ఈ నాయకులా.. భవిష్యత్ తరాలకు దిక్సూచి!

by Ravi |   (  Updated:2025-07-23 01:15:40  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల తిట్ల వ్యవహారం బహుభాషా కోవిదులను తలపిస్తుంది. కొత్త తిట్లతో వెరైటీ వంటకాలు వడ్డిస్తున్నట్లున్న

ఈ నాయకులా.. భవిష్యత్ తరాలకు దిక్సూచి!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల తిట్ల వ్యవహారం బహుభాషా కోవిదులను తలపిస్తుంది. కొత్త తిట్లతో వెరైటీ వంటకాలు వడ్డిస్తున్నట్లున్న ఈ తతంగం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏ నాయకుని నోట చూసినా తిట్ల దండకమే తాండవిస్తుంది. ప్రతిపక్షమా, స్వపక్షమా అని పక్కన పెడితే బూతు పురాణం మాత్రం బహిరంగ నగ్నసత్యంగా జడలు విదుల్చుతుంది.

ఈ ప్రభావం ఎక్కడిదాకా వెళ్లిందంటే చిన్నారులు వేసుకునే సెటైర్ల నుండి, రచ్చబండ దగ్గర అవ్వలక్కల ముచ్చట్లలో కూడా ఈ వ్యాఖ్యలే మాట్లాడే అంతగా పెరిగి పోయింది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో ప్రతీ నోటి నుంచి రాజకీయ నాయకుల తిట్ల పురాణం జీవితంలో భాగస్వామ్యం అయిదంటే ఈ రాజకీయ బూతు రచ్చ భవిష్యత్ కాలంలో ప్రమాద ఘంటికలు మోగిస్తూ నగ్న ప్రదర్శన చేయడమూ తథ్యమన్న మాటలు వినిపిస్తున్నాయి.

ప్రజాప్రతినిధుల మాటలేనా ఇవి?

నీచుడు, నికృష్ణుడు, పెండ పురుగు, ఏం పీకినవ్, నువ్వు పీకేదేంది అసలు మగాడివేనా? అయితే నిరూపించుకో చీక టి దొంగ, గజదొంగ, ఎన్ని ఫీట్లున్నవ్, చిల్లర దొంగ, చీకటి బతుకు, కిట్టీ ఆంటీ, చెప్పుతీసుకొని కొడతా, అంతర్రాష్ట్ర దొంగ, సంచులు మోసే దొంగ, చీకట్లో కాళ్లు పట్టేటోడు, హౌలా, లోఫర్, సన్నాసి, నీకేం నొచ్చింది, వాడి మన్నూ, మశానం, వానయ్య, వాని తాత, పెద్ద పోటుగాడా, ఫుట్ బాల్ ఆడుతా, ఎగరేసి తంతరు, లుచ్చా, లఫంగీ, గుడ్లు పీకుతా, గోటీలాడుతా, వాత పెడుతా, నీయయ్యనడుగు, వానయ్యనడుగు, బందిపోట్లు, దండుపాళ్యం ముఠా, బూట్లూ నాకడం, గోడలు దూకడం, నడ్డివిరగ్గొడతం, సిగ్గుందా, శర ముందా, గుండెల్లో నిద్రపోతా, నిద్రపోనీయా, రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ ప్రజాప్రతినిధుల నోటి నుంచి జాలువారే ఆణిముత్యాలు భవిష్యత్ తరాలకు, ప్రస్తుత పోకడకు అద్దం పడుతున్నాయి. సమాజ హితమన్నది వీరి వ్యాఖ్యల్లో లేకపోవడమే కాదు.. రాజకీయం కోసం, అధికారం కోసం, పదవుల కోసం టార్గెటెడ్ మాటలు సమాజంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. పదవుల కోసం వ్యక్తిత్వ హననంతో పాటు సమాజ గౌరవ ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగే పరిస్థితి ఎవరు కలిగిస్తున్నారన్న చర్చ క్షేత్రస్థాయిలో నడుస్తున్నది.

