- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ దాడి.. అమెరికా దంద్వనీతికి పరాకాష్ట!
ఇరాన్‌పై యుద్ధానికి దిగాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు ప్రకటించిన ట్రంప్ రెండు

ఇరాన్‌పై యుద్ధానికి దిగాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు ప్రకటించిన ట్రంప్ రెండు రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌పై దాడికి దిగి ద్వంద్వనీతికి పరాకాష్టగా నిలిచారు.. ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని ద్వారా అమెరికా మాట మీద నిలబడని దేశంగా, నైతికతను తుంగలో తొక్కే శక్తిగా చరిత్రకెక్కింది, ‘మాడ్ మాన్ పాలసీ' అని పేరు పొందిన పాత అమెరికన్ వ్యూహానికి ఇది సరైన ఉదాహరణ..
ఈ దాడిలో ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా బీ-2 స్టెల్త్ బాంబర్లతో దాడులు చేసింది. ఫోర్డా, నటాంజా, ఇస్ఫహాన్ వంటి కేంద్రాలు నిశ్చిత లక్ష్యాలుగా మారా యంటే, ఇది కాకతాళీయంగానో, అప్పటికప్పుడో తీసుకున్న నిర్ణ యం కాదని, ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా చే పట్టిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ద చర్య అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇది రెండు దేశాల జగడం కాదు..
అమెరికా అబద్దాలు చెప్పి ఎదుటి వారిని నమ్మించడం, ముందే నిర్ణయం తీసుకుని కొన్ని రోజుల్లో, వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి, ప్రత్యర్థి ఊపిరి తీసుకునేలోపే దాడికి తెగబడడం లాంటి అనైతికతకు పాల్పడడం అమెరికాకే సాధ్యం. ఇది కేవలం ఒక బాంబింగ్ దాడి కాదు.. ఇది విలువలపై దాడి. ఇది అంతర్జాతీ య సమతౌల్యంపై దాడి. ఇది మౌలిక మానవ హక్కులపై దాడి. ఈ పరిణామాలపై మనం కనీసం మౌనంగా ఉండకుండా ప్రశ్నించే ధైర్యం, విశ్లేషించే స్పష్టత, శాంతికి ప్రాధాన్యతనిచ్చే చైతన్యం కనబరిచే సమయం ఇది. ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్‌పై గగనతల దాడులకు దిగినప్పుడే, ఇజ్రాయిల్‌కు అమెరికా మద్దతు ఉందన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు అమెరికా స్వయంగా రంగంలోకి దిగి బాంబింగ్ చేయడంతో, అది నిజమేనని తేటతెల్లమైంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య జగడం కాదు, పశ్చిమ సామ్రాజ్య శక్తులు, ప్రతిఘటన శక్తుల మధ్య కొనసాగుతున్న అంతరంగిక సంఘర్షణగా స్పష్టమవుతోంది.
చైనా, రష్యా మద్దతు ఆ దేశానికే..
ఈ దాడిపై రష్యా, చైనా కూడా తీవ్రంగా స్పందించాయి. రష్యా ఈ చర్యను 'అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా, పౌర ఉద్దేశాలతో కూడిన అణు స్థావరాలపై దాడి'గా ఖండించింది. ‘ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి ఆహ్వానం’ అంటూ రష్యా భద్రతా మండలి ఉపాధ్యాక్షుడు డిమిత్రి మెద్వెడేవ్ పేర్కొన్నారు. చైనా ఈ దాడిని 'మధ్యప్రాచ్య స్థిరత్వాన్ని భంగపరిచే ప్రమాదకర మలుపు' గా అభివర్ణించింది. శాంతి, ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని దాడులకు స్వస్తి పలకాలని సూచిస్తూనే, అలా జరగని పక్షంలో తమ మద్దతు ఇరాన్‌కేనని స్పష్టం చేశాయి. ఈ దాడి తర్వాత అంతర్జాతీయ ముడిచమురు ధరలు అమాంతం పెరగడం ప్రారంభమైంది. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ఇది కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకూ సవాలుగా మారే అవకాశం ఉంది.
ఈ దాడిని ఖండించకపోతే..
అంతర్జాతీయంగా శాంతి, న్యాయం, విలువలు ఇప్పటికీ మాటలకే పరిమితమై ఉన్నాయన్న వాస్తవాన్ని ఈ దాడి మరోసారి గుర్తుచేసింది. ఐక్యరాజ్యసమితి స్పందన కూడా ఆశాజనకంగా లేదు. జూన్ 20న భద్రతా మండలి ఈ సంఘర్షణపై సమావేశమైనా, స్పష్టమైన తీర్మానం వెలువడకపోవడం, ఇరాన్ విజ్ఞప్తులపై తక్షణ చర్యలు లేకపోవడం, ఈ సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది భవిష్యత్‌లో మరిన్ని దాడులకు మార్గం సుగమం చేసేలా కని పిస్తోంది. సామ్రాజ్యవాద ధోరణులపై ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటే, శాంతికి చరమగీతం పాడినట్లే అవుతుంది. ఈ దాడిని ఖండించకపోతే మన మౌనం మన భవిష్యత్‌కు శవపేటికగా మారుతుంది. ప్రపంచం మళ్లీ ఒక విభజిత శకం వైపు ప్రయాణిస్తుంది. ఐక్యత, న్యాయం, భౌగోళిక సమతుల్యత అనే విలువలు కేవలం గ్రంథాలకే పరిమితం కాకుండా, వాటికి ఆచరణీయ రూపమివ్వాల్సిన అవసరం ఇప్పుడు మరింత అత్యవసరం అయింది. ఈ పరిణామాలపై మనం మౌనంగా ఉండకుండా ప్రశ్నించే ధైర్యం, విశ్లేషించే స్పష్టత, శాంతికి ప్రాధాన్యతనిచ్చే చైతన్యం కనబరిచాలి. ప్రపంచం మళ్లీ అంధకారంలోకి జారకూడదంటే, ప్రజల బాధ్యతే దీపంగా మారాలి.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645






