- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివే..
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉన్నాయి. గత దశాబ్దంలో ఆధిపత్యం వహించిన భారత రాష్ట్ర సమితి

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉన్నాయి. గత దశాబ్దంలో ఆధిపత్యం వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పలుకుబడి తగ్గుముఖం పట్టడం, కాంగ్రెస్ అధికారం లోకి రావడం, బీజేపీ రాష్ట్రంలో ఒక ప్రధాన శక్తిగా ఎదగడంతో రాజకీయ సమీకరణలు సరికొత్త రూపం సంతరించుకున్నాయి. ఈ త్రిముఖ పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రజలకు ఎక్కువ రాజకీయ ప్రత్యామ్నాయాలను అందిస్తూ, పార్టీల బాధ్యతను పెంచే అవకాశం ఉంది. అదే సమయంలో అస్థిరతకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెరదించి, తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఒకవైపు ప్రజాకర్షక పథకాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మరోవైపు అంతర్గత, బాహ్య సవాళ్లు కూడా ఆ పార్టీకి ఎదురవుతున్నాయి. అధికార బలం ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలం. ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండటంతో విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి, ప్రజలకు నేరుగా చేరువ కావడానికి అవకాశం లభించింది.
ప్రజా పాలన బాటలో కాంగ్రెస్
ఎన్నికల విజయానికి మూలస్తంభమైన ఆరు గ్యారెంటీల అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఇప్పటికే ప్రారంభించి ప్రజల్లో సానుకూలతను నిలుపు కుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్య క్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే భావన కల్పిస్తున్నారు. ఆరు గ్యారెంటీల పూర్తిస్థాయిలో అమలు, కాంగ్రెస్ ప్రతిష్టకు అత్యంత కీలకం. అయితే కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఉండే అంతర్గత కుమ్ములాటలు తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలైన కాంగ్రెస్ నేతలు, వలస వచ్చిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల పంపకాల విషయంలో సీనియర్లలో అసంతృప్తి ప్రభుత్వ స్థిరత్వానికి సవాలుగా మారవచ్చు.
బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి సంఖ్యాబలాన్ని పెంచుతున్నా, వారిని సంతృప్తి పరచడం పెద్ద సమస్యగా మారింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి అసలైన పరీక్ష. ఈ ఎన్నికల్లో గెలుపు, ప్రభుత్వ పని తీరుపై ప్రజల తీర్పుగా భావించబడుతుంది. ఈ ఎన్నికలే కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా నిలవనున్నాయి.
ప్రమాదంలో బీఆర్ఎస్ భవిష్యత్తు
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన బీఆర్ఎస్, ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వరుస ఓటములు, అంతర్గత కలహాలు, న్యాయపరమైన చిక్కులు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తు న్నాయి. వరుస ఓటములు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికా రం కోల్పోవడం, ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఓటములతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లో కొంత ఒత్తిడి నెలకొంది. పార్టీ శ్రేణుల్లో నిరాశ, ఓటముల తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీకి దూరంగా ఉండటం ఇతర పార్టీలలోకి వెళ్లడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ తమ పునరుజ్జీవానికి ఒక అవకాశంగా భావిస్తోంది.
ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివే..
క్షేత్రస్థాయిలో పార్టీకి ఇంకా పట్టు ఉందని, ఈ ఎన్నికల్లో గెలిచి బలాన్ని నిరూపించుకోవాలని ఆశిస్తోంది. అయితే, పార్టీలోని అంతర్గత కలహాలు ఈ అవకాశాలకు గండి కొట్టేలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి అంశాలపై తీవ్ర ఆరోపణలు బీఆర్ఎస్‌పై నైతికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా పార్టీ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన, సొంత నాయకులను నమ్మని పార్టీగా ముద్రపడే ప్రమాదం ఉంది. తదుపరి విచారణ ఫలితాలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఒక అగ్నిపరీక్ష లాంటివి. ఈ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో పార్టీ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.
బీఆర్ఎస్ బలహీనతే బీజేపీ బలం
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికలలో 8 స్థానాలు గెలుచుకొని, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో సమానంగా నిలిచి సంచలనం సృష్టిం చింది. ఈ విజయం, ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదలతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రదర్శన బీజేపీని రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా స్థిరపరచడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, అంతర్గత సవాళ్లు పార్టీ పురోగతికి అడ్డంకులుగా మారుతున్నాయి. నాయకత్వ విభేదాలు, సంస్థాగత సమన్వయ లోపాలు, స్థానిక నాయకుల మధ్య పోటీలు వంటి సమస్యలు బీజేపీని కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడటం బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తోంది. బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించి, కాంగ్రెస్‌కు ఏకైక, బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడానికి బీజేపీకి మార్గం సుగమమైంది.
తెలంగాణలో బీజేపీకి కొన్ని పట్టణ ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన స్థానం ఉంది, కానీ గ్రామస్థాయిలో బలమైన కేడర్ వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం వల్ల కలిగిన అసంతృప్తి వంటి అంశాలు పార్టీ ఐక్యత, భవిష్యత్ విజయాలకు అడ్డంకులుగా ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి ఒక లిట్మస్ టెస్ట్‌గా నిలుస్తాయి.
రాచకొండ సాగర్
70958 22883