శాశ్వత శత్రువులు, మిత్రులుంటారా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని.. ఎవరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా కలుసుకునే అవకాశమున్నదన్నదనేది జగమెరిగిన సత్యం. అధికారం కోసం పార్టీలు మారిన ఘన చరిత్ర కలిగిన ఘనాపాఠీలున్న తెలుగు రాష్ట్రాల్లో పార్టీలో మొదటినుంచి ఉన్నవారెవరూ, అధికారం వచ్చాక కొత్తగా అధికార పార్టీలో చేరినవారెవ్వరూ అన్న విషయం తెలియనంతగా ఆ పార్టీల్లో కలిసి పోతున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ జాఢ్యం మరింత పెరిగి వటవృక్షంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. సీఎంలు మొదలు మంత్రులు సహా గల్లీ నాయకుని వరకు బూతు పురాణం జలజలా జాలు వారుతోంది. లింగ భేదం లేదు. చిన్నా పెద్దా లేదు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. శాసన వ్యవస్థల మీద అంతకన్నా లేదు. ఉన్నతాధికారులు, ప్రజలన్నా లెక్కలేదు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. వీరేనా భవిష్యత్ తరాలకు దిక్సూచిలా ఉండేది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఇంత దిగజారుడు గతంలో లేదు..

గతంలో కొందరు సీఎంలను చూస్తే ఎంతో హుందాగా కనిపించేవారు.. మాటల్లో స్పష్టత, దిశానిర్దేశం, భవిష్యత్ సంకల్పం కనిపించేది. రాష్ట్రాల ప్రగతి, భరోసా మీదే దృష్టి ఉండేది. వీరికి వీరే బాస్‌లు అయినా ఎక్కడా ఇంతగా దిగజారి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ నేటి రాజ కీయాలు కలుషితం అయ్యాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక పార్టీ అధి నాయకుడి మెప్పు కోసం ఇష్టమొచ్చినట్టు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ స్థానాల్లో ఉన్నవారు సైతం వ్యక్తిగత దూషణలు విప రీతంగా చేస్తున్నారు..

వివాదాలేనా.. పరిష్కారాలున్నాయా?

రాజకీయ నాయకులు, పార్టీలు చేసే తిట్ల రాజకీయం నిజానికి వివాదాస్పద చర్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్రాల ప్రజలు వీరి వ్యాఖ్యలను గమనిస్తుంటారని తరచూ ఈ తిట్ల విషయంలో ప్రజల్లో చర్చలు జరుగుతుంటాయని గమనించాలి. రెండు రాష్ట్రాల్లో తిట్ల రాజకీయం ఒక భాగమైంది. కొందరు ఈ తిట్లను వ్యతిరేకించవచ్చు మరికొందరు సమర్థించవచ్చు. కానీ అంతిమంగా ప్రజల్లో అభద్రతతో పాటు అనిశ్చిత ఏర్పడే అవకాశం లేకపోలేదు. ప్రజల్లో వస్తున్న మార్పును ఆహ్వానించాలి. రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలి. వాడుతున్న భాష, బాడీ లాంగ్వేజ్ ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతున్నదో ఆలోచించాలి. తాను మాట్లాడే మాటలు సమాజానికి ప్రయోజనకరమా లేదా నష్టదాయకమా అనేది తెలుసుకోవాలి. ప్రజల మధ్య, వర్గాల మధ్య, తమ పార్టీల నాయకుల మధ్య విబేధాలు సృష్టి స్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు గ్రహించాలి.

తిట్లు గెలిపించవు!

ప్రజలను, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రవర్తించి, ఆ వ్యాఖ్యలను అధికార పార్టీలపై ఆపాదించడం, మాటకు మాట, చేతకు చేత అంటూ కౌంటర్ వ్యాఖ్యలు తగ్గించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంతో కూడిన పాలనను ప్రజలు హర్షిస్తారు. నాయకులు చేసే మంచి పనులను గౌరవిస్తారు. స్వాభిమానంతో బతికే ఏ వ్యక్తీ ఈ తిట్ల దండకాన్ని హర్షించడని, హుందాతనాన్ని మాత్రమే గౌరవిస్తారని తెలుసుకోవాలి. రాజకీయాల్లో వివాదాలు లేకుండా పరిష్కారం కోసం అన్వేషించే చర్యలు తీసుకోవాలి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం తన పాత్రను నిజాయితీగా నిర్వర్తించాలి. నోటి దురుసు తగ్గించుకుని ఒదిగి ఉంటే భవిష్యత్ తరాలకు బాటలు వేయగలమని నిరూపించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. తిట్ల దండకమూ ఆగుతుంది.

-సాగర్ దువ్వ

80966 77477

Next Story