ఇరవై ఏళ్ల పోరాటం.. ఇంకా దక్కని పెన్షన్ హక్కు!

by Ravi |   (  Updated:2026-01-23 01:15:47  IST  )

‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదు’ అన్న నానుడి నేటి 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై, 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. నియామక ప్రక్రియ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆలస్యమైందన్న ఒకే ఒక్క కారణంతో వేలాది మంది ఉద్యోగులను బలవంతంగా నూతన పెన్షన్ విధానం (సీపీఎస్) పరిధిలోకి నెట్టివేయడం ఘోరమైన అన్యాయం.

ఇరవై ఏళ్ల పోరాటం.. ఇంకా దక్కని పెన్షన్ హక్కు!
X

‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదు’ అన్న నానుడి నేటి 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై, 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. నియామక ప్రక్రియ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆలస్యమైందన్న ఒకే ఒక్క కారణంతో వేలాది మంది ఉద్యోగులను బలవంతంగా నూతన పెన్షన్ విధానం (సీపీఎస్) పరిధిలోకి నెట్టివేయడం ఘోరమైన అన్యాయం. పెన్షన్ అనేది భిక్ష కాదు.. అది ఉద్యోగి హక్కు అని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పినా, ప్రభుత్వాలు నేటికీ ఆ వాస్తవాన్ని విస్మరించడమే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉద్యోగ విర మణ అనంతరం తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందనుకున్న పెన్షన్ విధానాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్యగా వారు పరిగణిస్తున్నారు. సుమారు ముప్పై సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగికి పెన్షన్ అందించకపోవడం ఉద్యోగులను వంచించడమే అవుతుంది. 2004 కన్నా ముందు ప్రభుత్వాలు ఏ విధంగా ఉద్యోగులకు పెన్షన్ అందించాయి? అది ఇప్పుడు ఎందుకు సాధ్యపడడం లేదు?

కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ..

పీఎఫ్అర్డిఏ చట్టం ప్రకారం 2004 జనవరి 01 నుండి మన దేశంలో ప్రవేశ పెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలులో భాగంగా, ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 01 నుండి సీపీఎస్ విధానం అమలు అవుతోంది. అయితే, సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే నోటిఫికేషన్లు విడుదలై నియామక ప్రక్రియ ఆలస్యం కావడం వలన సీపీఎస్ అమలు తేదీ తరువాత నియామకం జరిగిన ఉద్యోగులను బలవంతంగా నూతన పెన్షన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇలా తమకు జరిగిన అన్యాయం గురించి కేంద్రప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు తీసుకువెళ్లిన నేపథ్యంలో వారికి న్యాయం చేకూరుస్తూ కేంద్రం 2004 జనవరి తరువాత జాయిన్ అయిన వారిని పాత పెన్షన్ పరిధిలోకి తీసుకువస్తూ మెమో విడుదల చేసింది. అలాగే 2003 డిసెంబర్ 22 నాటికి నోటిఫికేషన్ విడుదల అయి 2004 తర్వాత నియామకాలు జరిగి సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న వారినందరినీ పాత పెన్షన్ పరిధిలోకి తీసుకు వెళ్లేలా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. పీఎఫ్ఆర్డిఏ చట్టం ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించవలసి ఉంటుంది. ఆ లెక్కన రాష్టంలో కూడా రాష్ట్రంలో సీపీఎస్ అమలు తేదీకి ముందు నోటిఫికేషన్ విడుదల అయిన నియామకం కాబడిన ఉద్యోగులను ఓపీఎస్ చేర్చాలి. కానీ వారిని సీపీఎస్ పరిధిలోకి వచ్చి అన్యాయం చేశారు.

సీపీఎస్ రద్దు చేయకపోగా..

ఈ విషయమై రెండు దశాబ్దాలకు పైగా అనేక ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు చేసినప్పటికీ సమస్య సమస్యగానే మిగిలిపోవడం శోచనీయం. ప్రభుత్వాలు ఎన్ని మారినా సీపీఎస్ ఉద్యోగుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నూతన పెన్షన్ విధానం రద్దు కోసం చెయ్యని ధర్నా లేదు, కలవని పార్టీ లేదు. రద్దవడం మాట అటుంచితే ప్రభుత్వం దానిని రద్దు చేసే దిశగా ఆలోచన చేయడం మానేసి సరికొత్త స్కీంలను తీసుకురావడం విడ్డూరం.. ఆ కోవలో కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్రాల్లోనైతే ప్రతీ ఐదేళ్ల కొకసారి రాజకీయ పార్టీలకు సీపీఎస్ విధానం రద్దుచేస్తామని తమ తమ మేనిఫెస్టోల్లో పెట్టుకొని ఉద్యోగుల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తదుపరి ఆ ఊసే ఎత్తక పోవడం పరిపాటిగా మారిపోయింది. కేవలం పంజాబ్, హర్యానా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలు నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. ఈ నేపధ్యంలో మిగితా రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది.

లక్షల కుటుంబాలతో ముడిపడిన అంశం..

కొత్త పెన్షన్ అమలు చేస్తున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అధ్యయనం చెస్తే సీపీఎస్ రద్దు చేయడం సాధ్యమయ్యే ప్రక్రియే. ఈ రద్దు లక్షా అరవై వేల ఉద్యోగుల కుటుంబాలతో ముడిపడి ఉన్న అంశంగా ప్రభుత్వం పరిగణించి వెంటనే రద్దు దిశగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాలి. రాష్ట్రోపాధ్యాయ సంఘం సీపీఎస్ రద్దును కోరుతూ 2018‌లోనే ఓరుగల్లు నడిబొడ్డున మహాధర్నా నిర్వహించి పాత పెన్షన్ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసింది. ఇక గత ఇరవై ఏళ్లుగా ఏటా సెప్టెంబర్ మొదటి తేదీన పెన్షన్ విద్రోహ దినంగా జరుపుతున్న నేటికి సీపీఎస్ విధానం రద్దుకాకపోవడం శోచనీయం. ప్రభుత్వాలు ఈ విధానం రద్దును ఒక రాజకీయ ప్రక్రియగా కాకుండా ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసాను కల్పించే దిశగా ఆలోచించి రద్దుకు చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. ఆ ప్రకారం ముందుగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మాదిరిగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Next Story