- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ వర్కర్ల సంఖ్య పెరగడానికి కారణం..
‘సెక్స్’ అనే పదాన్ని వినకూడని మాటగా నటించే మన సమాజంలో సెక్స్ వర్కర్ల సంఖ్య పెరగడం ఎటువంటి సంకేతాలను పంపిస్తోంది?

‘సెక్స్’ అనే పదాన్ని వినకూడని మాటగా నటించే మన సమాజంలో సెక్స్ వర్కర్ల సంఖ్య పెరగడం ఎటువంటి సంకేతాలను పంపిస్తోంది? వ్యభిచారం నిషిద్ధకరంగా కనిపించే దేశంలో సెక్స్ వ్యాపారం బయటకు కనిపించని అతిపెద్ద పరిశ్రమగా, ప్రకటితం కానీ అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటిగా ఎదుగుతోందంటే దీనిపై సమగ్రంగా ప్రభుత్వాలతో పాటు సమాజంలో ఒక బలమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లు గణనీయంగా పెరుగుతుంటే దీని వెనుక మూలలను అధ్యయనం చేసి ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం కచ్చితంగా ఉందనే మాట కాలగమనంలో వస్తున్న ‘మార్పు’ చెబుతున్న పాఠం.
సంఖ్యలు చెబుతున్న సత్యం
మనదేశంలో సెక్స్ వర్కర్లు పెరుగుతున్న క్రమంలో తాజాగా వస్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో మహిళా సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ అని ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (పీఎంపీఎస్ఈ) నివేదిక తెలుపుతోంది. కర్ణాటకలో 15.4 శాతం సెక్స్ వర్కర్లు ఉంటే ఏపీలో 12 శాతం, తెలంగాణలో 7.6 శాతం సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే మొత్తం 19.6శాతంసెక్స్ వర్కర్లు ఉన్నారంటే ఏ మేరకు సెక్స్ బిజినెస్ ముందుకు దూసుకెళుతుందో అర్ధమవుతోంది. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 651 జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు (FSW) ఉంటే.. పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే పురుషులు (MSM) 3,51,020 మంది ఉన్నారు. హాట్ స్పాట్లలో కూడా తెలుగు వారి సంఖ్య బలంగానే ఉందంటే ఈ సెక్స్ రాకెట్ ఎంత దారుణంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
సెక్స్ వర్కర్లు పెరగడానికి కారణాలు..
పేదరికం, అక్రమ రవాణా, కుటుంబాల్లో వివక్ష, విలాస వంతమైన జీవితం, ఆర్థిక సమస్యలు, వివాహ జీవితం ఫెయిల్ కావడం లాంటి ప్రధాన సమస్యలతో పాటు కొన్ని కారణాలతో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలు తమ పేదరికంతో ఈ వృత్తిలోకి మారితే, రానురాను ఆకలితో కడుపు కాలిన వారితో పాటు కడుపు నిండిన వారు కూడా తమ విలాసవంతమైన జీవితం కోసం మరింతగా ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతో తమ అడుగులను ఇటు వైపు మళ్లించడమే అసలు సమస్యగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి లేని వారు ఈ వృత్తిలోకి వస్తుంటే.. కొన్ని కుటుంబాలు తమ మహిళలను ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టడం, కొన్ని వర్గాలు మహిళల బలహీనతలను ఆధారంగా చేసుకొని ప్రభావితం చేయడం, బ్లాక్ మెయిలింగ్‌తో ఈ వృత్తిలో కూరుకుపోవడంతో తిరిగి వెనక్కిరాలేక మగ్గిపోతున్న మహిళల సంఖ్య పెరిగిపోయింది.
దగాపడ్డ మహిళలపై దయ వద్దా..?
పేదరికంతోనో, లైంగిక దోపిడీకి గురై సెక్స్ వర్కర్లుగా మారుతున్నవారిపై సమాజం చూపే తీరులో మార్పు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో వారు గౌరవంగా జీవించేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో దీనిని ఒక బలమైన వ్యాపారంగా మలిచి తమ సంపదలను పెంచుకొనే ముఠాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. లైంగిక క్రూరత్వానికి, హింసలకు బలై ఆనారోగ్యం పాలై సమాజ ఆద రణకు నోచుకోకుండా కొవ్వొత్తిలా కరిగిపోతున్న ఈ వృత్తిలోని మహిళల జీవితాలు వెలుగుల వైపు పయనించాలంటే ప్రభుత్వాలు, ఎన్జీవోలు, సమాజంలోని ఆయా వర్గాల ప్రజలు చేయూతను అందించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ న్యాయవాది స్నేహ ముఖర్జీ మాట్లలో చెప్పాలంటే ..“సమాజ దృక్పథమే ప్రధాన సమస్య.. సెక్స్ వర్కర్‌లోనే ఏదో తప్పు ఉంది, వారి వద్దకు వెళ్లే వ్యక్తుల్లో కాదని మనం భావిస్తున్నంత వరకు మనం ఎటు వంటి మార్పును చూడలేము”. అంటుంది. ఇది అక్షర సత్యం.
సెక్స్ పరిశ్రమలో జాబ్స్
జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధమైనది. అందుకే ఇక్కడ కౌఫ్ మచ్ డాట్ కామ్ అనే సంస్థ సెక్స్ విషయంలో ఒక సంచలనానికి తెర లేపింది. సెక్స్ వర్కర్లతో గడిపి వారి సేవలు, ఆరోగ్యం, శుభ్రత గురించి రిపోర్ట్ చేసే ఉద్యోగాలను కల్పిస్తోంది. ఈ జాబ్‌కి ఎన్నికైన వారు ప్రాసిట్యూట్స్ వద్దకు వెళ్లి వారితో సెక్స్ చేసి సామర్థ్యం తెలుసుకుని రిపోర్ట్ అందజేయాలట. ఈ ఉద్యోగ ప్రకటనతో యూరప్ దేశాల నుండి అనేక అప్లికేషన్లు ఈ సంస్థకు చేరుకున్నాయి. ప్రధానంగా దీని ఉద్దేశ్యం జర్మనీలో సెక్స్ పరి శ్రమను అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్‌తో ఆ సంస్థ ఈ తరహా కార్యక్రమానికి ముందడుగు వేయడం సంచలనం సృష్టిస్తుంది.
బూతు అయితే.. ఇంత వ్యాపారం ఎలా?
మనదేశంలో సెక్స్ వ్యాపారం పరిశ్రమగా పైకి కనిపించకపోయినా.. దాదాపు 2 లక్షల 75 వేల వేశ్య గృహాల్లో 20 లక్షల మంది సెక్స్ వర్కర్లను కలిగి, వీటి వార్షిక ఆదాయం 8 బిలియన్ల డాలర్లకు పైగా ఉందంటే సెక్స్ మాట వినకూడని సమాజంలో జరుగుతున్న తంతును ఏమనాలి? నిజానికి సెక్స్ వర్కర్లు సమాజానికి హానికరం కాదు. అందుకే ప్రభుత్వాలు వారికి మెరుగైన పునరావాసం, ఉపాధి అవకాశాలను, ఆర్థిక భరోసాను కల్పించే విధంగా కృషి చేయాలి. అప్పుడే వారిలో మార్పు తీసుకురావడం కొంతమేరకు సాధ్యమవుతుంది. వారిలో అవగాహన పెంచడం, వారి హక్కులకు భంగం లేకుండా చేయడం, సాధికారత కల్పించి వారి సమస్యలకు పరిష్కారం చేయడంలో కృషి చేయాలి.
- అడపా దుర్గ
90007 25566






