- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ములుగు మున్సిపాలిటీలో సిబ్బంది కొరత
నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో ఉద్యోగుల కొరత ఏర్పడింది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో ఉద్యోగుల కొరత ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును జీవింతరావుపల్లి, బండారుపల్లి గ్రామపంచాయతీతో కలిపి పాలకులు గత ఏడాది మే 29న ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన సమయంలో ప్రభుత్వం కమిషనర్, మేనేజర్, ఒక హెల్త్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ సంబంధించిన ఒక ఉద్యోగిని నియమించింది. అనంతరం కొద్ది రోజులకు డిప్యూటేషన్ పై కొన్ని శాఖల అధికారులకు బాధ్యత అప్పగించింది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన అనంతరం పాలకవర్గం ఏర్పాటు కోసం ఎన్నికలను సైతం నిర్వహించి కౌన్సిలర్లను ఎన్నుకున్నారు.
18 వేల జనాభా కలిగిన ఇక్కడి మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా, 20 మంది వార్డు ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. కానీ నేటి వరకు ఒక్క వార్డు ఆఫీసర్ ను నియమించలేదు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ అధికారులు, అకౌంటెంట్ అధికారి, ప్రజా ఆరోగ్య అధికారి, మెప్మా సంబంధించిన అధికారులు విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం నలుగురు అధికారులు మాత్రమే పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తుండగా మరికొందరు డిప్యూటేషన్ పై పని చేస్తున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ టీపీఓ, టీపీబీఓ, టీవీఎస్ అధికారులు ఉండాల్సి ఉండగా కేవలం టీపీబీవో అధికారి, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జేఏఓ, ఇంజనీరింగ్ శాఖ సంబంధించి ఏఈ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.
మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన 130 మంది శానిటేషన్ సిబ్బంది, తాత్కాలిక కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ములుగు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించగా రెండు రోజుల క్రితం రూ.50 లక్షలతో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మంత్రి సీతక్క చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. మంజూరైన నిధులు మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే పూర్తిస్థాయిలో ఉద్యోగులు ఉండాల్సి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అన్ని పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ నియామకం విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.






