లైంగిక సమ్మతిపై.. మార్పు రావాలి!

by Ravi |   (  Updated:2025-09-03 00:45:57  IST  )

భారత క్రిమినల్ వ్యవస్థలో ‘సమ్మతి’ అనే భావనకు ప్రత్యేక స్థానం ఉంది. లైంగిక సంబంధాల్లో సమ్మతి అనేది వ్యక్తి స్వేచ్ఛ

లైంగిక సమ్మతిపై.. మార్పు రావాలి!
X

భారత క్రిమినల్ వ్యవస్థలో ‘సమ్మతి’ అనే భావనకు ప్రత్యేక స్థానం ఉంది. లైంగిక సంబంధాల్లో సమ్మతి అనేది వ్యక్తి స్వేచ్ఛ, గౌరవానికి మూలస్తంభం. అయితే, చిన్నారి బాలికల విషయంలో ఈ భావన క్లిష్ట రూపం దాల్చుతుంది. ఎందుకంటే చట్టం ప్రకారం, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న బాలిక ఇచ్చే సమ్మతి చట్టపరంగా చెల్లుబాటు కావడం లేదు.

చట్టపరమైన నేపథ్యం..

భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 63 ప్రకారం, 18 ఏళ్ల లోపు బాలికతో, ఆమె సమ్మతితో అయినా, లైంగిక సంబంధం కలిగితే అది ‘Statutory Rape’గా పరిగణించబడుతుంది. అంటే చట్టం ఇక్కడ బాలిక స్వేచ్ఛను అంగీకరించదు. ఎందుకంటే ఆమె వయస్సు పరంగా పరిపక్వతకు చేర లేదని భావిస్తుంది. ప్రస్తుత కాలంలో యువతరం త్వరగా మానసిక పరిపక్వత సాధిస్తున్నప్పటికీ, చట్టం మాత్రం వయస్సు పరిమితిని కఠినంగా పాటిస్తోంది. దీంతో 16–18 ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు యువతీ యువకులు పరస్పర సమ్మతితో సంబంధం పెట్టుకున్నా, అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితి ‘పిల్లల రక్షణ’, ‘వారి స్వేచ్ఛ’ మధ్య ఒక విభేదాన్ని సృష్టిస్తోంది.

లైంగిక స్వేచ్ఛ vs రక్షణ

2012లో వచ్చిన POCSO చట్టం ప్రకారం, 18 ఏళ్ల లోపు వారిని పిల్లలుగా పరిగణించి, వారి పట్ల సాగించే లైంగిక నేరాలపై కఠిన శిక్షలు విధిస్తోంది. ఇది బాలల రక్షణలో కీలకమైన అడుగే అయినప్పటికీ, ప్రేమ సంబంధాల్లో ఉన్న మైనర్లకు ఇది ఆపదగా మారే అవకాశమూ ఉంది. 17 ఏళ్ల బాలిక, 19 ఏళ్ల యువకుడితో పరస్పర సమ్మతితో ఉన్నా, ఆ సంబంధం చట్ట విరుద్ధంగా పరిగణించబడుతోంది. దీనివల్ల యువకులు ‘రేప్ కేసులు’ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. లైంగిక స్వేచ్ఛ (Sexual Autonomy) అనేది వ్యక్తిగత హక్కు. కానీ, మైనర్ల విషయంలో చట్టం, శారీరక మానసిక పరిపక్వత, భద్రత, దుర్వినియోగం నివారణను ముఖ్యంగా పరిగణిస్తుంది. ఇది మంచిదే అయినప్పటికీ, కొన్నిసార్లు ఇది బాలికల స్వచ్ఛంద నిర్ణయాలను నిరాకరించే పరిస్థితి తలెత్తుతుంది.

న్యాయస్థానాల అభిప్రాయాలు..

అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని సందర్భాల్లో చట్ట పరమైన వయస్సు పరిమితిని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించాయి. కొంతమంది న్యాయమూర్తులు, ముఖ్యంగా 16–18 ఏళ్ల మధ్య ఉన్నవారి విషయంలో, లైంగిక సంబంధాలను ‘అత్యాచారం’ కింద కాకుండా ప్రత్యేక నిబంధనల కింద పరిగణించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా, మైనర్ల బాల బాలికల పరస్పర సమ్మతితో ఉన్న సంబంధాలను సానుకూలంగా పరిగణించే సూచనలు చేశాయి.

లైంగిక విద్య అవసరమే!

సున్నితమైన చట్ట సవరణలు 16–18 ఏళ్ల మధ్య ఉన్న యువత పరస్పర సమ్మతిని పరిగణనలోకి తీసుకునే విధంగా మార్పులు అవసరం. అలాగే లైంగిక విద్య పాఠశాల స్థాయి నుంచే తెలియజేస్తూ ఆరోగ్యకరమైన లైంగిక అవగాహన అందించడం అవసరం. దీంతో పాటు పిల్లల రక్షణ, స్వేచ్ఛ సమతుల్యం చట్టం రక్షణతో పాటు, స్వేచ్ఛను కూడా గౌరవించాలి. పిల్లల సమ్మతి, స్వేచ్ఛ, రక్షణ ఈ మూడింటి మధ్య సమతుల్యం కల్పించడం సమాజం, చట్టం ముందున్న ప్రధాన సవాలు.. చిన్నారి బాలికల విషయంలో వయస్సు పరిమితి ఒక రక్షణ గోడే అయినప్పటికీ, అది వారి స్వతంత్రతను పూర్తిగా మూసివేయకూడదు. భవిష్యత్తులో, చట్టం మరింత సున్నితంగా, సమాజ మార్పులకు అనుగుణంగా మారాలి.

- అనూరాధ నాయుడు,

831 758 8344

Next Story