తిరుగులేని ట్రబుల్ షూటర్

by Disha edit |
తిరుగులేని ట్రబుల్ షూటర్
X

భివృద్ధిలో అలుపెరుగని బాటసారి. అహర్నిశలు కష్టించే శ్రమజీవి. ఆత్మీయతకు, అభిమానానికి, ఆదరణకు నిదర్శనం హరీశ్‌రావు. ఉద్యమ తోవ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వరకు కేసీఆర్ సంకల్ప సిద్ధిని శిరసావహించి కార్యరూపంలో పెట్టిన నేత. సిద్దిపేట అభివృద్ధి, సంక్షేమానికి సద్దిమూట. తెలంగాణ జన జీవనంలో మమేకమై బతుకు భరోసా కల్పించిన నేత. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా వారిని ఓదార్చి ధైర్యం నింపుతారు.

సిద్దిపేట ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, మంత్రిగా, పార్టీ నేతగా తెలంగాణ నలుమూలలా బుల్లెట్ వేగంతో చుట్టేస్తూ ప్రజల పక్షాన నిలబడే నిబద్ధత కలిగిన నాయకుడు. చిన్న మెసేజ్ పెట్టినా చాలు, తాను స్వయంగా పరిశీలించి ఆ సమస్యకు పరిష్కారం చూపుతారు. అధికారులను, పార్టీ నాయకులను పంపి సమస్య లేకుండా చూస్తారు. హరీశ్‌రావు ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే అక్కడ పార్టీ విజయం సాధిస్తుందని బలమైన నమ్మకం పార్టీలో ఉంది. అందుకే, ఆయన ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీరిక లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా 'కాళేశ్వరం' ప్రాజెక్టు నిర్మాణంలో కార్మికుడిలా చెమటోడ్చి పని చేశారు. ఆర్థిక మంత్రిగా ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు.

సిద్దిగాంచిన సిద్దిపేట

చరిత్ర పుస్తకంలో చెరగని సంతకం సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురిటి గడ్డ. రాష్ట్రానికి, దేశానికి రోల్ మోడల్. అభివృద్ధికి ఇది చిరునామా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకానికి అదో రీసెర్చ్ సెంటర్. సిద్దిపేట పచ్చతోరణంలా స్వాగతం ఇస్తుంది. కళకళలాడే రంగనాయక‌సాగర్ జలాశయాలు, ఆక్సిజన్ అందించే పార్కులు, జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, నూతన కలెక్టరేట్ భవనం, పోలీస్ కమిషనరేట్, గోల్కొండ షోరూం వంటి ఎన్నెన్నో అభివృద్ధి నమూనాలు, ఎన్నో అద్భుత అభివృద్ధి కళాఖండాలు సిద్దిపేట ఒడిలో ఇమిడి ఉన్నాయి. స్వచ్ఛ భారత్‌లో సిద్దిపేట అనేక అవార్డులను గెలుచుకుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సిద్దిపేట గురించి ప్రశ్నలు రావడం విశేషం. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి జరిగిన అభివృద్ధి చూసి పోతారు. సిద్దిపేట ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తికి మించింది మరొకటి లేదంటారు హరీశ్‌రావు. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.

చిటుకుల మైసారెడ్డి,

జర్నలిస్ట్, కాలమిస్ట్

94905 24724


Next Story

Most Viewed