కంకర వేశారు.. రోడ్డు మరిచారు

by Muthe.Rajitha |   (  Updated:2026-06-09 02:54:24  IST  )

బల్మూరు మండలంలోని తోడేళ్ల గడ్డ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నరకం చూస్తున్నారు.

కంకర వేశారు.. రోడ్డు మరిచారు
X

బల్మూరు మండలంలోని తోడేళ్ల గడ్డ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నరకం చూస్తున్నారు. గతంలో ఉన్న మట్టి రోడ్డుపై కేవలం కంకర పరిచి అధికారులు చేతులు దులుపుకున్నారు. నాణ్యత లేని పనుల వల్ల వాహనాల తాకిడికి కంకర అంతా చెల్లాచెదురైపోయింది. వర్షాలు పడితే చాలు ఈ రహదారి పూర్తిగా బురద, గుంతలమయంగా మారుతోంది. దారి అధ్వాన్నంగా మారడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా రావడం లేదు. నియోజకవర్గంలో రాజకీయ కారణాల వల్లే తమ గ్రామంపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తోడేళ్ల గడ్డకు శాశ్వత బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- దిశ, బల్మూర్

దిశ, బల్మూర్ : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని తోడేళ్ల గడ్డ గ్రామంలో కంకర వేశారు కానీ రోడ్డు వేయడం మరిచారు అంటూ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న మట్టి రోడ్డుపైనే కేవలం కంకర పరిచి అధికారులు చేతులు దులుపుకోవడంతో, నాణ్యత లేని ఆ పనులు కాస్తా వాహనాల రాకపోకల తాకిడికి చెల్లాచెదురైపోయాయి. పూర్తి స్థాయి బీటీ రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో చిన్నపాటి వర్షానికే కంకర కొట్టుకుపోయి దారంతా గుంతలు, బురదమయంగా మారుతోంది. ఈ అధ్వాన్నపు రోడ్డు కారణంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామంలోకి రాలేని దుస్థితి ఏర్పడిందని, నడవడానికి పిల్లలు, వృద్ధులు నిత్యం భయపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ వివక్షపై ప్రజా నిరసన..

ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు మారుతున్నా తమ ఊరి రాత మాత్రం మారడం లేదని తోడేళ్ల గడ్డ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గెలిచేది ఒకరు, తమ ఊరిలో గెలిచేది ఇంకొకరు కావడంతోనే రాజకీయ పంతాల వల్ల తమ గ్రామంపై తీవ్ర వివక్ష చూపుతున్నారనే భావన స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతోంది. తమకు కావాల్సిన కనీస సౌకర్యాలను తీర్చే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, తాత్కాలిక మరమ్మతులు కాకుండా తోడేళ్ల గడ్డ గ్రామానికి శాశ్వత బీటీ రోడ్డు నిర్మించి తమ ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Next Story