- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ యునెస్కో గుర్తింపు మన సంస్కృతికి దక్కిన గౌరవం!
ప్రపంచవ్యాప్త విసృతి పొందిన సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు యునెస్కో గుర్తింపు లభించింది.

ప్రపంచవ్యాప్త విసృతి పొందిన సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు యునెస్కో గుర్తింపు లభించింది. భారతదేశ వారసత్వ ప్రతీకగా భావించే భగవద్గీత, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి అరుదైన గౌరవం సంప్రాప్తించింది. ప్రాచీన వారసత్వ సంపదలను భద్రపరిచే ఐక్య రాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి తాజాగా చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా యునెస్కో సంస్థ దీనిని వెల్లడించింది.
మానవ ఔన్నత్యానికి దోహదపడి..
భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించడమైంది. దీంతో ఇంతవరకు మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. 'భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ మానవ దృక్పథానికి, జీవన విధానానికి పునాదులుగా భాసిల్లుతున్నాయి. మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు చేసుకోవడం విశేషం. శతాబ్దాలుగా మానవ ఔన్నత్యానికి దోహదపడిన ఈ రెండు ఉద్గ్రంధాలను నిక్షిప్తం చేయడమంటే కాలాతీత విజ్ఞానాన్ని సైతం పుణికి పుచ్చుకునే ప్రక్రియగానే స్వీకరించాలి. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందనడానికి నిదర్శనం నేటి గుర్తింపే.
వేల శతాబ్దాలుగా..
ఈ గ్రంథం వేల శతాబ్దాలుగా మన నాగరికత ఔన్నత్యాన్ని వివరించి, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. యుద్ధ రంగంలో సోదరులు, గురువులు, బంధు జనులందరినీ చూసి ధనుర్భాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి బోధ మానవ వర్తన, వికాసానికి మెచ్చుతునక. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే విధానం రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు. భగవద్గీతను కేవలం ఒక మతగ్రంథంగా ఎవరూ చూడరు.. అదొక కర్తవ్య బోధ మాత్రమే. భరత నాట్యకళ అంటేనే ప్రపంచమంతా మెచ్చే శాస్త్రం. వీటిని ప్రపంచ వారసత్వ సంప్రదాయాలుగా యునెస్కో గుర్తించడమంటేనే భారతీయ విలువలకు, తత్వబోధకు, కళా కౌశల శాస్త్రానికి ఇచ్చిన సమున్నత గౌరవంగా భావించవచ్చు.
ఎప్పుడో గుర్తింపు రావాల్సింది!
ప్రపంచ దేశాలకు భారతీయతను పరిచయం చేసే ప్రక్రియ ఈనాడే మొదలు కాలేదు. కేవలం అర్జునుడి సందేహాలకు, సందిగ్ధానికి ఓ మేలుకొలుపుగా ఉండేవి. గీత పుట్టిన నాడే సర్వోన్నత స్థాయిలో ప్రపంచానికి తత్వ శాస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మానవునిలో ఉన్న భ్రమలను తొలగించే నీతి నియమాల పాఠ్యాంశంగా ప్రాచుర్యం పొందింది. అందుకే భగవద్గీత ఎన్నో ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో అధ్యయన శాస్త్రంగా భాసిల్లుతోంది. ఈ గుర్తింపు ఏనాడో రావాల్సి ఉంది. ఇప్పటికైనా ఇలాంటి గుర్తింపు సబబే! విభిన్న సంస్కృతుల మేళవింపు కలిగిన ఈ దేశ పరిస్థితుల్లో నాట్యకళ, గీతా పఠనం చెక్కుచెదరకుండా ఆదరిస్తుండడం విశేషమే. అందుకే అవి ఈనాటి విశ్వకళా రాజసాలుగా వినుతికెక్కాయి. వీటిని మరింత విస్తృత స్థాయిలో భవిష్యత్త్ తరాలకు తెలియచేసేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. వాటి వైశిష్టతలను భరత జాతికి పునరంకితం చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవడం అవసరం.
సభావట్ కళ్యాణ్
90143 22572






