డిజిటల్ ఇండియాలో పేరు సంక్షోభం.. నా పేరు ఎలా రాయాలి?

by Ravi |   (  Updated:2026-07-03 01:15:58  IST  )

భారతదేశంలోని విభిన్న పేరు సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందిస్తున్న డిజిటల్ వ్యవస్థలు పౌరులకు ఎలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి? ఓటర్ జాబితా సవరణలు, ఆధార్ వివరాల సరిపోలికలో తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విశ్లేషణ.

డిజిటల్ ఇండియాలో పేరు సంక్షోభం.. నా పేరు ఎలా రాయాలి?
X

భారతదేశం లాంటి సువిశాల, బహుళ సంస్కృతుల దేశంలో ఒక విధానాన్ని లేదా సాంకేతికతను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నప్పుడు స్థానిక ఆచారాలు, సామాజిక జీవన విధానాలను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత కీలకం. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత డిజిటల్ పరిపాలనలో ఈ సమతుల్యత లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సరికొత్త వివాదాలకు, పౌరుల తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్నది.

ఈ ప్రత్యేక సవరణ డ్రైవ్‌లో భాగంగా ఆన్‌లైన్ ద్వారా ఓటర్ కార్డుల సవరణలు లేదా ఆధార్ అనుసంధానాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న లక్షల మందికి సాంకేతిక వ్యవస్థలు మొండిచేయి చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ప్రక్రియ కోసం వాడుతున్న సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ఉన్న తీవ్రమైన లోపాలు.. భారతదేశ భౌగోళిక, సంస్కృతులపై ఉన్న అవగాహనా రాహిత్యమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ సమస్య కేవలం ఒక ఓటర్ల జాబితా సవరణకో, ఒక ప్రత్యేక డ్రైవ్‌కో పరిమితమైంది కాదు. అసలు మన దేశం లో ఒక పౌరుడి పేరును డిజిటల్ వ్యవస్థల్లో ఎలా నమోదు చేయాలి? అనే ప్రాథమిక అంశంలోనే ఒక సరైన ప్యాటర్న్, ఏకరూపత లేకపోవడం నేడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పరిపాలనాపరమైన, సామాజిక సంక్షోభానికి దారితీస్తున్నది.

పేరు సంస్కృతి.. సాఫ్ట్‌వేర్ల నిరంకుశత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో శతాబ్దాలుగా ప్రజల జీవన విధానం ప్రకారం ‘ఇంటి పేరు’ అనేది అత్యంత ప్రాధాన్యమైనది.. అది ఎల్లప్పుడూ వ్యక్తి పేరుకు ముందే వస్తుంది. కానీ, జాతీయ స్థాయిలో డిజైన్ చేయబడే ఐటీ అప్లికేషన్లు అన్నీ పాశ్చాత్య లేదా ఉత్తరాది ప్యాటర్న్ అయిన ‘ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్’ అనే ఫార్మాట్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఉత్తరాదిలో ఇంటిపేరు లేదా కుల సూచికలు పేరు చివరన రావడం సాధారణం. ఈ రెండు భిన్నమైన సంస్కృతుల మధ్య సమన్వయం కుదర్చడంలో మన సాఫ్ట్‌వేర్ అల్గాలిథమ్స్ దారుణంగా విఫలమవుతున్నాయి. ప్రస్తుతం డేటా యాక్యూరసీని పరిశీలించే ఆటోమేటెడ్ టూల్స్ కేవలం అక్షరాల కలయికను మాత్రమే కాకుండా, పేరులోని స్థానాన్ని కూడా కచ్చితంగా పోల్చి చూస్తున్నాయి. దీనివల్ల ఒక వ్యక్తి ఆధార్ కార్డులో ఇంటిపేరు మొదట ఉండి, ఓటర్ ఐడీలో అది చివరన ఉంటే, అక్షరాలన్నీ వంద శాతం సరిపోయినప్పటికీ సిస్టమ్ దానిని తిరస్కరిస్తున్నది. కేవలం ఇంతటితోనే ఈ సమస్య ఆగడం లేదు. ఒక కార్డులో ఇంటిపేరు కేవలం ఒక అక్షరంగా (ఉదాహరణకు ఎస్పీ హరీశ్) ఉండి, మరో కార్డులో పూర్తి పేరు (శ్రీపెరంబుదూర్ హరీశ్) ఉంటే, వాటిని ఒకే వ్యక్తిగా గుర్తించే కనీస 'ఫజ్జీ లాజిక్' అల్గారిథమ్ కూడా ఈ వ్యవస్థల్లో లేదు. వీటికి తోడు ఇంగ్లిష్ నుండి తెలుగులోకి లేదా పేర్లను మార్చేటప్పుడు జరిగే గ్రామర్ దోషాలు, మహిళల వివాహానంతర ఇంటిపేర్ల మార్పులు ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తిగా సంక్లిష్టం చేస్తున్నాయి. ఫలితంగా ఆ దరఖాస్తులను సాఫ్ట్‌వేర్లు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాయి.

