- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనిఫైడ్ పెన్షన్ పథకం ఉద్యోగుల భవిష్యత్తుకు నిజమైన భరోసా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని పాత పెన్షన్ విధానంతో పోల్చి ఉద్యోగుల భవిష్యత్ భద్రత, సుప్రీంకోర్టు తీర్పుల ప్రభావం వంటి అంశాలను వివరించే వ్యాసం

ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన పెన్షన్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతోంది. ఉద్యోగి తన సేవా కాలాన్ని పూర్తి చేసి పదవీ విరమణ పొందిన తర్వాత గౌరవప్రదంగా జీవించేందుకు స్థిరమైన ఆదాయం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 16, తేదీ 30-03-2026 ఒక ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు.
ఎన్‌పీఎస్‌కు ప్రత్యామ్నాయ ఎంపిక..
ఈ పథకం 2025 ఏప్రిల్ 01 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జాతీయ పెన్షన్ విధానం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక ప్రత్యామ్నాయ ఎంపికగా అందుబాటులో ఉంచబడింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా కూడా చర్యలు ప్రారంభించింది. మంగళగిరిలోని వేతన, ఖాతాల అధికారిని రాష్ట్ర నోడల్ అధికారిగా నియమిస్తూ సభ్యుల నమోదు, చందాల సేకరణ, నిధుల బదిలీ, పర్యవేక్షణ వంటి బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగులు తమ ఎంపికను సంబంధిత కార్యాలయాలకు తెలియజేసే ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. ఇది పరిపాలనా పరంగా ఒక సక్రమమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం.
సేవల ప్రతిఫలం అనుగ్రహం కాదు..
ఈ సందర్భంలో డి. ఎస్. నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రస్తావన అత్యంత ప్రాముఖ్యమైనది. భారత సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో పెన్షన్‌ను కేవలం ప్రభుత్వ అనుగ్రహంగా కాకుండా ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలంగా లభించే హక్కుగా పేర్కొంది. అలాగే ఒకే విధంగా ఉన్న పెన్షనర్లను కేవలం తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ఉద్యోగి పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలనే భావన బలపడింది.
స్థిరమైన పెన్షన్‌కి ఛాన్స్ ఎక్కడ?
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులలో ప్రధానంగా మూడు విధాల పెన్షన్ వ్యవస్థలు చర్చలో ఉన్నాయి పాత పెన్షన్ విధానం, భాగస్వామ్య చందా పెన్షన్ విధానం, యూనిఫైడ్ పెన్షన్ పథకం. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు అత్యంత భద్రత కల్పించిన వ్యవస్థగా నిలిచింది. ఉద్యోగి ఎటువంటి చందా చెల్లించకుండా చివరి వేతనం ఆధారంగా స్థిరమైన పెన్షన్ పొందేవారు. దీని వల్ల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత ఉండేది. అయితే కాలక్రమేణా ఇది ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారాన్ని మోపింది. భాగస్వామ్య చందా పెన్షన్ విధానంలో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ చందాలు చెల్లిస్తారు. ఉద్యోగి భవిష్యత్తు ఆదాయం పెట్టుబడుల ఫలితాలపై ఆధారపడటం వల్ల మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
యూనిఫైడ్ పెన్షన్ ఒకే కానీ...
ఈ రెండు విధానాల మధ్య సమతుల్యత సాధించాలనే ఉద్దేశంతో యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చారు. ఇందులో చందాల విధానం కొనసాగుతూనే ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే పారదర్శకత అత్యంత కీలకం. ఉద్యోగి చందా, ప్రభుత్వ వాటా, వాటిపై వచ్చిన వడ్డీ వంటి వివరాలను ప్రతి నెల వేతన చీటీలో స్పష్టంగా చూపించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సమగ్ర ఖాతా వివరాలు అందించాలి. ఇలా చేస్తే ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుంది.పెన్షనర్ల అభిప్రాయం ప్రకారం పదవీ విరమణ అనంతరం కనీసం చివరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా రావాలి. అలాగే కరువు భృతి వంటి ప్రయోజనాలు కూడా సమానంగా వర్తించాలి. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే విధంగా పారదర్శకమైన, పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రావడం సమాజం, ప్రభుత్వ బాధ్యత.
-టి.ఎం.బి. బుచ్చిరాజు
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం
97034 25006






