్వం ఒక్కటే. పంచదాయిలు ఐదు విశ్వకర్మ సమాజం ఒక్కటే. అందుకే భవిష్యత్తులో నిర్వహించే జనగణనలో పంచ వృత్తులను “విశ్వకర్మ” లేదా “విశ్వబ్రాహ్మణ” అనే ఒకే సామాజిక వర్గంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కుల ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే విధానం అమలు చేయాలి. ఇది కేవలం గుర్తింపు కోసం చేస్తున్న డిమాండ్ కాదు. నేడు జనాభా ఆధారంగానే సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ ప్రాతినిధ్యం నిర్ణయించబడుతున్నాయి. అసలు జనాభా నమోదు కాకపోతే ఆ వర్గానికి రావాల్సిన అవకాశాలు, ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల జనాభా ప్రాతిపదికన అభివృద్ధి అవకాశాలు, రాజకీయ వాటా, నామినేటెడ్ పదవులు, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

వృత్తుల పునరుజ్జీవం కోసం..

అలాగే రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.. తక్షణమే దానికి చైర్మన్‌ను, కమిటీని నియమించాలి. సంప్రదాయ వృత్తుల ఆధునికీకరణ, మార్కెటింగ్ సదుపాయాలు, యంత్ర పరిక‌రాల కొనుగోలు, తక్కువ వడ్డీ రుణాలు, శిక్షణా కేంద్రాలు, వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేసి అందులో విశ్వకర్మ నిపుణత కలిగిన అధ్యాపకులను నియమించాలి, యువతకు నైపుణ్యా భివృద్ధి కార్యక్రమాలు, ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం వంటి అంశాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ప్రత్యేక నిధులు కేటాయించి వృత్తుల పునరుజ్జీవనానికి కృషి చేయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనూ విశ్వకర్మల పాత్ర విశిష్టమైనది. తెలంగాణ సాధనలో విశ్వకర్మ సమాజానికి చెందిన అనేకమంది చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. త్యాగాల్లో ముందున్న వర్గం గుర్తింపులో వెనుక బడేయటం సమంజసం కాదు.

ఈ కళలను నిలబెట్టకుండా..

ప్రపంచం నేడు నైపుణ్యానికి విలువ ఇస్తోంది. సంప్రదాయ కళలను సంరక్షించడానికి దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నాయి. అలాంటి సమయంలో శతాబ్దాల చరిత్ర, అసాధారణ నైపుణ్యం, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర కలిగిన విశ్వకర్మల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టడం ప్రభుత్వాల బాధ్యత. చేతి వృత్తులను కాపాడకుండా ‘స్కిల్ ఇండియా’ గురించి మాట్లాడటం అసంపూర్ణం. సంప్రదాయ కళలను నిలబెట్టకుండా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ గురించి చెప్పడం అర్థరహితం. ప్రభుత్వం ఇకనైనా స్పందించి విశ్వకర్మ కార్పొరేషన్ పాలక మండలిని కొనసాగించాలి. జనగణనలో పంచదాయాలను ఒకే విశ్వకర్మ- విశ్వబ్రాహ్మణ వర్గంగా గుర్తించాలి. సంప్రదాయ వృత్తులను రక్షించాలి. జనాభా ప్రాతిపదికన నిధులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. ఎందుకంటే.. వృత్తులు వేరైనా.. మేమంతా దాయి ఒక్కటే విశ్వకర్మలం!

-గడగోజు రవీంద్రాచారి

98487 72232

Next Story