- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేక్షకుడిని సినిమా వెంటాడేలా చేయాలంటే..
సినిమా అనేది కేవలం వినోదం కోసం రూపొందించిన దృశ్య మాధ్యమం మాత్రమే కాదు. అది కథలు చెప్పే అత్యంత సమగ్రమైన

సినిమా అనేది కేవలం వినోదం కోసం రూపొందించిన దృశ్య మాధ్యమం మాత్రమే కాదు. అది కథలు చెప్పే అత్యంత సమగ్రమైన శక్తివంతమైన దృశ్య రూపం. ఒక మంచి సినిమా వెనుక ప్రధానంగా ఉండే అత్యంత ప్రాథమిక శక్తి కథనమే. కథ ఎలా చెప్పమన్నది కాక, సినిమాల్లో కథ ఎలా చూపించారు అన్నదానిపైనే దాని ప్రభావం నిర్ధారణ అవుతుంది. ఈ కథ, కథనాలను సినిమా భాషలో ‘డైజేసిస్’ అంటారు.
డైజెసిస్ అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. ప్రధానంగా ఆ మాటకు అర్థం ‘చెప్పడం’ లేదా ‘కథనం’. ప్రధానంగా ఇప్పటి ఓటీటీ యుగంలో, ఎక్కువగా ప్రేక్షకుడిని అనుభూతి పరంగా వెంటాడేలా కథనం ఉంటున్నది. కథ అంత గొప్పగా లేకపోయినా కథనం బలంగా ఉంటే ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తున్నాడు.
కళ్లతో వినిపించే కథ సినిమా
కథల్లో నవలల్లో మనం కథ చెపుతాం, సినిమాల్లో కథను చూపిస్తాం. కథ లేదా నవల చదివేటప్పుడు పాఠకుడు వాటిల్లోని పాత్రల్ని వాటి కదలికలని మనోభావాల్ని ఊహిస్తాడు, అనుభవిస్తాడు, అనుభూతిస్తాడు. తన మనో ఫలకంపై ప్రతిష్టించుకుంటాడు. సినిమా విషయానికి వచ్చే సరికి కథల్లోని పాత్రలు తెర మీద మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అంతే కాదు ఆయా పాత్రల నడవడిక వాటి చుట్టూ ఉన్న వాతావరణం ఉద్రేకాలు, ఉద్వేగాలు అన్నీ ప్రేక్షకుల ముందు దర్శనమిస్తాయి. థియేటర్ అనే చీకటి గదిలో ప్రేక్షకులు సినిమాలో పూర్తిగా లీనమై పోతారు. కొన్ని సార్లు తమను తాము ఆయా పాత్రల్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా అనేది కళ్లతో వినిపించే కథ. దాన్ని చూపే విధానాన్ని కథన శైలి అంటాం. ఒకే కథను పదిమంది దర్శకులు పది విధాలుగా చెబుతారు. అది కథన శైలిలోని ప్రత్యేకత.
సినీ కథన శైలులు పలురకాలు..
ఒక మంచి సినిమా అంటే మంచి కథతో పాటు దానిని ఎంత నైపుణ్యంగా ఎంత ప్రభావవంతంగా చూపించారన్నదే ముఖ్యం. కాబట్టి సినిమాల్లో కథన శైలి అనేది కేవలం కథల్లోని ఒక రచనా పద్ధతి కాదు. అది ఒక కళావిష్కరణ, భావ ప్రకటన, సాంకేతిక నైపుణ్యాల సమ్మేళనం. సినిమాల్లో దర్శకుడు కథను దృశ్యరూపంలో ఎలా ఆవిష్కరించాడు, ఎలా వివరించాడు అన్నదే కథనం లేదా కథన శైలి. ఇది కేవలం కథా పాఠాన్ని ఒక వరుసగా చూపించడమే కాదు. దాన్ని ఎవరి దృశ్య కోణం లోంచి, ఏ సందర్భంలో చూపించాలి, ఏ దృక్కోణంలో ఏ కాలాన్ని ఎలా వాడాలి, భావోద్వేగాలను ఎలా ప్రదర్శించాలి? అనే ప్రతీ అంశంలో కథన శైలి ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కథనం చెప్పే శైలులు..
