న్యాయంగా చేయాల్సిన పనులకు కూడా చట్టం ఉండాల్సిందే..

by Ravi |   (  Updated:2025-09-14 00:45:12  IST  )

ఇది తాతల నాటి కథ. తెల్లవాడి పాలనలో దేశం ఉన్నప్పటిది. ఇంటి ముందు కాలువ శుభ్రం చేస్తున్న వ్యక్తులతో మా తాతగారి అమ్మగారు

న్యాయంగా చేయాల్సిన పనులకు కూడా చట్టం ఉండాల్సిందే..
X

ఇది తాతల నాటి కథ. తెల్లవాడి పాలనలో దేశం ఉన్నప్పటిది. ఇంటి ముందు కాలువ శుభ్రం చేస్తున్న వ్యక్తులతో మా తాతగారి అమ్మగారు ‘బాగా చెయ్ బాబూ! ఆవకాయ బద్దలిస్తాను’ అనగా విన్న మా తాతయ్య, ‘ఊరుకో అమ్మా! వాళ్లు పనివాళ్లు కారు. కాంగ్రెస్ పార్టీ మనుషులు’ అన్నారట. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తే, కాంగ్రెస్ పక్షం పిలుపు మేరకు స్వచ్ఛంద సేవకులు ఆ విధులు నిర్వహిస్తున్నారన్న మాట. ఇప్పటి తరహా వేరు కదా!

నగరపాలక సంస్థ వారి లారీ రోజూ చెత్తను సేకరించే‌ పనితో బాటు, ‘ఇళ్ల ముందర చెత్తను పారవేయడం నేరం. అలాచేస్తే శిక్ష విధించబడుతుంది.’ అన్న ప్రకటన కూడా వినిపిస్తుంది. రిజర్వేషన్లపై పిల్ ఉద్యోగ, విద్యావకాశాలలో కేటాయింపుల (రిజర్వేషన్స్) విషయమై ఇటీవల మనదేశ ఉన్నత న్యాయస్థానం ముందున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి చదువుతుంటే నాకా మాటలే గుర్తొచ్చాయి.

రిజర్వేషన్లపై తేనెతుట్టెను కదిపి..

ఆ వాజ్యంలో వాదుల వాదన ఏమంటే.. ‘గత 75 ఏళ్లుగా అమలవుతున్న కేటాయింపుల వల్ల ఆయా వర్గాల్లోని ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కొద్దిమంది మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. నిజంగా సాయం అవస‌రమైన అత్యంత నిరుపేదలు అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు’. అందువలన, వారి విన్నపం ఏమంటే... ‘ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూనే, దానిని మరింత మెరుగుపరిచి, ఆయా వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మొదటి ప్రాధాన్యం లభించడానికి వీలుగా ఆర్థిక ప్రాతిపదికను చేర్చాలి. అలా చేయడం రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణాలను బలోపేతం చేయడమే ఔతుంది’. ‘అమ్మో!’ అని గుండె మీద చెయ్యి వేసుకోండి. ఆ వ్యాజ్యం స్వీకరించిన న్యాయమూర్తులు సూర్యకాంత్, జాయ్‌ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం. అక్టోబర్ 10వ తేదీలోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ, ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వాదుల తరఫు న్యాయవాదికి సూచించింది.

క్రిమీలేయర్‌కి కోటా వద్దా?

ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించాలి. గత సంవత్సరం‌ అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, రిజర్వేషన్ల కేటాయింపుల ప్రయోజనం కోసం దళితులను ఉప-వర్గాలుగా విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని 2005లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును, 6-1 సంఖ్యాబలంతో కొట్టివేసింది. ఈ తీర్పుతో రాష్ట్రాలు ఎస్సీలకు, ఎస్టీల్లోని మరింత అణగారిన వర్గాలకు ప్రత్యేక కోటాలు మంజూరు చేయడం ప్రభుత్వాలకు సాధ్యమైంది. ఈ ఉత్తర్వును జారీచేసిన న్యాయమూర్తులలో నలుగురు, మరొక అడుగు ముందుకు వేసి, షెడ్యూల్ కులాలు, తెగలలో సంపన్న శ్రేణిని (క్రిమీలేయర్) కేటాయింపుల నుండి మినహాయించాలని నిర్దేశించారు. ఆ నలుగురు న్యాయమూర్తులలో ఒకరైన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ తన తీర్పు వెనుక కారణాన్ని గోవా ప్రధాన న్యాయస్థానం న్యాయవాదుల సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విశద పరుస్తూ ఇలా‌ అన్నారు.. ‘ముంబై లేదా ఢిల్లీలోని ఉత్తమ పాఠశాలల్లో చదువుతున్న ముఖ్య కార్య దర్శి కొడుకును, గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న మేస్త్రీ లేదా వ్యవసాయ కూలీ బిడ్డతో సమానం చేయవచ్చా’ అనేది నన్ను నేను వేసుకున్న ప్రశ్న.

మీకంటే ఎందులో తక్కువా? అంటూ..

ఈ నేపథ్యంలో చట్టాలు, సవరణలు ప్రక్కన పెట్టి, వెనకటితరం కథొకటి చెప్తాను. అది 1995 కార్మిక రాజ్య బీమా సంస్థ పశ్చిమబెంగాల్ ప్రాంత కార్యాలయం. ‘దయచేసి చెప్పండి రావ్! ఏ విషయంలో మీకంటే నేను తక్కువ? అడిగారు విజయ్ కుంభారే. వారేమో నిర్దేశకుడు. నేనేమో సంయుక్త నిర్దేశకుడిని. నిరుత్తరుడనయ్యాను. ఓ నాలుగు రోజులు వెనక్కి వెళ్తే... కుంభారే ఏకైక పుత్రిక, మా పెద్దమ్మాయి ఇద్దరు హైదరాబాదులో ఎంసెట్ రాత పరీక్ష రాయాలి. ముందు రోజు ఎంత వెతికినా ఆ అమ్మాయి హాల్ టికెట్ కనబడలేదు. నా స్నేహితుడొకరు వారి స్కూటర్ మీద ఆమెను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లి, డూప్లికేట్ హాల్ టికెట్ సాధించుకుని వచ్చారు. వచ్చారే గాని ఏదో చెప్పాలన్న ఉబలాటంతో ఉన్నారు. మేమిద్దరమే ఉండడం తటస్థించగానే, ‘కుంభారే షెడ్యూల్ తెగ అధికారి కదా, వారి అమ్మాయి హాల్ టికెట్ కేటాయింపులేని విద్యార్థులకు ఇచ్చేదిగా ఉందేమిటి? ఇందువలన ఆమెకు వచ్చే ర్యాంక్‌కి మంచి కళాశాలలో ఉచిత ప్రవేశం రాకపోవచ్చు కదా?’ అని ఆశ్చర్యపడ్డారు. ఆ ప్రశ్నకు జవాబే పైన పేర్కొన్న కుంభారే ఎదురు ప్రశ్న? కాలం అలా ఉంది. స్వతంత్ర దేశం కదా. మనం న్యాయంగా చేయవలసిన పనులకు కూడా చట్టం ఉండాలి. ఆ చట్టాలకి ఎన్ని తూట్లు పొడుస్తున్నామో అది వేరే విషయం.

కొసమెరుపు: కుంభారే అమ్మాయి కలకత్తా ఐ.ఐ.ఎం.లో చదువుకుని, హెచ్.ఎస్.బి.సి. ఇండియా డైరెక్టర్ స్థాయికి ఎదిగారు..

- మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story