- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటకరంగానికీ సినిమాకూ ఒక సృజనాత్మక వంతెన విజయా మెహతా
భారతీయ నాటకరంగానికి ఆధునిక దిశను చూపిన ప్రముఖ దర్శకురాలు విజయా మెహతా జీవితం, మరాఠీ రంగస్థల పునరుజ్జీవనంలో ఆమె పాత్ర, రంగాయణ్ ఉద్యమం, సమాంతర సినిమాలకు చేసిన విశిష్ట కృషి..

భారతీయ నాటకరంగ చరిత్రను తిరగేస్తే కొంతమంది సృజనాత్మక దర్శకులు కేవలం కళాకారులు మాత్రమే కాదు ఒక దృక్పథానికి, ఒక సాంస్కృతిక ఉద్యమానికి, ఒక కళాత్మక పునరుజ్జీవనానికి ప్రతీకలు.అలాంటి అరుదైన వ్యక్తిత్వాలలో విజయా మెహతా ఒకరు. ఇటీవల ఆమె మరణం ఒక వ్యక్తి మరణం కాదు. అది భారతీయ రంగస్థలంపై వెలిగిన ఒక సృజన దీపం ఆరిపోవడం. కానీ ప్రకాశవం తంగా ఆమె వెలిగించిన వెలుగు మాత్రం ఇంకా ఎందరో కళాకారుల సృజనలో, నాటక పాఠశాలల్లో, రిహార్సల్ గదుల్లో, సినిమాల ఫ్రేముల మధ్య సజీవంగానే ఉంది..
ఇరవయ్యవ శతాబ్దం మధ్య కాలంలో మరాఠీ నాటకరంగం ప్రధానంగా సంగీత నృత్య నాటకాల ప్రభావంలో కొనసాగింది. పౌరాణిక కథలు, చారిత్రక పాత్రలు, అనేక హంగులు రంగురంగుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ, సమకాలీన మానవ జీవితంలోని సంక్లిష్టతలకు అప్పుడు ఆ రంగస్థలంపై పెద్దగా చోటు దక్కలేదు. అలాంటి సమయంలో విజయా మెహతా రంగప్రవేశం చేశారు. ఆమె నాటకాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా ఆలోచనకు, సామాజిక ప్రశ్నలకు, మానవ మనస్తత్వ అన్వేషణకు వేదికగా మార్చారు. ఆమె స్థాపించిన ‘రంగాయణ్’ నాటక సమూహం మరాఠీ నాటకరంగంలో ఒక సాంస్కృతిక విప్లవానికి నాంది పలికిందనే చెప్పాలి. రంగాయణ్ కేవలం నాటకాలను ప్రదర్శించలేదు. మరాఠీ ప్రేక్షకుల అభిరుచిని మార్చింది. నాటక రచయితల ఆలోచనల్ని కొత్త విషయాలవైపు మళ్లిం చింది. నటనను ఒక కళాత్మక క్రమశిక్షణగా మలిచింది.
పాశ్చాత్య, భారతీయ అనుభవాల కూర్పు..
విజయా మెహతా ప్రత్యేకత ఏమిటంటే ఆమె పాశ్చాత్య నాటక సంప్రదాయాలను గుడ్డిగా అనుకరించలేదు. వాటిని భారతీయ దృక్పధంతో అనుభవాలతో కలగలిపారు. జర్మన్ నాటకకర్త బెర్టోల్ట్ బ్రెష్ట్ సిద్ధాంతాలు ఆమెపై బలంగా ప్రభావం చూపించాయి. ప్రేక్షకుడు పాత్రతో పూర్తిగా లీనమైపోకుండా విమర్శనాత్మక దృష్టితో ఆలోచించాలని బ్రెహ్ట్ భావించాడు. ఆ ఆలోచనలను భారతీయ రంగస్థలానికి పరిచయం చేయడంలో విజయా మెహతా కీలక పాత్ర పోషించారు. అలాగే అంటన్ చెకోవ్, యూజీన్ అయోనెస్కో వంటి రచయితల రచనలను మరాఠీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రపంచ నాటకరంగాన్ని మరాఠీ భాషలోకి తీసుకురావడమే కాకుండా, మరాఠీ జీవితాల అనుభవాల్ని ప్రపంచస్థాయి చర్చల్లో భాగం చేశారు.
పాత్ర అంతరంగంలోకి చేసే ప్రయాణం నటన..
విజయా మెహతా దర్శకత్వంలో నటన ఒట్టి బాహ్య ప్రదర్శన కాదు. అది ఆ పాత్ర అంతరంగంలోకి చేసే ప్రయాణం. ఆమె నాటకాల్లో నటుడు డైలాగులు చెప్పే యంత్రం కాదు. ఒక సజీవమయిన రూపం. పాత్రకు సంబంధించిన సామాజిక నేపథ్యం, భాష, మానసిక స్థితి, ఆంగికం ఇలా ప్రతి అంశంపైనా ఆమె అపార శ్రద్ధ చూపేవారు. మరాఠీ పాత్రలు హిందీ యాసలో మాట్లాడటం ఆమెకు నచ్చేది కాదు. ప్రతి పాత్ర తన సాంస్కృతిక మూలాలతో జీవించాలనేది ఆమె నమ్మకం. ఈ దృక్పథమే తరువాత భారతీయ సమాంతర నాటకరంగానికి, సహజ నటనకు పునాది వేసింది. విజయ్ తెండూల్కర్, మహేష్ ఎల్కుంచ్వార్, సి.టి. ఖానోల్కర్ వంటి రచయితల రచనలకు రంగస్థలానికి రూపాంతరం చేయడంలో విజయా మెహతా పాత్ర అసాధారణమయింది. నాటకరంగంలో ఆమె చేసిన గొప్ప కృషి ఏమిటంటే సాహిత్యాన్ని ప్రదర్శన కళతో సమన్వయం చేయడం. రంగస్థలంపై అపార ఖ్యాతి సంపాదించినప్పటికీ ఆమె సినిమా ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేదు. కానీ వాణిజ్య సినిమాల మార్గాన్ని ఎంచుకోలేదు.
