- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాన్వాయ్‌ల తగ్గుదల.. కొన్నాళ్ల రాచక్రీడ!
రాజకీయ నాయకుల నిరాడంబర జీవనం, వీఐపీ సంస్కృతి, ప్రజల మనస్తత్వం, గాంధీ-సుందరయ్యల సరళ జీవన విధానం, నేటి రాజకీయ ప్రదర్శనల మధ్య తేడాపై విమర్శనాత్మక వ్యాసం.

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా! అని దెబ్బలకాగలేనప్పుడైనా నిలదీసాడు రామదాసు. మనం అంత పని చెయ్యం. వాహన శ్రేణులలో వాహనాలను కొంతమేరకు తగ్గించుకున్నందుకు పత్రికల నిండా విశేష వార్తలు.. ఇక ఏ మంత్రివర్యులో, ప్రజా ప్రతినిధో ఆటోలోనో, మోటార్ సైకిల్ మీదనో, ప్రభుత్వ రవాణా సంస్థ వారి బస్సులోనో ప్రయాణం చేస్తే దూరదర్శనాలలో అవే పదేపదే దర్శనం.
మరి ఇన్నాళ్లుగా ఏ భద్రతా కారణాల వలన అన్నన్ని వాహనాల మీద విహారం చేసారని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అంతమంది భద్రతా సిబ్బంది, కాన్వాయ్‌లు ఎక్కడా ఆపకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డంకులు లేకుండా చూడడం, ఆ దారంట ఇతరుల ప్రయాణాలని నిరోధించడం ఎందుకు చేసారని అడిగే దుర్మార్గం మన రక్తంలో లేదు. ఈ హంగామాల కారణంగా సగటు జీవులకి ఎంత ఇబ్బంది కలిగినా ఎవరూ కిమ్మనరు.
గాంధీ, సుందరయ్య ఇద్దరూ ఒకటే..
ఒక్కసారి గతంలోకి వెళ్దాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలక పక్షాలన్నీ గాంధీ గారి నామజపమే చేస్తాయి కదా. మరీ దేశ విభజనకి ముందు మతకలహాల కారణంగా కల్లోలిత ప్రాంతాలైన, నోయాకాళీ, తిప్పెరా (ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కొమిల్లా ప్రాంతం) లోని అనేక గ్రామాలను మహాత్ముడు కాలినడకన మార్చి నెల సమయంలో సందర్శించారు. అప్పటి బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రయత్నించినా, గాంధీజీ అంగీకరించలేదు. ‘ప్రజల మధ్య నమ్మకంతోనే భద్రత ఉండాలి’ అన్నది వారి విశ్వాసం. ఇక పుచ్చలపల్లి సుందరయ్య కూడా అంతే రాజ్యసభ సభ్యుడిగా ఉండి, కమ్యూనిస్ట్ పక్ష పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరించిన సైకిల్‌నే ప్రయాణానికి వాడేవారు. ఈ విషయాలు మన నవతరం నాయకులలో చాలామందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాళ్లు ఎన్నికల సమయంలో చేతులు కలుపుతారు. పసికూనల్ని ముద్దు చేస్తారు. కుర్చీ ఎక్కగానే షరా మాములే. అంతవరకు రాసుకు, పూసుకు తిరిగిన జనాన్ని అధికార పీఠం ఎక్కగానే, సదరు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతులు ఆమడ దూరంలో ఉంచుతారు. నాయకులు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రారన్నది అధిక సంఖ్యాకులు ఎరిగినదే.
నేతలంటేనే అంత గౌరవం మరి..
నాయకుడు రాజకీయాలలో తొలి అడుగు పెట్టగానే మనం పదిమందీ వారి వెనక పడతాం. వెళ్లిన ప్రతి చోటా దండిస్తాం. అంతవరకు మనం వారినుద్దేశించి ఉపయోగించిన ‘వాడు వీడు’ పదాలు నాలుకల మీదకు రావు. మొదట ‘వారు’ క్రమేపీ ‘తమరు’గా మారుతారు. ఆరంభంలో వారు ఆశీనులయ్యేవరకు మనం నిలబడే ఉంటాం. కొన్నాళ్ల తర్వాత తమరు అయినవారు తాము కూర్చుని మనల్ని కూర్చోమన్నా అంత సాహసం చెయ్యం. మనం ఇష్టపడి నెత్తికెక్కించుకున్నప్పుడు అవతలవారు స్వారీ చేయడం మానుతారా! మనం మాత్రం బిర్యానీ ప్యాకెట్, మందు పొట్లం చేతికి చిక్కాక, తేరగా ఏర్పాటైన వాహనాలు ఎక్కడం మానతామా! బల ప్రదర్శన కోసం జరిగే బహిరంగ సభలకు బారులు తీరకుండా ఉండగలమా! ఆ జనసందోహం, గజమాలలు, గగనతలం మార్మోగే కరతాళ ధ్వనులు అలవాటైన నాయకులు నిరాడంబరంగా బతకాలంటే జరిగే పనా. మన కార్యాలయాలలో, గృహాలలోనూ ఈ అంచెలంచెల వ్యవస్థదే ప్రాబల్యం. మనం మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులమైనా, మన ముందు నాలుగవ తరగతి ఉద్యోగి కూర్చొనరాదు. ఇళ్లలోకి పనివాళ్లను తప్పక రానిస్తాము గాని కూర్చోమంటామా? ఉదారత కండువా కప్పుకున్నవారు కూర్చోమన్నా అవతలివారు కూర్చుంటారా!
జీతం కంటే 'గీతం' పైనే మక్కువ
చాలాకాలంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రధానులు, ముఖ్యమంత్రులే తీసు కుంటున్నారు. ఇతర నేతలంతా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, కాంట్రాక్టుల అప్పగింతలు లాంటి గురుతర బాధ్యతలని నిర్వహిస్తుంటారు. అధికార బృంద సహకారమూ తీసుకుంటారు. ఏ కొద్దిమందో తోడ్పడకపోతే, వారిని మాన్యాలు పట్టిస్తారు. లేదా ప్రక్కకు తప్పిస్తారు. ఇక మిగిలిన వివిధ స్థాయిల అధికారులలో, ఉద్యోగులలో అసంఖ్యాకులకి జీతం కంటే గీతం అంటేనే మక్కువ. సామాన్యులు కూడా పనుల గురించి కార్యాలయాలు చుట్టూ తిరిగే కన్నా ఒక్కసారి ఆమ్యామ్యా సమర్పించుకుంటే పని జరుగుతుందని తెలుసుకుని తూచా తప్పక పాటిస్తున్నారు. ఇవాళ భార్యావిహీనుడైన ఒక విశ్రాంత అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకుంటే, మృతదేహానికి సంబంధించిన ప్రక్రియల్లో ప్రతిచోటా చెయ్యి తడపక తప్పలేదు. నేను చెప్పదలచినదేమంటే, ఇంధనం కరు వొచ్చినా, మరో ఉపద్రవం మీదపడ్డా, స్వార్థరహిత నాయకత్వం ఇప్పట్లో ఎండమావే. అందుకు ఎవరినైనా తప్పుపడదామంటే, నాలుగు వేళ్లూ మనవైపే.
- మల్లాప్రగడ రామారావు
99898 63398






