ఉన్నది ఉన్నట్టు: తెలంగాణ.. పొలిటికల్ లేబొరేటరీ

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: తెలంగాణ.. పొలిటికల్ లేబొరేటరీ
X

తెలంగాణ ఇప్పుడు పొలిటికల్ లేబొరేటరీగా మారింది. తొలి నుంచి రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్), కాంగ్రెస్, మధ్యలో వచ్చి బాగా బలం పుంజుకున్న బీజేపీలతో పాటు తెలుగుదేశం, వైఎస్సార్టీపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జనసేన, కేఏ పాల్ నేతృత్వంలోని చిన్నా చితకా పార్టీలు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రధాన పార్టీలతోపాటు వామపక్షాలతో సహా ఇతర అప్రాధాన్య పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా లేక పొత్తులు పెట్టుకుంటాయా అనేది భవిష్యత్తులో తేలనుంది. పవర్ కోసమే పార్టీలు పాకులాడుతున్నాయి.

ఓట్లు, సీట్లే వాటి పరమావధి. వాటి అంతిమ లక్ష్యమూ అదే. అన్ని పార్టీలకూ తెలంగాణ ఈసారి పొలిటికల్ లాబ్‌గా తయారైంది. కొత్త పార్టీలకు ఒక లాంచ్ పాడ్‌లా మారింది. భవిష్యత్తును పరీక్షించుకోడానికి తెలంగాణను వేదికగా చేసుకుంటున్నాయి. ఏ మేరకు ఓట్లు చీలుస్తాయనే సంగతి ఎలా ఉన్నా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నాయి. వివేకం, చైతన్యం కలిగిన ప్రజలు ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉన్నదో ఎన్నికల్లో ఓటు ద్వారా తేల్చనున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీల బలానికి అంతిమంగా ఓట్ల శాతం, సీట్ల సంఖ్యే కొలమానం.

బెల్లం ఉన్న చోటికే చీమలు వస్తాయనేది ఒక నానుడి. ఎన్నికలు ఉన్నప్పుడే కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. కనుమరుగైపోయిన రాజకీయ నాయకులూ కనిపిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతున్నది. ఈ ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఇంతకాలం కనిపించని పార్టీలు ఎంటర్ అయ్యాయి. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడినవారు సైతం గ్రౌండ్ కోసం పాకులాడుతున్నారు. వీరంతా తెలంగాణను పొలిటికల్ లేబొరేటరీగా మార్చుకున్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు, పోటాపోటీ బహిరంగసభలు, బలప్రదర్శనలు లాంటివాటితో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఎన్నికల్లో తేలనున్నది.

అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌తో పాటు పవర్‌లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే క్రియాశీలకంగా ఉన్న తెలుగుదేశం సైతం ఈసారి కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇక కొత్తగా ఉనికిలోకి వచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ, రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన జనసేన కూడా తెలంగాణలో బరిలోకి దిగుతున్నాయి. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీచేసిన కేఏ పాల్ సైతం తెలంగాణపై దృష్టి పెట్టారు. ఇక వామపక్షాల సంగతి సరేసరి. స్వంత ఆస్థిత్వాన్ని కోల్పోయి అధికార పార్టీతో అంటకాగుతున్నాయి.

అన్ని పార్టీలకు అదే ధ్యాస

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు.. బతికి బట్టకడుతుందా లేదా అనేది తర్వాతి సంగతి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు మాత్రమే బలమైనవిగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే 2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ సైతం బలమైన విపక్ష పార్టీగా తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో మూడు సీట్లు, ఆరు ఓట్లు పొందాలనే ధ్యాసే తప్ప ప్రజలు, వారి సమస్యల పరిష్కారంపై వీటికి చిత్తశుద్ధి లేదనేది నిర్వివాదాంశం.

గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోటీ ఈసారి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరుగా మారుతున్నది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో ముక్కోణపు పోటీ ప్రభావం ఏంటో తెలిసొచ్చింది. ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తాయా లేక పొత్తులు పెట్టుకుంటాయా అనేది రానున్న కాలంలో తేలనున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో పోటీచేసిన ప్రస్తుత బీఆర్ఎస్ అనూహ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందా లేక మార్పులుంటాయా అన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి.

పార్టీల ప్రచారాస్త్రాలు ఇలా

తెలంగాణ రాష్ట్ర సమితిగా ఇంతకాలం కొనసాగి ఇప్పుడు తెలంగాణ పదాన్ని తీసేసి భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత తొలి ఎన్నికలను ఎదుర్కోనున్నది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా వాడుకున్నది. 2018 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబును బూచిగా వాడుకున్నది. ఇప్పుడు తెలంగాణ అనే పదాన్ని వదులుకున్నందున ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్తుందన్నది కీలకంగా మారింది. రైతు సంక్షేమం, తెలంగాణ మోడల్ పేరుతో 'అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్' అనే స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది. పంజాబ్ రైతులకు చెక్కుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత రాష్ట్రంలోని రైతుల్ని విస్మరిస్తున్నారన్న విమర్శ ఉండనే ఉన్నది.

