గున్ముక్లగుట్టకు మైనింగ్ సెగ!

by Muthe.Rajitha |

ధన్వాడ మండలంలోని గున్ముక్ల గుట్టపై మైనింగ్ తవ్వకాల వ్యవహారం మళ్లీ సంచలనంగా మారింది.

గున్ముక్లగుట్టకు మైనింగ్ సెగ!
X

ధన్వాడ మండలంలోని గున్ముక్ల గుట్టపై మైనింగ్ తవ్వకాల వ్యవహారం మళ్లీ సంచలనంగా మారింది. మూడేళ్ల కింద ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తిరస్కరించిన ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం మైనింగ్‌కు అనుమతులు వచ్చాయన్న వార్తలతో మూడు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుట్టపై రూ.4కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కట్టడాలు మైనింగ్ వల్ల ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాక పర్యావరణం దెబ్బతిని, భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని స్థానికులు భయపడుతున్నారు. అయితే మైనింగ్ తవ్వకాలను అడ్డుకుంటామని, ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని అఖిలపక్ష నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

- దిశ, ధన్వాడ

దిశ, ధన్వాడ : ధన్వాడ మండలంలోని గున్ముక్ల గ్రామంలోని గుట్టపై మైనింగ్ తవ్వకాల సమస్య మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నాడు మైనింగ్ అనుమతులను అడ్డుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తామంటూ హెచ్చరించిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు.. నేడు అధికారంలో ఉన్న తరుణంలో మళ్లీ తవ్వకాలకు అనుమతులు రావడం కలకలం సృష్టిస్తోంది. సర్వే నంబర్ 144లోని దాదాపు 50ఎకరాలకు పైగా ఉన్న ఈ గుట్టపై మూడేళ్ల కింద మైనింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పోలీస్ బలగాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా, గున్ముక్ల, ఎం.నొంపల్లి, మంత్రంపల్లి గ్రామాల ప్రజలతోపాటు అఖిలపక్ష నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి అనుమతులు నిలిపేశారు. అయితే, మూడేళ్ల కింద ముగిసిపోయింది అనుకున్న ఈ సమస్య ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో మూడు గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి.

బూడిదలో పోసిన పన్నీరేనా?

ప్రస్తుతం మైనింగ్ చేపట్టాలని చూస్తున్న గుట్టపై ప్రభుత్వం గతంలో రూ.4కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇక్కడ వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశారు. ఒకవేళ ఇప్పుడు మైనింగ్ ప్రారంభిస్తే ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరు కావడంతోపాటు, చుట్టుపక్కల పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక్కడి చెరువు, వన్యప్రాణుల జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, పంట పొలాలు బీడుగా మారి ప్రజలు వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల కింద పోలీస్ శాఖ వారు పలువురు స్థానిక నాయకులను పిలిపించి, మైనింగ్‌ను అడ్డుకోవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం రావడంతో గ్రామాల్లో ఆందోళన మరింత పెరిగింది. దీనిపై ఇటీవల బీఆర్ఎస్ నాయకులు సుధీర్ కుమార్, శివారెడ్డి, మల్లేష్, సచిన్, శాంతికుమార్, నరసింహారెడ్డి, నరసింహులు విలేకరుల సమావేశం నిర్వహించి, మైనింగ్ కొనసాగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

మైనింగ్‌కు అనుమతులు ఇవ్వద్దంటూ తీర్మానం చేశాం!

గున్ముక్ల గుట్టపై మైనింగ్ అనుమతుల వివరాలు తెలుసుకుని, మా గ్రామంతోపాటు మంత్రంపల్లి, గున్ముక్ల గ్రామ పంచాయతీల్లో గతంలోనే వ్యతిరేకంగా తీర్మానాలు చేశాం. మూడు గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మళ్లీ అనుమతులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగానే తవ్వకాలు జరిపితే అడ్డుకోవడం ఖాయం.

- భారతి, మాజీ సర్పంచ్, ఎం.నొంపల్లి.

అనుమతులు ఇస్తే ఊరుకునేది లేదు!

గున్ముక్ల గుట్టపై మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నాడు జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. మళ్లీ ఈ సమస్యను తెరపైకి తెచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోం.

- ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ధన్వాడ.

Next Story