‘కచ్చా బాదాం’తో ప్రపంచాన్ని ఊపేసిన పల్లికాయల వ్యాపారి కథ

by Ravi |   (  Updated:2026-05-22 01:01:00  IST  )

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లికాయల వ్యాపారి భువన్ బద్యాకర్ పాడిన “కచ్చా బాదాం” పాట ఎలా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందో, ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో, అలాగే కాపీరైట్ వివాదంలో ఎలా చిక్కుకున్నాడో తెలిపే కథనం.

‘కచ్చా బాదాం’తో ప్రపంచాన్ని ఊపేసిన పల్లికాయల వ్యాపారి కథ
X

ఒకప్పుడు కుటుంబ పోషణ కొసం గ్రామ వీధుల్లో పచ్చి పల్లికాయలు అమ్ముకుంటూ జీవనం సాగించిన ఓ సాధారణ వ్యక్తి గళం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆలపించే పాటగా మారడం నిజంగా ఆశ్చర్యకరం. జీవనోపాధి కోసం పాడిన “కచ్చా బాదాం” అన్న గొంతు సోషల్ మీడియా శక్తితో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భువన్ బద్యాకర్ జీవితాన్ని ఒక్క పాట ఎలా మార్చిందో, ఆ పాట ఆయనకు ఎలా గుర్తింపు, డబ్బు, అలాగే కాపీరైట్ సమస్యలను తెచ్చిపెట్టిందో తెలుసుకోండి. ఒకే పాటతో ఆ చిల్లర బేరగాడు తన వ్యాపారం వదిలి నేడు స్టేజీలు ఎక్కి పాటలు పాడుతూ లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు..

పశ్చిమ బెంగాల్, భీర్బుమ్ జిల్లాలోని కురల్జూరి గ్రామవాసి అయిన యాభై ఏళ్ల భువన్ ఈ అద్భుతాన్ని సాధించాడు. చిన్నప్పటి నుండి జానపదాలు ఇష్టమైన భువన్ రోజు వీధుల్లో తిరుగుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'కచ్చా బాదాం పక్కా బాదాం' అని పాడేవాడు. సొంత కవిత్వం జోడించి హాస్యాన్ని పండించే ఆయన పాట తీరు అందరికి నచ్చేది. విని నవ్వుకుంటూ ఎంతో కొంత కొనేవారు. ఊర్లోని ఒకరు ఆ పాటను వీడియోలో బంధించి యూట్యూబ్‌లో పెట్టాడు. వెదురు తడికలు అల్లి అమ్మడం, వర్షాకాలంలో ఇంటి కప్పులు సవరించడం ఆయన వృత్తి. ఆ సీజనల్ పనితో ఇల్లు గడవక పచ్చి పల్లికాయ అమ్మడం మొదలు పెట్టాడు. పల్లికాయను బెంగాలీలో చీనా బాదాం అంటారు. పచ్చి పల్లికాయ వాడుక పదం కచ్చా బాదాం. వీధుల్లో తిరుగుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'కచ్చా బాదాం పక్కా బాదాం' అని పాడేవాడు. ఆయన పాట తీరు అందరికి నచ్చేది. విని నవ్వుకుంటూ ఎంతో కొంత కొనేవారు.

బంగ్లాదేశ్‌లోనూ ప్రాచుర్యం పొంది..

ఊర్లోని ఒకరు ఆ పాటను వీడియోగా తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. కొద్దికాలంలోనే భువన్‌‌కు తెలియకుండానే ఆ పాట ఊరు ఎల్లలు దాటి వైరల్ అయింది. దాన్ని చూసిన వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ఆయనను కలవడానికి మ్యూజిక్ యూట్యూబర్లు వచ్చారు. ఆయన్ని ఆపి పాడించి రికార్డు చేయడం, ఆయనతో సెల్ఫీలు దిగడం మొదలైంది. అలా సోషల్ మీడియాలో ఆయన పాట మరింత ప్రచారాన్ని పొందింది. పట్టణాల్లో, నగరాల్లో జరిగే కచేరీల్లో ఆయనని పాడమనేవారు. ఆ తర్వాత రియాలిటీ షోల్లో పాల్గొనే అవకాశం లభించింది. అలా నలుగురిలో గుర్తింపుతో పాటు చేతికి డబ్బులు కూడా వచ్చాయి. బెంగాలీ భాషలో ఉన్న ఆ 4 నిమిషాల పాట బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌లోను ప్రాచుర్యం పొందింది. కలకత్తా, ముంబైల నుండి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. అక్కడి 5 స్టార్ హోటళ్లలో ఆయన పాటకు ఆదరణ లభించింది. తాను డిమాండ్ చేయకున్నా ఒక షోలో పాల్గొన్నందుకు సంతోషంగా లక్ష రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఆదాయం పెరిగింది. గుడిసె తీసేసి మంచి ఇల్లు కట్టుకున్నాడు. కారు కొనుక్కున్నాడు. బాదాం అమ్మడం కూడా ఆపేశాడు.

కాపీరైట్ విషయంలో మోసపోయి..

2021లో మొదలైన ఈ గాన ప్రస్థానం కొనసాగుతోనే ఉంది. పంజాబీ, హర్యానా భాషల్లోకి అనువదింపబడింది. వ్యూవర్స్ లక్షల్లో మొదలై కోట్లకు చేరుకున్నారు. లెక్కలేనన్ని రీల్స్ వచ్చాయి. ర్యాప్, రీమిక్స్ వెర్షన్లు వచ్చాయి. వివిధ మ్యూజిక్ కంపెనీలు భువన్ వద్ద ప్రసార హక్కులు కొని ప్రీమియంపై ఆయన పాటల్ని వినిపిస్తున్నాయి. కచ్చా బాదాం ఆల్బమ్ తరువాత ఆయన మరిన్ని పాటలు ఆల్బమ్‌గా వచ్చాయి. అన్నిటిని తానే రాసి ట్యూన్ చేస్తున్నాడు. అయితే కచ్చా బాదాం పాటపై కాపీ రైట్స్ తీసుకోనందువల్ల ఆ పాటను వేరేవాళ్లు ఎందరో పాడుతూ పేరు, డబ్బు సంపాదించుకుంటున్నారని భువన్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. పైగా కాపీ రైట్ హక్కుల విషయంలో కూడా ఆయన మోసపోయాడు. ఒక కంపెనీ వాళ్లు యూట్యూబ్‌లో పాట అనుమతి కోసం రూ. 3 లక్షలు చెల్లిస్తామని చెప్పి ఆయనతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. చదువురాని భువన్ వేసిన వేలిముద్రతో సొంత పాటపై కాపీ రైట్ కోల్పోయాడు. దీనిపై ఆయన కోర్టుకు ఆశ్రయించవలసి వచ్చింది.

తెలుగు సినిమా లిరిసిస్టులు కూడా చడీచప్పుడు కాకుండా దూర దూర గ్రామాలకు వెళ్లి పల్లె పాటలను రికార్డు చేస్తున్నారు. వాటినే అటు ఇటు మార్చి ఇక్కడ హిట్టు కొడుతున్నారు. గ్రామీణ సంగీతాన్ని రీమిక్స్ చేసి పేరు పొందుతున్న తీరుని హిందీ సినిమా 'తాళ్'‌లో సుభాష్ ఘాయ్ ఎత్తి చూపారు. కోర్టు ప్రమేయంతో కచ్చా బాదాం పాట తిరిగి భువన్ సొంతం కావాలి.

- బద్రి నర్సన్

94401 28169

Next Story