ఆధ్యాత్మిక ఛత్రం నీడలో…లైంగిక జ్ఞాన బోధ 'OMG-2'

by Disha edit |
ఆధ్యాత్మిక ఛత్రం నీడలో…లైంగిక జ్ఞాన బోధ OMG-2
X

ఈ 2023లోనూ శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడితే మహాపరాధమైపోతున్న మన దేశంలో... యుక్తవయస్సు కూడా రాని పిల్లల్లో సెక్స్ భావనలు, సెక్స్ ఆకాంక్షల గురించి ఒక సినిమా తీయాలంటే సినీ నిర్మాతలకు, దర్శకులకు. నటీనటులకు కూడా ఎన్ని గట్స్ ఉండాలి? సనాతన ధర్మ రక్షణ భావన ఈ కాలంలో కూడా వెర్రితలలెత్తుతున్న దేశంలో లైంగిక వాంఛలు, లైంగిక విద్యపై ఇంత చర్చకు తావిచ్చే సినిమాను నిర్మించడానికి ఎంత సాహసం కావాలి? నిజానికి దేవుడనే భావననే వ్యతిరేకించే వారికి ఓ మై గాడ్- 2 సినిమాను కన్నెత్తి చూడాలనిపించదనేది వాస్తవమే. ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ మాట అలా ఉంచండి.

140 కోట్ల ప్రజలున్న ఘనమైన దేశంలో, చంద్రయాన్ గురించి, గగన్ యాన్ గురించి గొప్పలు చెప్పుకుంటున్న మన దేశంలో సెక్స్ అనే భావననే బహిరంగంగా చర్చించడానికి భయపడుతున్న కుటుంబాలని, పాఠశాలలను, విద్యా సంస్థలను, చివరకు మొత్తం దేశాన్ని ఈ ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి ఎదుగుతున్న పిల్లలకు ఇంజనీరింగ్, మెడికల్, ఐటీ కోర్సుల గురించి నూరిపోయడం తప్ప, శరీర విజ్ఞానం విషయంలో ఇది మంచి, ఇది చెడు అనే విషయాలను చెప్పడానికి నేడు కూడా సంకోచిస్తున్న దేశం మనది. శృంగారానికి సంబంధించి తాముచూస్తున్న, వింటున్న వాటిపై సందేహాలను తీర్చుకోవడానికి పిల్లలు కాస్త ధైర్యం చేస్తే చాలు... 'నోర్మూసుకో' అంటూ పెద్దవాళ్లు వారిని అడ్డుకుంటారు. ఇది 1950లు 60ల నాటి చందమామ కథల కాలం కాదు... 2023 నాటి అంతరిక్ష యాన్ కాలం అని గుర్తుంచుకోవాలి. ఇక పాఠశాల స్థాయిలో పునరుత్పత్తి అంశంపై పాఠాలు ఉన్నా వాటిని సైన్స్ కోణంలో బోధించడానికి ఉపాధ్యాయులు సైతం వెనుకాడుతుండటం యావత్ ప్రపంచంలో మన దేశానికే సంబంధించిన విశేషమని చెప్పవచ్చు, కానీ దేశం చర్చించడానికి కూడా భయపడుతున్న అత్యంత సున్నితమైన అంశాన్ని పరమ హాస్యస్ఫోరకంగా, అదే సమయంలో అత్యంత గంభీరంగా, భావోద్వేగపరంగా చెప్పి ఒప్పించడంలో ఓఎంజీ-2 చిత్ర దర్శకుడు సాధించిన విజయం సాధారణమైంది కాదని చెప్పాలి.

కథేంటంటే..