సినిమా చరిత్రలో విలువైన సినిమాలు..
ఆమె రూపొందించిన “రావ్ సాహెబ్” (1985), “పెస్టోంజీ” (1988) చిత్రాలు భారతీయ సమాంతర సినిమా చరిత్రలో విలువైన సినిమాలు.. రంగస్థల నేపథ్యం కారణంగా ఆమె నటుల్లో సహజత్వాన్ని, అంతర్ముఖ వ్యక్తీకరణను ప్రోత్సహించారు. అతిశయోక్తి, మెలోడ్రామా, స్టార్ ఇమేజ్‌లకు దూరంగా, పాత్రల అంతర్గత సంఘర్షణలను వ్యక్తపరచగల నటులను ఎంపిక చేసారు. ఓంపురి, నసీరుద్దీన్ షా, శ్రీరాం లాగూ, మోహన్ అగస్సే వంటి రంగస్థల అనుభవం కలిగిన కళాకారులు ఆమె సృజనాత్మక దృక్పథానికి అనుకూలంగా నిలిచారు. వారి నటన ద్వారా పాత్రల మానసిక లోతులు, సామాజిక సందర్భాలు మరింత ప్రభావవంతంగా వ్యక్త మయ్యాయి. విజయా మెహతా చిత్రాల్లో నటీనటులు కథను చూపరు కథగానే మారిపోతారు. అందుకే ఆమె సినిమాలను గుర్తుచేసుకున్నప్పుడు కథలతో పాటు ఆ పాత్రలను జీవించిన నటీనటుల ముఖాలు, వారి నిశ్శబ్దాలు, వారి చూపులు కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
మార్పు కోసం పోరాడే వ్యక్తి అంతర్మథనం
‘రావ్ సాహెబ్’ సినిమాలో పందొమ్మిదవ శతాబ్దపు మహారాష్ట్ర సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబించింది. ఈ సినిమా సంస్కరణోద్యమ ఆలోచనలను పరిశీలిస్తుంది, చర్చిస్తుంది. ఈ చిత్రంలో విజయా మెహతా చరిత్రను కేవలం పునర్నిర్మించలేదు. సమాజంలో మార్పు కోసం పోరాడే వ్యక్తి అంతర్మథనాన్ని కూడా చూపించారు. ఇది రాజకీయ ప్రకటన కంటే మానవతా అన్వేషణ. విజయా మేహేతా తీసిన ‘పెస్టోంజీ’ విలక్షణ మయింది. భారతీయ సినిమాల్లో పార్సీ సమాజ జీవితాన్ని ఇంత సున్నితంగా ఆవిష్కరించిన చిత్రాలు చాలా అరుదు. స్నేహం, ప్రేమ, వివాహం, ఒంటరితనం, కాలప్రవాహం ఈ అంశాలను విజయా మెహతా అసాధారణమైన సున్నితత్వంతో చిత్రించారు. ఈ చిత్రంలో పెద్ద సంఘటనలు లేవు. కానీ జీవితం మొత్తం ఉంది. అదే విజయా మెహతా ప్రత్యేకత.
మరాఠీ మూలాలను విడిచిపెట్టలేదు..
విజయా మెహతా సినిమాలు చూస్తే అవి నాటకాల్ని రూపాంతరీకరించిన చిత్రీకరణలుగా కనిపించవు. అదే సమయంలో పూర్తిగా సినీ వ్యాకరణానికే పరిమితమైపోవు. రంగస్థలంలోని మానవ సంబంధాల లోతును, సినిమాకు మాత్రమే సాధ్యమైన దృశ్యభాషను ఆమె సమన్వయం చేశారు.. జెర్జీ గ్రోటోవ్‌స్కీ, పీటర్ బ్రూక్, యూజీనియో బార్బా వంటి ప్రపంచ రంగస్థల దిగ్గజాలతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం భారతీయ నాటకరంగాన్ని అంతర్జాతీయ చర్చల్లో భాగం చేసింది. అయితే ఆమె ఎప్పుడూ తన మరాఠీ మూలాలను విడిచిపెట్టలేదు. ఆమె ప్రపంచాన్ని తన సృజనలోకి ఆహ్వానించింది. కానీ తన నేల వాసనను కోల్పోలేదు. విజయా మెహతా భారతీయ నాటకరంగ చరిత్రలో ఒక అధ్యాయం కాదు. మరాఠీ నాటకరంగాన్ని ఆధునిక ప్రపంచంతో కలిపిన వంతెన. భారతీయ సినిమాకు మానవీయతను, సున్నితత్వాన్ని అందించిన దర్శకురాలు.
-వారాల ఆనంద్
94405 01281






