పీఏసీఎస్‌లపై రాజకీయ నీడ..

by Ravi |   (  Updated:2026-04-29 00:30:16  IST  )

పీఏసీఎస్‌లలో ఎన్నికల బదులు నామినేటెడ్ విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతుల్లో ఆందోళన రేపుతోంది. సహకార సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, రైతు ప్రతినిధిత్వంపై ఈ మార్పు ఎలా ప్రభావం చూపుతుందో తెలిపే విశ్లేషణ.

పీఏసీఎస్‌లపై రాజకీయ నీడ..
X

పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం)ల ద్వారా రైతుకు జరిగే లాభం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతుకు విత్తనాలు, ఎరువులు, రుణాలతో పాటు స్టోరేజ్ ఇతర అవసరాల రీత్యా పీఏసీఎస్‌లు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించిన క్రమంలో ఆయా సొసైటీ సభ్యులైన రైతులు తమ డైరెక్టర్లు, చైర్మన్లుగా రైతు పక్షపాతిగా ఉన్న వారిని ఎన్నుకుంటారు.. కాగా, తాజాగా కాంగ్రెస్ సర్కారు నామినే‌టెడ్ పద్ధతిలో ‘పీఏసీఎస్’ నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రైతు వర్గాలు పెదవి విరుస్తు న్నాయి.. ఇప్పటికే మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా... వీటికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పోస్టులను కూడా నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు.. దీంతో సహకార ఎన్నికలు లేకుండానే పీఏసీఎస్ పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఎలాగైతే పాలకవర్గాలను నామినేటెడ్‌ పద్ధతిలో నియమిస్తున్నారో అదే పద్ధతిలో సొసైటీలకు పాలక మండళ్లను నియమించనున్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. కానీ రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే, ఎన్నికల విధానంలో పాలక వర్గాలను ఎన్నుకోవడం ద్వారా జవాబుదారీతనం ఉండటమే కాదు.. రైతులకు న్యాయం జరుగుతుందని, ‘నామినేటెడ్’ విధానంతో కేవలం అధికార పార్టీ కేడర్, లీడర్లు మాత్రమే తమ ఇష్టానుసారంగా వ్యవహరించే అవకా‌శాలుంటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సం‘క్షేమం’ కోసం నిజంగా పరితపించే కాంగ్రెస్.. ఎందుకు ఎన్నికల విధానానికి స్వస్తి చెప్పిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. బహుశా, రైతు సమాజం కాంగ్రెస్ పట్ల సానుకూలంగా లేదనే నేపథ్యంలోనే ఎన్నికలకు బదులు ‘నామినేటెడ్’ పద్ధతికి సర్కారు రంగం సిద్ధం చేసుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల భావాలను గౌరవిస్తూ, పారదర్శకతను కాపాడే విధంగా నిర్ణయాలను పునఃసమీక్షించడం అవసరం. లేకపోతే, రైతు స్వరానికి దూరమవుతున్న పాలనగా ఇది మిగిలిపోయే ప్రమాదం ఉంది.

- కె.బాపురావు,

95533 07006

Next Story