- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజం నిప్పులాంటిది.. నివేదికలే సాక్ష్యం!
తిరుమలలో లడ్డులో కల్తీ నెయ్యి, జంతు కొవ్వు కలిసిన సంఘటనపై ల్యాబ్ నివేదికల ప్రకారం కేసులు నమోదు, SIT విచారణ, భక్తుల విశ్వాసానికి హాని చేసిన బాధ్యత వైసీపీ అధికారంపై ఉంది.

తిరుమల పవిత్రతపై జరిగిన దాడికి బాధ్యులెవరు? అంటూ ఒక భక్తుని ఆవేదన! కోట్లాది మంది భక్తులు తమ జీవితంలో ఒకసారి అయినా తిరుమల ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటారు.. అది భక్తి భావానికి ప్రతీక. అందుకే తిరుమలలో అత్యంత పవిత్రంగా తయారయ్యే లడ్డు విషయంలో భక్తుల విశ్వాసం అత్యంత పవిత్రమైనది. ఆ విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ప్రభుత్వానికి బాధ్యత..
కలియుగ వైకుంఠంగా వాసికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రంలో గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఘోర అపచారం కోట్లాది మంది హిందువుల గుండెల్లో మంటలు రేపింది. శ్రీవారి ప్రసాదం అంటే కేవలం తినే పదార్థం కాదు, అది భక్తుల నమ్మకం, పరమ పవిత్రం. అటువంటి ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా తేలడం నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. తిరుమలలో జరిగిన ఈ మహా పాపంపై పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న బుకాయింపులు భక్తుల మనోభావాలను మరింత గాయ పరుస్తున్నాయి..
బుకాయింపులు పనిచేయవ్!
భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, తప్పు చేసి కూడా సమర్థించుకోవడం అనేది మరింత దారుణం. వైసీపీ నాయకుల బుకాయింపులు చెల్లవు.. వారు చేసింది మహాప రాధం. కల్తీ లడ్డు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మొదటగా సంబంధిత అధికారులు పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలకు పంపారు. నెయ్యి నాణ్యత ఏమిటి? ఉపయోగించిన పదార్థాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్న విషయాలు ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారించబడ్డాయి. ఈ పరీక్షల నివేదికలు స్పష్టంగా చెబు తున్న విషయం ఏమిటంటే అభిప్రాయాలు కాదు, నివేదికలే నిజాలకు అద్దం పడుతున్నాయి..
ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే కేసు..
గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లార్డ్, చేప నూనె ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సృష్టించిన రిపోర్ట్ కాదు.. భక్తులు, పోటు కార్మికులు చేసిన ఫిర్యాదుల మేరకు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి ట్యాంకర్ల నుంచి 2024 జులై 16, 23 తేదీల్లో నమూనాలు తీసి సీల్డ్ కవర్లో ఎన్డీబీ-సీఏఎల్ఎఫ్ ల్యాబ్‌కి పంపగా, టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో వనస్పతి, జంతు కొవ్వుతో కల్తీ చేసినట్లు ల్యాబ్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగానే కేసు నమోదు చేసి సిట్ విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. పామోలిన్, ఇతర రసాయనాలతో తయారు చేసిన 60 లక్షల కిలోల నెయ్యి అనే పదార్థాన్ని డెయిరీలు సరఫరా చేశాయని.. దానితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేసినట్లు, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాదారుల్ని బెదిరించి వసూళ్ల కు పాల్పదినట్లు కూడా సిట్ విచారణలో వెల్లడైంది.
డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ.. ఎవరివి?
కానీ సాక్ష్యాలు కళ్లముందు కనిపిస్తున్నా, వైసీపీ నాయకులు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనడం బాధ్యతా రాహిత్యం. చేసిన తప్పును ఒప్పుకోలేక, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడిపైనే నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? దీనిని రాజకీయ కోణంలో చూస్తూ తప్పించు కోవాలని చూస్తున్నారు.. కానీ ఇది రాజకీయాలకు అతీతమైన అంశం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, తన హయాంలో జరిగిన ఈ ఘోర అపచారానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
అపచారాలు ఎన్నో..
కల్తీ నెయ్యి వెనుక కుట్రలు, నివేదికలు వెనుక ఉన్న భయంకరమైన నిజాలు నెయ్యి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేలా నిబంధనలు సడలిస్తూ కొనుగోలు కమిటీ సిఫారసు చేసింది. పామోలిన్, పామ్ కెర్నల్ ఆయిల్, బీటా కెరోటిన్, ప్లేవరింగ్ ఏజెంట్ల వంటి ఇతర రసాయనాలు ఉపయోగించి నెయ్యిని పోలి ఉండే రసాయనం తయారు చేసారని, ఇది నేరపూరిత కుట్రగా సిట్ తేల్చింది. శాస్త్రీయ నివేదికలు కల్తీ లడ్డు పాపాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టాయి. వైసీపీ వారు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆధునిక సాంకేతికత, ల్యాబ్ నివేది కల ముందు అబద్ధాలు నిలవ లేవు.. అపవిత్ర పాలనలో అపచారాలు ఎన్నో, వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే తిరుమల బోర్డు టీటీడీ నియామకాల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ధార్మిక చింతన లేని వ్యక్తులకు పగ్గాలు అప్పగించడం వల్లనే ఈ రోజు ఇలాంటి దుస్థితి దాపురించింది. నెయ్యి కొనుగోలు ప్రక్రియలో నాణ్యత కంటే కమీషన్లకే ప్రాధాన్యత ఇచ్చారన్నది బహిరంగ రహస్యం.
మితిమీరిన రాజకీయ జోక్యం!
గత ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానం, తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామన్న కంపెనీలను ప్రోత్సహించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది హిందువుల మతాచారాలను భ్రష్టు పట్టించిన ఈ చర్యను కేవలం పొరపాటుగా చూడలేం, ఇది ఒక వ్యవస్థీకృత నేరం అని చెప్పాలి. ఈ మహా పాపానికి కారకులైన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించబడాలి. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సాహసాలు ఎవరూ చేయలేరు.. నివేదికల రూపంలో బయటపడిన ఈ నిజాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి.
- నీరుకొండప్రసాద్
98496 25610






