- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలియని దిక్కులు కలవాలని ఆరాటం
మహానుభావుడు గురజాడ స్మరణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించడం ముదావహం

మహానుభావుడు గురజాడ స్మరణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించడం ముదావహం ." దేశమంటే మట్టి కాదోయ్"అన్న మహాకవి "ఎంచి చూడగా మంచి చెడ్డలె రెండు కులములు మనుజులందున" అని కూడా అన్నారు. ధని'కులమూ', తద్భిన్నమూ ఎలాగూ ఉన్నాయి. అలాగే కార్మి"కులము" లోనూ రెండు కులాలు ఉన్నాయి. తమకు వర్తించే చట్టాల పరిధిలోనికి తేబడిన వారు, బడని వారు. డోమ్ సిటీల దేశం, ప్రాణానికి తెగించి సంగమ స్నానం ఆచరించే దేశం తూర్పు, పడమరగానే కొనసాగుతాయి. నిట్టూర్చడానికి సినారె సినీ గీతం " కలియని దిక్కులు కలవవనీ తెలిసి ఆరాటం దేనికనీ" ఎలాగూ ఉంది. అయితే కోటి మంది గిగ్ కార్మికులకు సామాజిక బీమా పథకం బడ్జెట్ ప్రతిపాదనలలో ఒకటి కావడం 'చిన్ని చిన్ని ఆశ'.
కుంభమేళా అంటే తొడతొక్కిడిగా జనం. వణికించే చలిగాలులలో తోసుకుంటూ కోసులకొద్దీ గమనం, భూశయనం సంగమంలో గుంపులో గోవింద స్నానం కళ్ల ముందు కదులుతాయి. కానీ అపర కుబేరులకు మాత్రం శీతోష్ణ స్థితులకు అతీతంగా, ఏ నక్షత్రాల హోటల్స్‌కి తీసిపోని వర్తులాకార నగర (డోమ్ సిటీ) గుడారాలలో నివాసం. విలాసవంతమైన నౌకా విహారం. నదీ గర్భంలో సుఖమైన పుణ్య స్నానం.
మధ్యతరగతి మందహాసం
అలాగే, 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంపన్న వర్గాల అట్టహాసాలతో పాటు మధ్యతరగతి మందహాసాలు కూడా సాధించింది. అందుకు కారణం అనూహ్యంగా, ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి ఏకంగా రూ.12.75 లక్షలకు పెంచడం. ఫలితంగా, కొత్తగా కోటి మంది వరకు ఆదాయపన్ను బాధ ఉండదని ఒక అంచనా. తత్ఫలితంగా, ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల మేర ప్రత్యక్ష, మరో రూ. 2,600 కోట్ల మేర పరోక్ష పన్నుల ఆదాయం తగ్గవచ్చని అంచనా. ఇంతటి ఔదార్యం ఎందుకంటే, కేంద్ర ఆర్థిక మంత్రి మాటల్లో, ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి చేతుల్లో ఎక్కువగా డబ్బు ఉంటుంది. తత్ఫలితంగా, గృహా వసరాలకు ఎక్కువ ఖర్చు పెట్టే స్తోమత లభిస్తుంది, పొదుపులు, పెట్టుబడులను పెంచుతుంది. ఎన్నికల వేళ దేశ రాజధానిలో అధిక సంఖ్యలో ఉండే మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించేందుకే ఈ బొనాంజా అని కొందరి భాష్యం కావచ్చు.. కానీ అది అప్రస్తుతం.
ప్రజల జేబులు నింపే బడ్జెట్
"పోసేవాడు ఒకందుకు పోస్తే, తాగేవాడు ఇంకొకందుకు తాగుతాడు" అన్న నానుడి ఉండనే ఉంది. సాక్షాత్తు దేశ ప్రధాని "సాధారణంగా బడ్జెట్‌లన్నీ ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు, ఖజానా నింపేందుకు రూపొందిస్తుంటారని, అయితే ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపుతుంద"ని కొనియాడారు. సంతోషం. ఐతే, ఇదంతా మధ్య తరగతి స్థాయికి ఎదిగిన, ఎదగనున్న సంఘటిత రంగ కార్మికులకు, ఉద్యోగులకు మాత్రమే లాభ కారి. ఇంతకంటే మిక్కుటంగా బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే రాజమార్గం, వారి జేబులు కూడా నింపే మార్గం ఎప్పుడో వేసే ఉంది. అయితే అల్లుడి నోట్లో, కాదు నోళ్లలో శని ఉంది. ఒకటి కార్మిక సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను చిత్తశుద్ధితో అమలు పరిచే అధికార యంత్రాంగం లేకపోవడం. రెండు తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేసి, విడివిడి కొంపలు పెట్టుకొని, అలా విలయతాండవం సాగుతున్నా, జాతీయ, పోనీ ప్రాంతీయ స్థాయిలో ఐక్య కార్యాచరణకు పూనుకోవడానికి సిద్ధంగా లేని కార్మిక సంఘాలు. దానికి తోడు, చాలావరకు, ఒకే పరిశ్రమలో యాజమాన్యం ప్రత్యక్షంగా నియమించిన కార్మికులకు, గుత్తేదారుల (కాంట్రాక్టర్స్) ద్వారా నియమితులైన కార్మికులకు కేటాయింపుగా కార్మిక సంఘాలు ఉండడం.
ఎవరికీ పట్టని బిడ్డకు ఏడుపే గతి
ఈ రంగానికి తెరపడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలు తు.చ. తప్పకుండా అమలు జరిగితే కొత్త శ్రమ సూర్యుడు ఉదయిస్తాడు. చట్టం నిర్దేశించిన ప్రకారం వేతనాలు, భత్యాలు, బోనస్‌లు ముట్టి ప్రస్తుతం అందుకు వంచితులైన కార్మికుల జీవన స్థాయీ పెరుగుతుంది. వారి ఆర్థిక స్తోమత పెరగడం కారణంగా, వస్తు వినియోగం భారీగా జరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులకు గిరాకీ ఎన్నో రెట్లు అధికమవుతుంది. తోడుగా ఎనిమిది గంటల పని వేళలు ఎల్లడా అమలై, నిరుద్యోగం తగ్గుముఖం పడుతుంది. శ్రామిక జన ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్యశాలలలో రోగులు మంచాలు పంచుకోవాల్సిన స్థితి అరుదవుతుంది. ఉచితాలకు అర్హుల జాబితా కురచవుతుంది. ఆకలి సూచీలో 106వ స్థానంలో ఉన్న మన దేశం పైకి ఎగబాకుతుంది. మొత్తానికి "సబ్ కా వికాస్" కల నెరవేరే రోజు కనుచూపుమేరలో కనబడుతుంది. కావలసిందల్లా పాలకుల దృఢ నిశ్చయం. చట్టాలు అమలు చేసే అధికారుల, ఉద్యోగుల కర్తవ్య నిష్ట. లేదంటే ఎవరికీ పట్టని ఈ బిడ్డ ఏడుస్తూనే ఉంటుంది.
- మల్లాప్రగడ రామారావు
99898 63398






