ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం

by Ravi |

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం
X

అరణ్య సంస్కృతి, గిరిజన సంప్రదాయాలు, ధైర్యం, త్యాగాల గాథలు కలసి రూపుదిద్దుకున్న మహోత్సవమే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ ఉత్సవం, ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది భక్తులను అటవీ గర్భంలోకి ఆహ్వానిస్తుంది. విగ్రహాలకన్నా ప్రకృతినే దేవతగా కొలిచే అరుదైన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ జాతర, తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవం, చారిత్రక పోరాటాల ప్రతీకగా నేటికీ విశ్వవ్యాప్త గుర్తింపును పొందుతోంది.

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ‘దక్షిణ భారత కుంభమేళా’గా పిలుస్తారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచీ దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం 2014లో మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 251 కోట్ల రూపాయల బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఈ నెల 28 నుండి 31 వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహించనున్నారు.

చరిత్ర ప్రకారం..

సమ్మక్క–సారలమ్మలను వనదేవతలుగా పూజించడానికి గల కారణాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన చరిత్ర కనిపిస్తుంది. పూర్వం కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో, పెద్దపులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించిందట. ఆ శిశువును కోయలు తమ గుడారానికి తీసుకెళ్లి పెంచుకున్నారు. ఆ పాప వారి జీవితంలోకి వచ్చినప్పటి నుంచి కోయలకు శుభాలు కలగడంతో, ఆ పాప కొండదేవత అవతారమేనని వారు నమ్మారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. కాకతీయుల కాలంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. మేడరాజు సమ్మక్కను పెంచి పెద్దదిగా చేసి, తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుతో వివాహం చేశాడు. సమ్మక్క–పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.

జాతర నేపథ్యం..

పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉండేవాడు. కరవు కాటకాల కారణంగా ప్రజలు కొన్నేళ్లపాటు శిస్తు కట్టలేకపోయారు. శిస్తు చెల్లించకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో తిరుగుబాటు భావాలు నూరిపోస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధానికి దిగాడు.. అయితే కాకతీయ సేనల దాడిని తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సేనలపై విరుచుకుపడింది. ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో వెన్నుపోటు పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. ఆ తర్వాత ఒక చెట్టుకింద పుట్ట దగ్గర కుంకుమ భరిణి కనిపించిందట. తప్పు గ్రహించిన ప్రతాపరుద్రుడు అనంతరం సమ్మక్క భక్తుడిగా మారి, కోయ రాజులు చెల్లించాల్సిన కప్పాన్ని రద్దు చేసి, రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. అలా ఈ జాతర ప్రారంభమైందని కథనం.

జాతర ఎలా నిర్వహిస్తారంటే..?

జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి వస్తారు. అదే విధంగా కొండాయి నుండి గోవిందరాజును, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును మేడారానికి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి చేరుకుంటుంది. గిరిజన పూజారులు సంప్రదాయబద్ధంగా తల్లిని ఆహ్వానిస్తారు. మూడవ రోజు భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. చివరి రోజు అమ్మవార్లు తిరిగి అడవిలోకి వెళ్లే ‘వనప్రవేశం’ కార్యక్రమం జరుగుతుంది. దీంతో జాతర ముగుస్తుంది. అయితే జాతరకు ముందే రోజుకు లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకుంటుండటం విశేషం.

ప్రభుత్వ దన్నుతో మెరుస్తున్న మేడారం

ప్రపంచంలోనే ఆదివాసీలు, సంపద సృష్టికర్తలు, ఉత్పాదక శ్రామిక వర్గాలు అత్యధికంగా దర్శించుకునే మహా జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం అభివృద్ధి గత ప్రభుత్వాల కాలంలో అరకొరగానే కొనసాగింది. భారీ స్థాయిలో శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టలేదు. ఇప్పుడు చరిత్ర తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. భవిష్యత్‌లో ఏ ఇతర మతాలు ఈ జన జాతరను హైజాక్ చేయకుండా, వారి చిహ్నాలు ఇక్కడ కనపడకుండా, ఆదివాసీ చరిత్రకు శాశ్వతత్వాన్ని సంతరింపచేసింది. 2026 జనవరి 28-31 తేదీల మధ్య మహా జాతర నిర్వహణకు మేడారంను సర్వ సన్నద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మేడారం పరిసరాలన్నీ వృక్ష ఔషధ వైవిధ్య వనంగా మారుతున్నాయి.

మన మూలాలను గుర్తుచేసే జాతర..

సమ్మక్క–సారలమ్మల జీవితం ధైర్యం, త్యాగం, అన్యాయంపై పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది. కఠిన పరిస్థితుల్లోనూ ప్రజల హక్కుల కోసం నిలబడటం, ప్రకృతిని ఆరాధించడం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పోరాడటం వారి జీవితాల ద్వారా తెలుస్తుంది. విగ్రహాలకన్నా ప్రకృతిలో భాగమైన పసుపు, కుంకుమ భరిణెల రూపంలో పూజలందుకోవడం మన మూలాలను గుర్తుచేస్తుంది. మేడారం జాతర భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.

-డా. పోలం సైదులు,

94419 30361

Next Story