రుణమాఫీ చేయలేదనే అపవాదు, ధరణి పోర్టల్‌తో రైతుల్లో వ్యతిరేకత, పోడు భూముల విషయంలో సర్కారుపై ఆగ్రహం, సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకే దక్కుతున్నాయనే అసంతృప్తి.. ఇలాంటివన్నీ బీఆర్ఎస్‌కు ఈసారి సవాళ్ళుగా పరిణమించాయి. మరోవైపు ఈ అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు హామీలను గుప్పించడం మొదలుపెట్టారు. ధరణిని రద్దు చేస్తాం, మూడు లక్షల రుణమాఫీ ఇస్తాం, బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తాం, సర్కారు కొలువుల్ని భర్తీ చేస్తాం, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం లాంటి వాగ్ధానాలు ప్రకటించారు. అధికారంలోకి రావడానికి ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి.

యాక్టివిటీ లేకపోయినా పోటీ..

పవర్ కోసమే పార్టీలు పాకులాడుతున్నాయి. ఓట్లు, సీట్లే వాటి పరమావధి. వాటి అంతిమ లక్ష్యమూ అదే. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించింది లేదు. ఆ కుటుంబాలను ఆదుకున్నదీ లేదు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ షర్మిల రికార్డు స్థాయిలో పాదయాత్ర ముగించారు. తెలంగాణ కోడలు అంటూ సర్దిచెప్పుకుంటున్నారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి చెందిన కేఏ పాల్‌ను ప్రజలు ఓపెన్‌గానే ఒక జోకర్ తరహాలో చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్ళు కావస్తున్నా ఇప్పటివరకూ తెలంగాణలో జనసేన యాక్టివిటీ లేదు. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళిందీ లేదు. వారి సమస్యలు, బాధలను పట్టించుకున్నదీ లేదు. కానీ ఈసారి 18 చోట్ల పోటీచేస్తామంటూ ప్రకటించుకున్నారు.

తొమ్మిదేళ్ల పాటు సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ఫోకస్‌ను ఏపీ వైపు షిప్ట్ చేసింది. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుని తెలంగాణను లైట్‌గా తీసుకున్నది. 2018 ఎన్నికల్లో మాత్రమే నాలుగు సీట్ల కోసం బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో జతకట్టింది. కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. చివరికి ఆ రెండూ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. తెలంగాణ ప్రజల తరఫున ఒక్క సమస్యనూ పట్టించుకోలేదు.. ప్రజలను కలవలేదు.. వారి బాధలను తెలుసుకోలేదు.. సర్కారుపై ఒత్తిడి పెంచలేదు.. కానీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఖమ్మంలో బహిరంగ సభ ద్వారా మరోసారి తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్నది.

ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ

తెలంగాణ ఇచ్చిన పార్టీగా గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దుకోడానికే సతమతమవుతున్నది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్నది. సిట్టింగ్ అభ్యర్థులను సైతం నిలబెట్టుకోలేని నిస్సహాయతతో కొట్టుమిట్టాడుతున్నది. మునుగోడు స్థానాన్ని సైతం చేజార్చుకున్నది. బీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి వ్యూహాలు ఎలా ఉన్నా కార్యాచరణ మాత్రం శూన్యం. అధికార పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలే ఒకరిపై మరొకరు అభాండాలు వేసుకుంటున్నారు. సంస్థాగతంగా నాయకుల మధ్య సయోధ్య లేని గ్రూపుల తగాదాలను చక్కదిద్దుకోడానికే వారికి సమయం సరిపోవడంలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇప్పుడు అధికార పార్టీని ఢీకొట్టే స్థాయిలో బలపడుతున్నది. ఆ పార్టీ జాతీయ నేతలు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రులు తరచూ విజిట్ చేస్తున్నారు. పాదయాత్రలు, బహిరంగసభలతో బలప్రదర్శనకు పూనుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆల్టర్నేట్ అని ప్రూవ్ చేసుకున్నది. ఎదుర్కోకుంటే కష్టమేననే భావించిన బీఆర్ఎస్ ఇక ప్రధాన టార్గెట్ బీజేపీయే అనే భావనకు వచ్చింది. ఈ రెండు పార్టీల ఏడేండ్ల ఫ్రెండ్‌షిప్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత రివర్స్ అయింది. తూర్పు-పడమర తరహాలో వ్యవహరిస్తున్నాయి.

కొసమెరుపు

అన్ని పార్టీలకూ తెలంగాణ ఈసారి పొలిటికల్ లాబ్‌గా తయారైంది. కొత్త పార్టీలకు ఒక లాంచ్ పాడ్‌లా మారింది. భవిష్యత్తును పరీక్షించుకోడానికి తెలంగాణను వేదికగా చేసుకుంటున్నాయి. వైఎస్సార్టీపీ, జనసేన, బీఎస్పీ, ప్రజాశాంతి లాంటి పార్టీలన్నీ ఈ కోవలోనివే. తెలుగుదేశం తన ఉనికిని కోల్పోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పార్టీలు ఏ మేరకు ఓట్లు చీలుస్తాయనే సంగతి ఎలా ఉన్నా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నాయి. తెలంగాణ అనే పదాన్ని ప్రాణంగా భావించిన టీఆర్ఎస్ తన పార్టీ పేరులోంచి దాన్ని తొలగించుకున్నది. వివేకం, చైతన్యం కలిగిన ప్రజలు ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉన్నదో ఎన్నికల్లో ఓటు ద్వారా తేల్చనున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీల బలానికి అంతిమంగా ఓట్ల శాతం, సీట్ల సంఖ్యే కొలమానం.

ఎన్. విశ్వనాథ్

99714 82403

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story