ట్రంప్ మీ బెదిరింపులు ఇక పనిచేయవ్!

by Ravi |   (  Updated:2025-08-24 00:45:43  IST  )

భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు తప్పవని హుకుం జారీ చేసి, మోడీ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవాలని ఆశపడిన

ట్రంప్ మీ బెదిరింపులు ఇక పనిచేయవ్!
X

భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు తప్పవని హుకుం జారీ చేసి, మోడీ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవాలని ఆశపడిన ట్రంప్ భంగపాటుకు గురై, ఈ నెల 27 నుంచి 50 శాతం సుంకాలు తప్పవని పలికిన వదురుబోతు మాటలను మోడీ లెక్కచేయక పోవడం ఒక ఎత్తైతే, రష్యా నుండి మీ దిగుమతుల మాటేమిటని భారత్ ప్రభుత్వం వేసిన ప్రశ్నలు అమెరికా వ్యూహకర్తలకు ఇబ్బందిని కలిగించాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి మోడీ ప్రభుత్వం రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతిని అంచెలంచెలుగా పెంచుకుంటూ, దిగుమతి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉండడం ట్రంప్ సలహాదారులకు మింగుడు పడలేదు. ఇది ప్రపంచ పెద్దన్న పాత్రకు ఇది ఇబ్బంది కలిగించే విషయం!

పట్టువిడుపులు లేని ట్రంప్

రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి వల్లే ట్రంప్‌కు భారత్ పై కోపం వచ్చిందని, అందువల్లనే ఈ టారిఫ్‌ల యుద్ధం మొదలు పెట్టాడని చాలా మంది భారతీయులు అనుకుంటున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఆపరేషన్ సింధూర్ విజయాలు, సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం, భారత సైన్యం జరిపిన క్షిపణుల దాడుల నేపథ్యంలో కిరానా హిల్స్ వద్ద అణు వార్ హెడ్స్‌కు నష్టం వాటిల్లిందనే వార్తలు గుప్పుమనడం, అక్కడే అమెరికా రక్షణ స్థావరాలు ఉండడం, భారత సైనిక పాఠవాన్ని చూసి ప్రపంచ దేశాలు అబ్బుర పడడం వంటి విషయాలు అమెరికా అధ్యక్షుడి కోపానికి కారణమనేది లోతైన విశ్లేషణ. వాస్తవంగా ట్రంప్ రాజనీతిజ్ఞుడు కాదు. ఆయన ఒక వ్యాపారి. నిజమైన పాలకుడికి అంత ర్జాతీయ విషయాలలో పట్టు విడుపులు ఉంటాయి. ట్రంప్ విషయంలో ఇది వర్తించదు.

గొంతెమ్మ కోర్కెలు ఒప్పుకోం!

భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసి, రష్యాకు ఆర్థిక లాభం చేకూర్చడం వలన ఉక్రెయిన్ సైనికులు హతంఅవుతున్నారని, ఈ పాపం భారత్‌కు అంటకుండా ఉండా లంటే, వెంటనే రష్యా నుండి చమురు కొనుగోలు ఆపివేయాలని అమెరికా అధ్యక్షుడు చెప్పే మాటలు నమ్మేది ఎవరు? వాస్తవంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇచ్చిన వెన్నుదన్నుతోనే సైనికంగా బలిష్టమైన రష్యాతో ఉక్రెయిన్ యుద్ధా నికి దిగిందనేది వాస్తవం. ఉక్రెయిన్ యుఎస్ఎస్ఆర్‌లో ఒక ప్పుడు భాగం అనే విషయాన్ని మరవకూడదు. రష్యా నుండి ఆయుధ, ఆయిల్ కొనుగోలును నిలిపి, తమ దేశంతో ఈ రెండు విషయాల్లో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని, వ్యవ సాయ, పాడి పరిశ్రమల్లో అమెరికా పెట్టుబడిదారులను అనుమతించాలని అమెరికా పాలకులు కోరుకుంటున్నారు. వారి గొంతెమ్మ కోరికలను జగమొండి అయిన మోడీ అంగీకరించకపోవడం ఈ సందిగ్ధానికి ఒక కారణం అని అనుకోవాలి.

నష్టపోయేది అమెరికానే!

భారత దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తే, అమెరికా వినియోగదారులు నష్టపోతారు. అమెరికన్లు ట్రంప్‌కు వ్యతి రేకంగా మారడం ఖాయం. ఇక భారత దేశంలో అమెరికా వస్తువులను కొనరాదంటూ స్వదేశీ జాగరణ మంచ్ తన పనిని ఉధృతం చేస్తుంది. ఇదే సందర్భంలో అమెరికా పెంచిన సుంకాలను అధిగమించడానికి భారత వ్యాపారస్తులకు మోడీ ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును కల్పించాలి. అమెరికా మార్కెట్‌ను ఇతర దేశాలకు తరలించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అమెరికా టారిఫ్‌ల మూలంగా భారత ఆర్థిక వ్యవస్థ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదనే అనుమానం దేశ ప్రజలకు రాకూడదు.

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Next Story