- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ ప్రయోజనమే ప్రధాని సందేశం..
వంటనూనె వినియోగం తగ్గించడం నుంచి బంగారం కొనుగోళ్లు నియంత్రించే వరకు ప్రధాని మోడీ చేసిన సూచనలు దేశ ఆర్థిక భద్రత, స్వావలంబన దిశగా ఎంత కీలకమో విశ్లేషణ. విదేశీ మారక నిల్వలు, దిగుమతుల భారంపై ప్రత్యేక కథనం.

బామ్మ మాట- బంగారు బాట అంటారే, ఆ తరహాలో ప్రధాని చెప్పిన ‘బంగారు మాట’ ప్రస్తుతం దేశం ఆచరించాల్సిన బాట. దశాబ్దాల క్రితం నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒక పూట తిండి మానేస్తే దేహానికీ, దేశానికీ మంచిది' అని పిలుపునిచ్చారు. దేశంలో ఆహార ఉత్పత్తి చాలక, దిగుమతులు భారమైన స్థితిలో అప్పటి ఆహార భద్రతకి ఊతమిచ్చే సందేశం అది. ఇప్పుడు మళ్లీ నేటి ప్రధాని మోడీ ఏడు ఆర్ధిక అంశాలు దేశ ప్రజల్ని పాటించమని నిన్న ఒక సభ ద్వారా తెలిపారు. అందులో ఒకటి పది శాతం వంట నూనె వినియోగం తగ్గిస్తే కుటుంబ ఆరోగ్యానికీ, దేశ ఆర్ధికానికీ మేలు చేస్తుంది. రెండోది బంగారం కొనడం ఒక ఏడాది పాటు మానెయ్యమని. ఈ రెండు సూచనలు దేశ ప్రజలు కళ్లు మూసుకుని పాటించవచ్చు.. ఇక తమ అలవాట్లను, ఆకర్షణల్ని కట్టడి చెయ్యడం ద్వారా మిగిలిన సూచనలు కష్టతరమైనవి. అవేమిటంటే పెట్రోల్ వాడకం తగ్గించడానికి కార్ పూలింగ్ లాంటివి పాటించమని, ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచమని, ప్రయాణాలు తగ్గిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అవకాశాల్ని వెదకమని. ఈ సూచనలు కూడా మంచివే కానీ అమలు చెయ్యగల స్కోప్ తక్కువ. ఇవి అమలు కావాలంటే ఆ తరహా వ్యవస్థని అంచెల వారీగా నిర్మించాలి. అందుకు ప్రభుత్వమే ముందుండాలి. ఉదాహ రణకు ప్రజా రవాణా వ్యవస్థ దశలవారీగా మెరుగు పరిస్తే అందరూ అటువైపు మళ్లే అవకాశం ఉంటుంది. చవకైన, భద్రమైన ప్రజా రవాణా ఉంటే, ఎవరు మాత్రం ఖరీదైన స్వంత రవాణా ఎంచుకుంటారు? అలాగే రసాయన ఎరువులు, ఆహార భద్రత విషయంలో కూడా ఇప్పటికిప్పుడు ఏం చెయ్యలేం. ప్రధాని ఈ సూచనలు చెయ్యడానికి ముఖ్య కారణం విదేశీ మారక నిల్వలు తరిగిపోతుండటం. అంత ర్జాతీయ పంపిణీ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనై ధరలు మండిపోతున్నాయి. సరకులు దొరకడం లేదు. విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించాల్సిన అవసరం ముంచు కొస్తుంది. యుద్ధాలు, ఇతర విధాన మార్పులతో అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలౌతుంది. ఆ దెబ్బ తీవ్రత తగ్గించు కునే మార్గాలివి. ఖచ్చితంగా ఇవి పాటించాల్సినవే.. కాకపోతే ఇందులో ప్రభుత్వం చెయ్యాల్సిందే ఎక్కువ ఉంది. స్వావలంబన, ఆర్ధిక స్థిరత్వం అన్ని వేళలా ఆలోచించాల్సినవి. అప్పటికప్పుడు సంస్కరించాల్సినవి కావు.
-డా.డి.వి.జి శంకరరావు,
94408 36931