దక్షిణాది ఇతర వర్గాల ప్రత్యేక చిక్కులు..

ఈ పేరు ప్యాటర్న్ సమస్య కేవలం హిందువుల ఇంటిపేర్ల దగ్గరే ఆగిపోవడం లేదు. దక్షిణాది ముస్లిం సమాజంలో పేరు పెట్టే పద్ధతులు మరింత భిన్నంగా, సంక్లిష్టంగా ఉంటాయి. అరబిక్ సాంప్రదాయాన్ని అనుసరించి కొందరు పేరు మధ్యలో ‘బిన్’ (Bin - కుమారుడు) లేదా ‘బింతె’ (Binte - కుమార్తె) అని వాడుతుంటారు. డిజిటల్ ఫారాల్లో ఈ ‘Bin’ అనే పదాన్ని ఎక్కడ వేయాలో అర్థం కాక, అది మిడిల్ నేమ్‌గా మారిపోయి డేటాబేస్ మ్యాచ్ కాకుండా పోతున్నది. ఒక కార్డులో సయ్యద్ అహ్మద్ అని ఉంటే మరో కార్డులో కేవలం అహ్మద్ అని మాత్రమే ఉండటం వల్ల సిస్టమ్ రిజెక్ట్ చేస్తున్నది. ఇక తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో అసలు ఇంటిపేరే ఉండదు. తండ్రి పేరు లేదా పుట్టిన ఊరి పేరునే ఇంటిపేరుగా వాడుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ఇదే చేస్తారు. ఇవన్నీ ‘ఫస్ట్, మిడిల్, లాస్ట్’ అనే మూడు ఫీల్డుల నిరంకుశ ఫార్మాట్లలో ఇరుక్కుపోయినప్పుడు.. లాస్ట్ నేమ్ అనేది తప్పనిసరి కావడంతో పేరును ముక్కలు చేసి రాయాల్సి వస్తుంది. రవికుమార్ సత్యం అనే పేరులో రవికుమార్ వ్యక్తి పేరు.. సత్యం తండ్రి పేరు అయితే, సత్యం అనేది లాస్ట్ నేమ్‌గా మారుతున్నది. దీనివల్ల కంప్యూటర్ జనరేట్ చేసే ఉత్తరాల్లో ఆ వ్యక్తిని ‘మిస్టర్ సత్యం’ అని డ్రాఫ్ట్ చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఏకరూపత తేవాలి!

ఒకే దేశం - ఒకే గుర్తింపు అన్నప్పుడు, సాఫ్ట్‌వేర్ ఫార్మాట్‌ లు ఒక ప్రాంత సంస్కృతికి మాత్రమే అద్దం పడుతూ, మరో ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే.. సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్లలో ‘ఫస్ట్, మిడిల్, లాస్ట్’ అనే విభజనను పూర్తిగా తొలగించి, కేవలం ‘పూర్తిపేరు’ అనే ఒకే ఒక ఫీల్డ్‌ను ప్రవేశపెట్టాలి. దీనివల్ల వ్యక్తి తన సంస్కృతిని బట్టి ఇంటిపేరు ముందైనా, వెనకైనా రాసుకునే స్వేచ్ఛ ఉం టుంది. సాఫ్ట్‌వేర్ కేవలం వ్యక్తి పేరులోని అక్షరాల క్రమాన్ని, వయస్సును, తండ్రి లేదా భర్త పేరును మాత్రమే సరిచూసుకోవాలి. టెక్నాలజీ అనేది మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడానికి ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడాలి. భారతదేశ వైవిధ్యా న్ని, బహుళత్వాన్ని గౌరవిస్తూ డిజిటల్ వ్యవస్థలను రీ-డిజైన్ చేసినప్పుడే, ఎలాంటి వివక్ష లేదా మినహాయింపులు లేని అసలైన ‘డిజిటల్ ఇండియా’ ఆవిష్కృతమవుతుంది.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story