పచ్చడి@ఖుర్మా పాయసం...!

by Ravi |   (  Updated:2025-03-30 01:15:47  IST  )

మతాలు వేరైతే నేమి / భాషలు వేరైతే నేమి/ భారతీయులం అందరం / భారతదేశం సుందరం అంటారు

పచ్చడి@ఖుర్మా పాయసం...!
X

మతాలు వేరైతే నేమి / భాషలు వేరైతే నేమి/ భారతీయులం అందరం / భారతదేశం సుందరం అంటారు ఒక గేయ రచయిత. విభిన్నతలోని ఏకత్వపు పరిమళాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచానికి పరిచయం చేసిన నేల మనది. మానవత్వపు శోభ, మనిషితనపు మట్టితనం మనదేశపు ప్రత్యేకతలు.. రేపు ఉగాది, ఎల్లుండి రమదాన్ పండుగల పర్వదినాల సందర్భంగా ఎప్పటిలాగానే మనలోని మతసామరస్యం, జాతి సమగ్రత సూర్యోదయమై ప్రభవిస్తుంది.

హిందూ-ముస్లిం సోదరులు అందరూ కలిసి ఉగాది పచ్చడి, హైదరాబాదీ హలీమ్‌లు ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. వీరందరూ తమ విశ్వాసాలను పాటిస్తూనే పండుగల ప్రాశస్త్యంను, విశిష్టతలను తెలియచెబుతారు. మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల రాగాలు, ఖర్జూర పండ్లు, షీర్ ఖుర్మా పాయసం, హలీమ్, హరీస్, బిర్యానీ, అత్తరు పరిమళాలు, నమాజు‌లు వంటి ఎన్నో అంశాల మధ్య హిందూ ముస్లిం సోదరులు కలిసి అందరూ మానవత్వపు విలువల మధ్య సుఖశాంతులతో పండుగల సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుందాం.

ఉగాది

ఉగస్య ఆది లేదా ఉగాది పండుగగా పిలుస్తారు. ఈ రోజును నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజుగా భావిస్తారు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణయించిన శుభ ముహూర్తం, కలియుగ ఆరంభం అనీ ఉగాది గురించి చరిత్రలో వున్నది. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమిగా ఈసారి విశ్వావసు నామ సంవత్సరం మన జీవితాల్లోకి ప్రవేశించనున్నది. మామిడాకులతో ఇంటిని అలంకరించి తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరిస్తారు. ఉగాది పచ్చడికి సంబంధించిన సారాంశం మానవ జీవితానికి అన్వయించుకోవచ్చు. తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు, పులుపు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. జీవితంలో కూడా విభిన్న భావోద్వేగాల మధ్య సమన్వయం చేసుకుంటూ, గెలుపోటములను సమదృష్టితో చూస్తూ, సవాళ్లను ఎదుర్కొవాలనే సందేశం ఇందులో వుంది.

శాస్త్రీయంగా కూడా వేసవి తాపాన్ని తగ్గిస్తూ వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే రోగాలను సైతం పచ్చడి దూరం చేస్తుంది. వసంత ఋతువు ఆగమనం వల్ల కోయిలలు కుహూ కుహూ రాగాలతో పాటు, మల్లె పూల సౌరభాల మధ్య చెట్లు చిగుర్చి, పూలన్నీ వికసిస్తూ, ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. దేశపు ఆకలిని తీర్చే రైతన్నను గౌరవించే వేడుకగా కూడా ఉగాదిని జరుపుకుంటారు. ఈ పండుగలో మరో ప్రత్యేకత పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చేసిన వారికీ, విన్న వారికీ నవగ్రహానుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు విభిన్న పేర్లతో ఉగాది వేడుకలు జరుపుకుంటారు. కవులు ఈ పర్వదినాన కవి సమ్మేళనంలో పాల్గొంటూ అందరూ బాగుండాలనీ కవితాగానం చేస్తారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో, విశిష్టతలతో, విశ్వాసాలతో ఉగాది పండుగ సందడి చేయబోతుంది.

రమదాన్ సందేశం..

అల్లాహ్ ఆదేశాలను త్రికరణ శుద్ధిగా పాటించి ఆయన సమక్షంలోనే కృతజ్ఞతలు తెలియజేసే పర్వదినంగా రమదాన్పండుగను ముస్లిం సోదరులు జరుపుకుంటారు. నెలరోజుల పవిత్ర ఉపవాస దీక్షలకు ప్రతిఫలం లభించే రోజు ఇది. ఉపవాసాల్లోని సహరీ, ఇఫ్తార్‌లు సహనశీలత, కృతజ్ఞతలను తెలియజేస్తాయి. ఈ పవిత్ర మాసంలో ఖురాన్ పారాయణం చేస్తారు. పండుగ పర్వదినాన కొత్త దుస్తులు ధరించి, అత్తరు పరిమళాల మధ్య షీర్ ఖుర్మా పాయసాన్ని బంధుమిత్రులకు అందిస్తారు. ఈ పండుగలో ముఖ్యమైనదీ ఏమిటంటే ఫిత్రా, జకాత్ దానాలు స్వీకరించటం వల్ల నిరుపేదలు సైతం పెదాలపై చిరునవ్వుల వెలుగులో సంతోషంగా పండుగ చేసుకుంటారు. ముహమ్మద్ ప్రవక్త రమదాన్ నాడు కొన్ని ఖర్జూర పండ్లు తిని నమాజు కోసం ఈద్గాహ్‌కు వెళ్ళేవారని చరిత్రలో వుంది. ముస్లిములు ఈ పండుగను నియమ, నిష్టలతో కూడిన నమాజులతో జరుపుకుంటారు. చాలా కట్టుదిట్టమైన ఉపవాస దీక్షల వల్ల మండుతున్న ఎండల్లో సైతం ఆకలి బాధను తట్టుకుంటారు. పేదలకు దానం చేయడం, తోటివారికి సాయ పడటం వంటి విలువలు రమదాన్ సందేశంగా చెప్పవచ్చు.

సుఖశాంతులతో పండగ జరుపుకోవాలి..

'హిందూ-ముస్లిం ఐక్యత, ఖద్దర్, అస్పృశ్యత తొలగింపు అనేవి నా దృష్టిలో స్వరాజ్‌కు పునాది' అంటూ హిందూ- ముస్లింల ఐక్యత ప్రాధాన్యత గురించి స్వాతంత్రోద్యమ కాలంలోనే గాంధీజీ చెప్పారు. శాస్త్రీయమైన మత విశ్వాసాలను పరస్పరం గౌరవించుకుంటూ మేరా భారత్ మహాన్ అని నమ్మే సంస్కృతి మనది. దేశమే మనందరి మతం. అందుకే విభిన్న మతాల నిలయం మన భారతదేశం. ఈసారి వరుస దినాలలో ఉగాది, రమదాన్ పండుగలు రావడం వల్ల మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల రాగాలు, ఖర్జూర పండ్లు, షీర్ ఖుర్మా పాయసం, హలీమ్, హరీస్, బిర్యానీ, అత్తరు పరిమళాలు, నమాజు‌లు వంటి ఎన్నో అంశాల మధ్య హిందూ ముస్లిం సోదరులు కలిసి అందరూ మానవత్వపు విలువల మధ్య సుఖశాంతులతో పండుగల సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలనీ, "సర్వజన హితమే నా మతం" అన్న మన మహాత్ముడి వచనాలు విశ్వ శాంతి వికాసంలో కీలక సందేశం కావాలనీ మన మంతా ఆశిస్తూ.. అందరికీ పండుగల శుభాకాంక్షలు..

- ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Next Story