ప్రజావాణిలో అధికారులేరి..?

by Jakkula.Mamatha |

ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది.

ప్రజావాణిలో అధికారులేరి..?
X

ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లతో పాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రజావాణి' కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం, మరికొందరు సమయపాలన పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.50కి పైా శాఖలుంటే.. 15 మందికి మించి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావడం లేదు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రజావాణి' కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం, మరికొందరు సమయపాలన పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

50 శాఖల అధికారుల్లో వచ్చేది 15 లోపే..

జిల్లాలో సుమారు 50 శాఖలకు పైగా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అయితే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 15 మందికి మించి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావడం లేదు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి రవాణా శాఖ, అగ్రికల్చర్, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ అధికారి,ఆర్ అండ్ బి ఈఈ వంటి శాఖల అధికారులు మాత్రమే హాజరు అయ్యారు. మిగతా అన్ని శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపించారు.

ప్రజావాణి కంటే ముఖ్యమైన పనులేమున్నాయ్?

జిల్లా నలుమూలల నుంచి ఎంతో ఆశతో, తమ సమస్యలు పరిష్కారమవుతాయని వందలాది మంది ప్రజలు కలెక్టరేట్‌కు వస్తుంటారు. అయితే, అధికారులు సమయానికి అందుబాటులో ఉండకపోవడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు రావాల్సిన చోట, కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. "ప్రజల కష్టాలు వినే ప్రజావాణి కంటే ముఖ్యమైన పనులు అధికారులకు ఏముంటాయి? కావాలనే రావడం లేదా?" అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అడిషనల్ కలెక్టర్ ​సీరియస్..

ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైర్హాజరు పై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణిని ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించినప్పటికీ, అధికారుల తీరులో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు.

అసలు ఆఫీసర్లకు బాధ్యత ఎక్కడిది?

ప్రజావాణి రోజున జిల్లా అధికారులంతా అందుబాటులో ఉండాలన్నది నిబంధన ఉంది. కానీ, ఏ జిల్లా స్థాయి అధికారి కూడా ఈ కార్యక్రమాన్ని లెక్కచేయడం లేదు. ఉన్నతాధికారులు సదరు కార్యక్రమానికి ముఖం చాటేస్తుండగా, క్షేత్రస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరుగుతున్న ప్రజల ఆవేదన వర్ణనాతీతం. "ప్రజావాణి కంటే అంత ముఖ్యమైన పనులు ఏమున్నాయి? లేక ప్రజల కష్టాలు వినడం తమకు తక్కువతనమా?" అని ప్రజలు మండిపడుతున్నారు.

ఉద్దేశపూర్వక గైర్హాజరా?

అధికారుల ఈ వైఖరి చూస్తుంటే, ప్రజల సమస్యల పట్ల వారికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. పదేపదే హెచ్చరిస్తున్నా, మెమోలు జారీ చేస్తున్నా అధికారుల తీరులో అణువంత మార్పు రావడం లేదు. ఇది అధికారుల అసమర్థతా? లేక ఉద్దేశ్యపూర్వకమైన నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలెక్టరేట్ వేదికగా జరుగుతున్న ఈ అవమానాన్ని పై స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అధికారుల ఈ ఉదాసీనత వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రజావాణికి రాని అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేక ఈ నిర్లక్ష్య పర్వం ఇలాగే కొనసాగుతుందా? వేచి చూడాల్సిందే.

Next Story