పెరుగుతున్న పనిగంటల మోతలు..

by Ravi |   (  Updated:2025-07-02 01:00:21  IST  )

దేశంలో పనిగంటల మోతలు మరోసారి వినిపిస్తున్నాయి.. కారణం ఈసారి వేటు సంఘటిత రంగ కార్మికులపైన పడనుండడమే..

పెరుగుతున్న పనిగంటల మోతలు..
X

దేశంలో పనిగంటల మోతలు మరోసారి వినిపిస్తున్నాయి.. కారణం ఈసారి వేటు సంఘటిత రంగ కార్మికులపైన పడనుండడమే.. సులభతర వాణిజ్య విధానం పేరిట ఇప్పటికే కార్మిక చట్టాల అమలు తనిఖీ నీరుగార్చి, కార్మిక చట్టాలను క్రోడీకరించి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక కార్మికుల పనిగంటలు పొడిగించే దిశగా పావులు కదపాలని ఆలోచిస్తున్న‌‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న కర్మాగారాల చట్టం ప్రకారం, కార్మికుడిని రోజుకి 9 గంటలు, వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదు. ఏ రోజైనా 9 గంటల కంటే అధికంగా పని చేయిస్తే, అధిక వేతనం చెల్లించాలి. అలా చేసినా రెండు గంటలకి మించి పని చేయించరాదు. అంతేకాదు.. మూడు నెలలలో అధిక పనిగంటలు 75 దాటరాదు. ఈ 12 గంటల కాలవ్యవధిలో ఐదు గంటల తర్వాత కనీసం అరగంట విరామం ఇవ్వాలి..

ఏకధాటిగా ఆరు గంటల పని..

ఇప్పుడు వచ్చిన ఉపద్రవమేమంటే, యాజమాన్యానికీ, కార్మికుడికీ అంగీకారమైతే, ఒక రోజులో 10 గంటలు, అందులో ఏకధాటిగా 6 గంటలు పని చేయించవచ్చు. అధిక పని గంటలు 144 వరకూ ఉండవచ్చు.. దీనికి వ్యతిరేకంగా కొన్ని కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. సంఘటిత రంగంలో నేరుగా యాజమాన్యం నియమించిన కార్మికులతో పాటు కాంట్రాక్టర్స్ లేదా పొరుగు సేవల ద్వారా నియమితులైన కార్మికులుంటారు.. వీరికి కార్మిక సంఘాలు వేరు.. ఇక అసంఘటిత, ఇన్ ఫార్మల్ రంగాలు వేరే ఉన్నాయి.. వీరికి ఉన్న కార్మిక సంఘాలే కొన్ని అవీ నామమాత్రం.. వీరంతా అధిక వేతనం‌ ఊసే లేకుండా రోజుకీ 10 నుండి 12 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇంకా చట్ట రూపం దాల్చని సవరణలను వ్యతిరే కిస్తున్న కార్మిక ఉద్యమాలు ఫలవంతం కావడం సందేహమే..

పనిచేయకపోయినా.. చందా చెల్లించాల్సిందే!

ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలను కార్మిక సంఘాలు శాసించగలగడం గత చరిత్ర..‌ 1992-95 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్ ప్రాంత కార్మిక రాజ్య బీమా సంస్థ సంయుక్త నిర్దేశకుడుగా కలకత్తాలో పని చేసాను. కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ అధికారి ఒకరు "ఓవర్ టైం వేతనాలపైన చందా కడుతూనే ఉన్నాం. కానీ ఓవర్ టైం చేయకుండా చెల్లించిన జీతాల పైన కూడా చందా చెల్లించమంటున్నారు. ఇంత అన్యాయమా?" అని నిల దీసారు.‌ నాకేమీ అర్థం కాలేదు. ఆయనే ముడి విప్పారు.. సంస్థలో గుర్తింపబడిన కార్మిక సంఘంతో యాజమాన్యం ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం నెలకు కొన్ని గంటలు (ఎన్నో గుర్తులేదు) అధిక పని గంటలు పని చేయించాలి.‌ అలా కుదరకపోయినా, పని చేయకపోయినా మిగిలిన గంటలకి అధిక వేతనం చెల్లించాలి. ఎందుకంటే కా.రా.బి. చట్టం ప్రకారం జీతంతో పాటు, కార్మిక సంఘంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేసిన ఇతర నగదు చెల్లింపులు కూడా‌ "వేతనం"గానే పరిగణించబడతాయి.

కార్మిక సంఘాలను కలుపుకుపోతేనే..

గత రెండు దశాబ్దాలకు పైగా క్రమంగా కార్మిక సంఘాలు బలహీనపడడం వాస్తవం. ఇందుకు ముఖ్యకారణం రాజకీయ పక్షాల బి.టీంగా కార్మిక సంఘాలు వ్యవహరించడం. నూతనంగా, ఒక ప్రాంతీయ రాజకీయ పక్షం ఏర్పడినా‌ వారికి విధేయంగా కార్మిక సంఘం అవ తరించడం. ఫలితంగా చీలిక పేలికలైన కార్మిక ఉద్యమం. ఇంకొక ముఖ్య పరిణామం సామ్యవాదం ధ్యేయమని మన రాజ్యాంగం ప్రకటించినా, ఆచరణలో రాష్ట్రాలు, కేంద్రం కూడా సంక్షేమ పెట్టు బడిదారీ మార్గం పట్టడం. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కార్మికుల ఐక్యపోరాటంతో వాటిని అమలు చేయకుండా వెనక్కి తగ్గాయి. ఐతే, కర్ణా టకలో కాంగ్రెస్‌, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాలున్నాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్. ఇంకా చట్ట రూపం దాల్చని సవరణలను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలను ప్రక్కన బెట్టి అసంఘటిత, ఇన్ఫార్మల్ రంగాల కార్మిక సంఘాలను కలుపుకుని కార్మిక శ్రేయస్సు లక్ష్యంగా చేసిన చట్టాల అమలుకు ఐక్యంగా ఉద్య మిస్తే ఫలితం ఉండవచ్చు..

మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story