ఈ కథన శైలుల్లో ప్రధానమైనది సాధారణ రేఖీయ కథనం (Linear Narrative). ఇది ముఖ్యంగా సంఘటనలని వరుసగా, మొదటి నుండి చివర వరకు కాలక్రమంలో ఎలా జరిగాయో అలాగే చూపడం. ఇది ప్రామాణికమైన, సాధారణమైన కథన శైలి. అదే ఆధునిక నెరేటివ్ సిద్ధాంతం ప్రకారం ఇది కథలో ఉన్న కల్పిత ప్రపంచాన్ని సూచిస్తుంది. ఇందులో పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. నివసిస్తాయి, సంభాషిస్తాయి, పనిచేస్తాయి ఆక్టివిటీ చేస్తాయి. ఇక నాన్-లినియర్ శైలి లేదా అవ్యవస్థిత (సామాన్య క్రమాన్ని అతిక్రమించే) కథన శైలి (Non-linear Narrative)లో కథ ఫ్లాష్‌బ్యాక్, ఫాస్ట్ ఫార్వర్డ్, మధ్యలో జంప్‌లు, కలల ద్వారా సాగుతుంది. ఇది ప్రేక్షకుడిని మానసికంగా ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక మరొకటి వృత్తాకార కథనం (Circular Narrative) ఇందులో కథ చివరలో తిరిగి మొదటికి వస్తుంది. కథను ఒక వలయంలా చూపిస్తారు. ఇక మల్టీ-నెరేటివ్ కథనం (Multiple Narratives)లో ఒకే కథలో అనేక పాత్రల దృష్టికోణాల నుంచి కథను చూపించడం. ఇది సమాంతర కథలు కలగలిపే కథన శైలి. మరొక శైలి గత జ్ఞాపక కథనం (Memory-based Narrative) ఈ కథనం ఉపయోగించే సినిమాల్లో పాత్ర గతాన్ని తలుచుకుంటూ కథ చెబుతుంది. ఇది ఆయా పాత్రల అంతర్గత భావాలకు బలం ఇస్తుంది.
ప్రేక్షకుని మనస్సు తాకాలంటే..
ఇలాంటి అన్ని కథన శైలులను కెమెరా దృక్కోణం (Camera Perspective), ఎడిటింగ్ (Editing) పాటలు, నేపథ్య సంగీతం స్క్రిప్ట్ నిర్మాణం లాంటి పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక కథనంలో పాత్రల డైలాగ్‌లు, రోడ్డు మీద శబ్దాలని డైజెటిక్ (diegetic)అని, ప్రత్యేకంగా వినిపించే నేపథ్య సంగీతం, వాయిస్ ఓవర్ వంటి అంశాలు, నాన్-డైజెటిక్ (non-diegetic) అని అంటారు. నిజానికి కథన శైలి అనేది కేవలం కథ చెప్పే పద్ధతి మాత్రమే కాదు. అది ఆ కథకు చెందిన ఆత్మ. ఒక దర్శకుడు కథను ఏ దృష్టితో చెబుతున్నాడో, ఎలాంటి అనుభూతులు సృష్టించాలనుకుంటున్నాడో, వాటి వెనక కథన శైలే కీలకం. ప్రేక్షకుని మనస్సును తాకే కథలని ఎవరైనా అంత త్వరగా మర్చిపోవడం కష్టం. వాటి వెనక ఉన్న శక్తి కథన శైలి మాత్రమే.
కథ గొప్పగా లేకపోయినా..
అందుకే ప్రతి దర్శకుడు రచయిత తన ఆలోచనలకు అనుగుణమైన కథన శైలిని ఎంచుకోవడం, దాన్ని అభ్యా సంతో పదును పెట్టుకోవడం ఎంతో అవసరం. సినిమాల్లో ప్రధానంగా ఇప్పటి ఓటీటీ యుగంలో, కథనం ఎక్కువగా ప్రేక్షకుడిని అనుభూతులపరంగా వెంటాడేలా కథనం ఉంటు న్నది. కథ అంత గొప్పగా లేకపోయినా కథనం బలంగా ఉంటే ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తున్నాడు. కథ కాకుండా కథనం మీదే ఇవాళ సినిమాలు నడుస్తున్నాయి.
వారాల ఆనంద్
94405 01281






