రైతుల భూ సమస్యలపై.. మా సేవలు వినియోగించుకోండి!

by Ravi |   (  Updated:2025-09-06 01:00:49  IST  )

నేడు భూమి అంటేనే ఒక సమస్య. ఆ భూమి నుండి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అది పరిష్కరించుకోవాలంటే ఏ అధికారి దగ్గరికి వెళ్లాలి?

రైతుల భూ సమస్యలపై.. మా సేవలు వినియోగించుకోండి!
X

నేడు భూమి అంటేనే ఒక సమస్య. ఆ భూమి నుండి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అది పరిష్కరించుకోవాలంటే ఏ అధికారి దగ్గరికి వెళ్లాలి? ఎలా పరిష్కరించుకోవాలి, తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అలాంటి పేద ప్రజల సమస్యలను తీర్చడానికి పాశ్చాత్య దేశాలలో పారా లీగల్ అనే వ్యవస్థ అందుబాటులో ఉన్నది. ఈ వ్యవస్థ ఉద్దేశం భూమి సమస్యలతో సతమతమవుతున్న పేద ప్రజలకు సహాయ, సహకారాలు అందించడం.

నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో భూమి ప్రధాన జీవనాధారం. ఒక ఆదాయ వనరు. ఒక భద్రత, ఒక సామాజిక హోదా. మన దేశంలోని గ్రామీణ ప్రజానీకంలో దాదాపు 70 శాతం మంది ప్రత్యక్షంగాను, పరోక్షంగాను భూమినే జీవనాధారంగా భావిస్తున్నారు. ఇంత ముఖ్యమైన భూమి ప్రస్తుతం ఎన్నో సమస్యలు, వివాదాల్లో ఉంది. స్వాధీనంలో భూమి, రికార్డులలో పేరు, చేతిలో పట్టా ఉంటేనే భూమిపై హక్కులకు చట్టబద్ధత, భద్రత కూడా ఉంటుంది. భూమి ఉంది కానీ పట్టాలేదని, పట్టా వుంది కానీ రికార్డులలో వివరాలు సరిగా లేవని, వివిధ భూమి సమస్యలతో బాధపడుతున్న భూ యజమానులు ఎందరో? ఒక అంచనా ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో సుమారు 200 నుండి 300 వరకు భూసమస్యలు ఉంటాయి. సివిల్ కోర్టులలో 60% కేసులు భూములకు సంబంధించినవే.

ఎంతో అనుభవం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006వ సంవత్సరంలో ఇటువంటి భూమి సమస్యలు తీర్చడానికి ఇందిరా క్రాంతి పథకం కింద భూమి సెల్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది లక్షలకు పైగా భూ సమస్యలున్న రైతులకు సహాయ సహకారాలు అందించి, వారి సమస్యలను పరిష్కరించారు. ఈ వ్యవస్థ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి వెన్నెముకలాగా ఉండేది. ఈ వ్యవస్థ సభ్యులు ప్రజలకు రెవెన్యూ వ్యవస్థకు మధ్య వారధిగా ఉండేవారు. పేద ప్రజలకు ఉన్న భూమి సమస్యలు గుర్తించి రెవెన్యూ శాఖ ద్వారా భూమి సమస్యలు పరిష్కరించడం వీరి విధి. ఈ వ్యవస్థలో మండలానికి ఒక పారా లీగల్, ఒక కమ్యూనిటీ సర్వేయర్, జిల్లాకి ఒక లీగల్ కో ఆర్డినేటర్ ఉండేవారు. వీరు రైతు సమస్యలను రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పేద వారి తరుపున సివిల్ కోర్టులలో కూడా సహాయం చేసేవారు. అలాగే కింది స్థాయి రెవెన్యూ సిబ్బందికి భూమి రికార్డులు చట్టాలపై అవగాహన తరగతులు నిర్వహించేవారు. ప్రతి గ్రామంలో భూమికి సంబంధించిన అవగాహన తరగతులు ఏర్పాటు చేసేవారు. భూ సమస్యలపై ఇంతటి అవగాహన ఉన్న పారా లీగల్ సభ్యులకు భూమి పనులు కాకుండా వేరే పనులు అప్పగించింది ప్రభుత్వం.

ప్రజలకు, రెవెన్యూ శాఖకు వారధిగా..

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే భూ సమస్యలు ఎక్కువే. ఇక గత ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన వల్ల కొన్ని లక్షల మంది రైతుల భూమి సమస్యల్లో పడింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భూ సంస్కరణలు చేయాలనుకుంటోంది. పైగా భూ భారతి చట్టం- 2024 రూపొందించేందుకు, ఏర్పడిన ధరణి కమిటీ కూడా పేద రైతులకు, న్యాయం అందించేందుకు అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. పేదలకు, రెవెన్యూ వ్యవస్థకు ఒక వారధిలా ఉండడానికి ఆప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఇటువంటి సందర్భంలో, భూ సమస్యల పరిష్కారంలో ఎన్నో శిక్షణలు పొంది, ఎంతో అపార అనుభవం కలిగి, NALSAR న్యాయ విశ్వవిద్యాలయంలో భూమి-సమస్యలు, పరిష్కార మార్గాలపై, న్యాయ సంబంధ విషయాలు, కోర్టు కేసులు, వాటి పరిష్కారాలు, వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ పొంది, ప్రస్తుతం సెర్ప్‌లో పనిచేస్తున్న పారా లీగల్స్ సేవలను వినియోగించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మా ద్వారా భూసమస్యల పరిష్కారంలో ఎంతో మేలు చేసే భాగ్యం కలుగుతుందని భావిస్తున్నాం. కావున భూ భారతి చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పారా లీగల్ వ్యవస్థను పునరుద్ధరించి, మా సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం.

- శంకరయ్య కొయ్యాడ

అధ్యక్షుడు, పారా లీగల్స్ అసోసియేషన్

80082 01146

Next Story