స్కూల్లో టాయ్‌లెట్‌లో ఒక విద్యార్థి చేసిన చర్య వీడియో రూపంలో బయటపడి పాఠశాల నుంచి అతడు బహిష్కరణకు గురైన తర్వాత, పరమభక్తుడైన ఆ విద్యార్థి తండ్రి ఏం చేశాడు? అవమానం భరించలేక ఊరే వదిలిపెట్టి పోవాలనుకున్న అతడి తండ్రి కాంతి శరణ్ ముగ్ధల్ (పంకజ్ తివారి) ఒక దేవదూత సహాయంతో తనకు తాను న్యాయపోరాటానికి ఎలా దిగాడు? రహస్యంగా చేసే ప్రతి పనీ తప్పు కాదు. నీ కొడుకు చేసింది తప్పు కాదు, నీ సమస్యను నీవే పరిష్కరించుకో అంటూ ఆ దేవదూత ఇచ్చిన సలహాను ఆ కన్నతండ్రి ఎలా స్వీకరిస్తాడు చివరకు సమాజమంతా అశ్లీలం, పాపచర్య అంటూ తప్పు పడుతున్న ఆ కార్యాన్ని విద్యార్థులు సైతం సపోర్టు చేస్తూ యావత్ సమాజం ఆమోదాన్ని ఎలా పొందుతారు అనేదే ఓఎమ్‌జి-2 సినిమా కథ. శివుడి వాహనం నందిగా అక్షయ్ కుమార్ చాలా పరిమిత పాత్రను అత్యంత జనరంజకంగా పోషించి ఆకట్టుకున్న ఈ సినిమాను... తన నటనతో, డైలాగ్ డెలివరీతో, సోషల్ కామెడీతో, భావోద్వేగాల ప్రదర్శనతో పంకజ్ తివారీ పూర్తిగా తన భుజాలపై మోశారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇకపోతే విక్కీ డోనార్, లాస్ట్, దస్వి, యురి ది సర్జికల్ స్రైక్.. చోర్ నికల్ కే భాగా.. ఇలా ప్రతి సినిమాలో, వెబ్ సీరీస్‌లో విశిష్టమైన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన యామీ గౌతమ్ మరోసారి ప్రత్యర్థి లాయర్‌గా నటిస్తూ పంకజ్ తివారీతో పోటీ పడింది. ఇక దర్శకుడు అమిత్ రాయ్ ఒక అత్యంత సున్నితమైన అంశాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చూపించడంలో నూటికి నూరు శాతం కృతకృత్యుడయ్యాడు. పిల్లలకు, తలిదండ్రులకు మధ్య వారధిగా నిలిచి, చాలా మంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే ఓ మై గాడ్- 2 మన దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక పాఠం అని చెప్పాలి.

మనదేశంలో సెక్స్ ఎలా అశ్లీలమంటూ?

కాంతి కుమారుడు వివేక్‌ని తోటి పిల్లలు నీ మర్మాంగం చిన్నది అంటూ గేలి చేయడంతో కుపితుడైన వివేక్ టాయ్‌లెట్‌కి వెళ్లి మాస్టర్‌బేట్ చేసుకుంటాడు. తన ఈ చర్యను అదే విద్యార్థులు వీడియో తీసి ఆన్ లైన్‌లో పెట్టడంతో స్కూల్ యాజమాన్యం ఆ పిల్లాడిని స్కూల్ నుంచి వెళ్లిపోమని ఆదేశించడమే కాదు... కొన్నాళ్లు పట్టణం నుంచి వెళ్లిపోయి దూరంగా ఉండమని తండ్రీ కుమారులను సలహా ఇస్తుంది. ఆ వీడియో మొత్తంగా వైరల్ కావడంతో కుంగిపోయిన వివేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతాడు. దేవదూత రూపంలో ఉన్న అక్షయ్ కుమార్ అతడిని రక్షించడమే కాదు... రహస్యంగా చేసే ప్రతి చర్యనూ తప్పు పట్టలేమని, నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోమని తండ్రికి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు కాంతి శరణ్ ఆ పిల్లాడి పాఠశాల మీద, తన కుమారుడిని ఆ చర్యకు ప్రేరేపించిన పిల్లల మీద దావా వేస్తాడు. ఇంతవరకు జరిగిన కథ ఒక ఎత్తైతే. కోర్టు డ్రామాలో కాంతి శరణ్ విశ్వరూపం ప్రదర్శిస్తాడు. భారతీయ సమాజంలో తొలి నుంచి సెక్స్‌కి, లైంగిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉండేదని చెబుతూ కామసూత్ర, ఖజురహో, పంచతంత్రలను ఉదహరిస్తూ హిందూ తత్వశాస్త్రం లైంగిక విద్య విషయంలో ప్రారంభం నుంచి అత్యంత ఉదారంగా ఉంటూ వచ్చిందని, తన కుమారుడు చేసిన పనికి ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని కోర్టులో వాదిస్తాడు. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని కోర్టు హాల్‌లో హాస్యస్ఫోరకమైన డైలాగుల ద్వారా, న్యాయమూర్తితో సహా అందరినీ కడుపుబ్బా నవ్వింప చేస్తూనే విషయ గాంభీర్యతను పక్కకు పోనివ్వకుండా చేసిన దర్శకుడి ప్రతిభకు అభినందనలు తెలపాల్సిందే.

అందరూ తప్పక చూడాల్సిన సినిమా!

