పిల్లలను సెల్‌ఫోన్ నుండి దూరం చేయాలంటే..

by Ravi |   (  Updated:2025-08-17 00:30:42  IST  )

నేటి ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఒక రకంగా ఇవి సామాజిక

పిల్లలను సెల్‌ఫోన్ నుండి దూరం చేయాలంటే..
X

నేటి ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఒక రకంగా ఇవి సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ సంబంధిత విషయాల తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్నా.. రోజురోజుకూ జనాలు వాటికి బానిసవ్వడం ఆందోళన కలిగిస్తుంది. సామాజిక మాధ్యమాల కంటెంట్ పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం మొబైల్ స్క్రీన్‌లో ఇరుక్కుపోయింది. వీటి నుంచి పిల్లల్ని కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. పిల్లలు ఎదుగుతున్న దశలో సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసవడం వలన వారిలో విపరీత ప్రవర్తన, దూకుడు స్వభావం పెరుగుతుంది. తద్వారా నేరాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ఇవి శాంతిభద్రత సమస్యలుగా మారుతున్నాయి.

గత ఏడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించడంపై నిషేధం విధించింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సామాజిక మాధ్యమాల నియంత్రణపై ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. మన దేశంలో బాలల జనాభా అధికం. అందుకే ఇక్కడ కూడా పిల్లలు సామాజిక మాధ్యమాల బారిన పడకుండా చూడడం చాలా అవసరం. 2023లో కర్ణాటక హైకోర్టు పాఠశాల పిల్లలు సామాజిక మాధ్యమాలకు అధికంగా వ్యసనం కావడం, దాని ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వీటిని వినియోగించడానికి వయోపరిమితిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియా కట్టడికి మార్గదర్శకాలు రూపొందించమని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.

పిల్లలను వీటి నుంచి దూరం చేయాలంటే, పిల్లలు సెల్ ఫోన్ వినియోగి స్తు‌న్నప్పుడు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. వారిలో విపరీత పోకడలను సరిదిద్దాలి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని గహీరాబేడీ గ్రామ పంచాయతీలో గ్రామంలోని పిల్లలు ఫోన్‌లో గేమ్ ఆడితే తల్లిదండ్రులకు రూ.3,000 జరిమానా విధిస్తామని ఆంక్ష పెట్టారు. ఈ సమాచారం ఇచ్చిన వారికి బహుమతిగా రూ.1,000 అందజేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలో చాలా వరకు మార్పు కనిపించింది. ఇలాంటి కట్టడి ప్రతి గ్రామంలో రావాలి. చరవాణి వ్యసనం నుంచి పిల్లలు దూరం చేయాలంటే వారిని ప్రకృతితో మమేకం చేయాలి. కుటుంబ బంధుత్వాలు, విలువల గురించి బోధించాలి. పిల్లలతో కలిసి ఆడుకోనివ్వాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుతెరిగి నడుచుకోవాలి.

- సంపతి రమేష్ మహారాజ్,

79895 79428

Next Story