జీవన గమనానికి కొత్త పునాది.. ఉగాది

by Ravi |   (  Updated:2026-03-19 01:01:05  IST  )

ఉగాది తెలుగు ప్రజల కొత్త సంవత్సరం పండుగ. వసంత ఋతువును స్వాగతిస్తూ, కొత్త ఆశలు, సంకల్పాలు, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వంటి సంప్రదాయాలతో జీవితానికి కొత్త ప్రారంభం నేర్పుతుంది.

జీవన గమనానికి కొత్త పునాది.. ఉగాది
X

ఉగాది అనేది తెలుగు ప్రజల సంవత్సరాది. ప్రకృతి పచ్చని కొత్త చిగురులతో అలరారుతూ, కోయిల గానాలతో మధుర స్వాగతం పలుకుతూ, మమతల పరిమళా లతో మనసులను పరవశింపజేసే పండుగ. జీవితంలో కష్టాలు ఎంత వచ్చినా, చైత్ర మాసంలో చెట్లు ఎలా నిలకడగా నిలబడ తాయో.. అలాగే మనం కూడా ధైర్యంగా నిలబడాలనే సందేశాన్ని ఇస్తుంది. ఒకసారి ఆశల ఆకులు రాలినా, మళ్లీ చిగురుతాయనే నమ్మకాన్ని నింపుతుంది. అదే కొత్త జీవితా నికి నాంది, మరెన్నో ఆశల ఆరంభం.

కూర్మ, వరాహ అవతారాలకు కూడా ముందే మహావిష్ణువు మత్స్యావతారంగా అవతరించి సోమకాసురుడి చెరలో చిక్కుకున్న వేదాలను రక్షించిందీ రోజు ఉగాదేనని పురాణాలు చెబుతున్నాయి. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమినాడే శ్రీరాముడు లంకవిజయం అనంతరం అయో ధ్యకు తిరుగు ప్రయాణం ప్రారంభించాడని వాల్మీకి రామాయణం సూచిస్తుంది. ఈ దృష్టిలో చూస్తే సత్యయుగానికి చెందిన దసరా నవరాత్రులకంటే, ద్వాపరయుగానికి చెందిన దీపావళి కంటే కూడా ఉగాదే మరింత ప్రాచీనమైన పండుగగా భావించబడుతుంది. బుద్ధిజీవిగా మారిన తర్వాత మనిషి జరుపుకున్న తొలి ఉత్సవం కూడా ఇదే అయి ఉండవచ్చు..

కాలానికి ఆది ఉగాది!

‘యుగం+ ఆది’ అనే రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడిన ‘ఉగాది’ అనే పదానికి ‘కొత్త యుగానికి ఆరంభం’ అనే అర్థం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు.. రోజులు, నెలలు, సంవత్సరాల కాలగణనను ఏర్పరచాడు. అందువల్ల ఉగాదిని కాలానికి ఆది, సృష్టికి ఆది అని భావిస్తారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు కూడా సూర్యోదయం నుంచి ప్రారంభమయ్యే ఈ రోజునే నూతన సంవత్సరారంభంగా గుర్తించాడు. ఉగాది అంటే పాత అనుభవాలను వెనక్కి వదిలి, కొత్త ఆశలతో జీవనయాత్రను మొదలుపెట్టడం.. ఇది వసంత ఋతువుకి స్వాగతం పలికే పండుగ. ఆశ, అభివృద్ధి, పునర్జన్మకు సంకేతం. ఇది కేవలం కాలమార్పు మాత్రమే కాదు.. మనసు మార్పు, ఆలోచనల మార్పు. మనలోని చెడు ఆలోచనలను తొలగించి, శాంతి, సత్సంకల్పం, సృజనాత్మకతను మేల్కొలిపే రోజు. సమయాన్ని గౌరవిం చడం, ప్రతి అనుభవంలో అర్థాన్ని తెలుసుకోవడం, జీవితాన్ని పునఃప్రారంభించడం అనే విలువలను ఈ పండుగ మనకు నేర్పిస్తుంది.

కొత్త ఆశలతో ప్రారంభించే రోజు..

ఉగాది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం- తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు. ఈ ఆరు రుచులు జీవితంలోని సుఖ దుఃఖాలను సూచిస్తాయి. మన జీవితం కూడా ఇలాగే వివిధ అనుభవాల సమాహారం అనే తాత్పర్యాన్ని ఈ పచ్చడి తెలియజేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉగాది రోజున నిర్వహించే మరో ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఐదు అంశాల సమాహారం- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ ఐదు అంగాల ఆధారంగానే కాలగణన నిర్ణయించబడుతుంది. పంచాంగం వినడం వల్ల శుభగుణాలు కలుగుతాయి. అందుకే ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది మన జీవితాన్ని కొత్త ఆశలతో, కొత్త సంకల్పాలతో మళ్లీ ప్రారంభించుకునే పవిత్రమైన రోజు.

‘పరాభవ’ సంవత్సరం అంటే..?

ఉగాది రోజున ప్రతి కొత్త సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ప్రకటించబడుతుంది. అలాంటి సంవత్సరాలలో ఒకటే ‘పరాభవ’ సంవత్సరం. ‘పరాభవం’ అంటే ఆధ్యాత్మిక దృష్టిలో ‘మనలోని అహంకారం, గర్వం, స్వార్థం వంటి దుర్గుణాలను జయించడం’. మనలోని లోపాలను గుర్తించి, వాటిని అధిగమిస్తూ వినయం, ధర్మం, సత్యం వైపు ముందుకు సాగాలని ఇది సూచిస్తుంది. ‘పర’ అంటే అమ్మవారు (పార్వతీదేవి), ‘భవ’ అంటే శివుడు. ఈ జగత్తుకు శివపార్వతులు తల్లిదం‌డ్రులుగా భావించబడతారు.. అందుకే ‘పరాభవ’ అనే పదాన్ని మరో దృష్టిలో చూస్తే, పరాశక్తి అయిన అమ్మవారు, భవుడు అయిన శివుడి అనుగ్రహంతో సృష్టి కొనసాగుతుందని సూచించే తాత్విక భావనగా కూడా భావించవచ్చు. తెలుగు కాలచక్రంలోని అరవై సంవ త్సరాలను పండితులు తాత్వికంగా మూడు భాగాలుగా విభజిస్తారు.. అవి సాధారణంగా బ్రహ్మ, విష్ణు, శివ విభాగాలుగా చెప్పబడతాయి. ఈ విభాగాలలో పరాభవ సంవత్సరం విష్ణు విభాగానికి చెందిన రెండవ భాగంలో చివరి సంవత్సరంగా భావించబడుతుంది. అందువల్ల పేరు వినడానికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ, ‘పరాభవ’ అనే భావన ఆత్మవిజయాన్ని సూచిస్తుంది. అహంకారాన్ని తగ్గించి, ఆత్మపరిశీలన చేసుకుంటూ ధర్మ మార్గంలో ముందుకు సాగాలని గుర్తుచేసే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సంవత్సరం మనకు అందిస్తుంది.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story