- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహంకారానికి నోబెల్ లేదు.. ట్రంప్ గర్వభంగం!
‘గర్వం సర్వం చెరచుననే నానుడి’ అమెరికా అధ్యక్షుడికి అన్వయించక తప్పదు. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు, స్వంత దేశంలోని ప్రజలే చీత్కరించుకుంటున్న తరుణంలో మూలిగే నక్కపై

‘గర్వం సర్వం చెరచుననే నానుడి’ అమెరికా అధ్యక్షుడికి అన్వయించక తప్పదు. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు, స్వంత దేశంలోని ప్రజలే చీత్కరించుకుంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైనది. హమాస్- ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చిన ఆనందంలో ఉన్న ట్రంప్ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. నోబెల్ శాంతి బహుమతి అందని ద్రాక్షలా మారింది. నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలో ఒక అరుదైన గౌరవం. ఈ బహుమతి గెలిచి అమెరికా ఖ్యాతిని పెంచిన నాయకుల సరసన నిలబడాలని ఉవ్విళ్లూరిన ట్రంప్ ఆశలు అడియశాలు అయ్యాయి. ఈ శాంతి బహుమతిని బెదిరించి సాధించడం కాదు, సమస్యను శోధించి, చేధించి విజయం సాధించడంలోనే నిజమైన అర్హత ప్రస్ఫుటిస్తుంది. ఈ విషయంలో వెనిజులా ఉక్కు మహిళ విజయం సాధించారు. దీంతో డోనాల్డ్ ట్రంప్‌కు గర్వభంగమైనది. ఈ నోబెల్ ప్రకటించడంలో ఎలాంటి వత్తిళ్లకు తలొగ్గకుండా నిర్ణయం తీసుకున్న నోబెల్ కమిటీ ప్రశంసార్హత సాధించింది. అయితే ట్రంప్‌కు ఈ బహుమతి దక్కకపోవడంతో వైట్ హౌస్ ఇది రాజకీయ ప్రేరిత చర్యగా పేర్కొనడం విడ్డూరం. వెనిజులాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం మారియా కొరినా మచాడో ఉద్యమిస్తున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. హక్కుల కోసం, నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించాలనే ధ్యేయంతో ఉద్యమ నాయకురాలిగా, వెనిజులా పార్లమెంటు సభ్యురాలిగా శాంతియుత పోరాటం చేస్తున్న ఈమె వెనిజులా చరిత్రను తిరగరాయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించింది. తన మాట వినని దేశాలకు టారిఫ్‌ల మోతతో, వీసాల భారంతో పీల్చి పిప్పి చేస్తూ తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని విర్రవీగుతూ, అహంతో రెచ్చిపోతూ, తనకే నోబెల్ శాంతి బహుమతి రావాలని వాంఛించిన ట్రంప్ చివరకు నోబెల్ శాంతి బహుమతి సాధనలో విఫలం కావడం ఒక గుణపాఠం.
-సుంకవల్లి సత్తిరాజు
97049 03463