స్కూళ్లలో మానవ శరీరంలోని మర్మాంగాలను (ప్రైవేట్ పార్ట్స్) ఫోటో రూపంలో పెట్టి మరీ వివరిస్తుంటే, సెక్స్ అనే పదమే మన దేశంలో ఎలా అశ్లీలమవుతోందని? సినిమాలో పంకజ్ తివారీ కోర్టు హాల్‌లో వివరిస్తున్నప్పుడు ఒళ్లు జలదరించకమానదు. కామసూత్ర వంటి ప్రాచీన లైంగిక విజ్ఞాన గ్రంథాన్ని 2 వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి అందించిన మన దేశంలో ఎందుకు సెక్స్‌ని అంత ఘోరమైన విషయంగా, చర్చించడానికి వీల్లేని గుప్త విషయంగా చూస్తున్నారు అంటూ పంకజ్ తివారీ... ఎలాంటి పెడబొబ్బలు పెట్టకుండా వివరిస్తారు. ఎంత సినిమాటిక్‌గా కోర్టు సీన్లను చూపినప్పటికీ సెక్స్ గురించి బహిరంగ చర్చ జరగాలి అని యువత ఒకవైపు, దేశ సంస్కృతి సంప్రదాయాలను ధ్వంసం చేస్తున్నాడంటూ కాంతి శరణ్ ముగ్ధల్ పాత్రధారి పంకజ్ తివారిపై అసంఖ్యాక ఆరోపణలు చేస్తూ బెయిల్ లేని కేసులు పెట్టాలని అన్ని మతాల్లోని ఛాందసవాదులు ఒకవైపు చేస్తున్న వాదనలతో సమాజమే రెండుగా చీలిపోతుందీ సినిమాలో.

ఈ సినిమా మొత్తం ఒకెత్తు అయితే, ఎదిగిన పిల్లల నుంచి ముసలి వగ్గుల వరకు ప్రపంచమంతా ప్రాచీన కాలం నుంచి చేస్తూ వస్తున్న ఒక లైంగిక చర్యపై బహిరంగ చర్చకు తావిస్తూ అది పాపకార్యం కాదని, ప్రతి ఒక్కరూ ఒక వయసుకు వచ్చిన తర్వాత రహస్యంగా చేసుకుంటున్న ప్రకృతి సహజమైన చర్య అనీ చిన్న పిల్లలతోటే చివరలో చేయించిన వాదన ఒకెత్తు. ఇది పాపకార్యం కానేకాదని, నేనూ మాస్టర్ బేసిన్ చేసుకుంటున్నానని ఒక్కొక్క విద్యార్థి కోర్టు ముందుకు వచ్చి చెబుతుంటే యావత్ సమాజం ముక్తకంఠంతో అవును, అవును అని న్యాయమూర్తి ముందు నినదిస్తుంది. వీ నీడ్ సెక్స్ ఎడ్యుకేషన్, యెస్ ఐ డూ (మాస్టర్ బేట్), ఐ టూ డూ ఇట్, వియ్ ఆల్ నీడ్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ జడ్జి కుమారుడితో సహా ప్రతి ఒక్కరూ లేచి చేతులు పైకెత్తి... సమాజం నేటికీ అంగీకరించని ఆ పాప కార్యానికి సామూహిక మద్దతు ప్రకటిస్తారు... చివరలో ఈ మొత్తం కథకు కారణమైన కాంతి శరణ్ (పంకజ్ తివారీ) కుమారుడు ఐ యామ్ నాట్ షేమ్ లెస్, ఐ యామ్ లక్కీ, నేను ఏ తప్పూ చేయలేదు అని ప్రకటిస్తూంటే బహిరంగ సభ అవతారమెత్తిన కోర్టుహాల్‌లో నిశ్శబ్దం తాండవిస్తుంది. బ్రిటిష్ స్కూల్ కరిక్యులమ్ ప్రకారం నడిచే సర్వోదయ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ మొత్తం పరిణామానికి దోషి అనీ, తక్షణం ఆ స్కూల్ సంస్కరణలను మొదలెట్టాలని ఆదేశిస్తూ, కాంతి శరణ్‌కు సమాజం మొత్తంగా నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పి ధర్మాసనం నుంచి లేచి వెళ్లిపోతాడు.

బాధాకరమైన విషయం ఏమిటంటే సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఇంతటి సాహసోపేతమైన బహిరంగ చర్చకు తావిచ్చిన ఓ మైగాడ్ -2 సినిమా హిందీలో తప్ప ఓటిటీలో కూడా ఇతర భారతీయ భాషల్లో ఇంకా రాకపోవడమే. దేశంలోని అన్ని భాషల్లోనూ డబ్ కావలసిన సినిమా ఇది. హిందీ ప్రాంతంలో 150 కోట్ల రూపాయలు ఆర్జించి పెద్ద విజయం సాధించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి ఎందుకు అనువదించలేదన్నది ప్రశ్నార్థకం. తెలుగులో కూడా ఒక స్టార్ హీరోను పెట్టి దీన్ని రీమేక్ చేసే ఉద్దేశం ఉందని వార్తలు. ఇదే నిజమైతే ఒరిజినల్ సినిమాను మనవాళ్లు కుళ్ళబొడిచి పాడు చేస్తారనడంలో సందేహమే లేదు. ఈ లోగా, హిందీలో అయినా సరే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో చూడగలిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆస్తిక, నాస్తిక చర్చలను పక్కనబెట్టి చూడవలసిన అరుదైన సినిమా 'ఓఎమ్‌జి 2'.

కె. రాజశేఖరరాజు

73964 94557


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed